25 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన మురుగన్
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ 25 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారిగా వేలూరు కోర్టులో హాజరయ్యాడు. రాజీవ్ హత్య కేసులో మురుగన్, అతని భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్ మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. జైలులో సెల్‌ఫోన్‌లు నిషేధం ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు మురుగన్ గదిలో తనిఖీలు చేపట్టి రెండు సెల్‌ఫోన్‌లు, చార్జరు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.
మురుగన్ సెల్‌ఫోన్ ఉపయోగించినందున మూడు నెలలపాటు ఎవరినీ కలిసి మాటాడేందుకు అవకాశం ఇవ్వలేదు. జైలు గదిలో సెల్‌ఫోన్ ఉపయోగించిన కేసులో వేలూరు జెఎం వన్ కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. మురుగన్ కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి మే నెల 4వ తేదికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. అయితే, ఆయనతో న్యాయవాది తప్ప ఎవరినీ కలిసి మాట్లాడేందుకు అనుమతించలేదు.
మురుగన్ జైలులో స్వామిజీ తరహా మౌనవ్రతంలో ఉన్నట్లు పుకార్లు వచ్చిన విషయం విదితమే. వాటిని నిరూపించే విధంగా కోర్టులో హాజరయ్యే సమయంలో మురుగన్ గడ్డంతో షర్టు లేకుండా పచ్చ దుస్తులు మాత్రమే కప్పుకొని రావడంతో స్వామీజీ మాదిరి ఉన్నాడు. సాయిబాబా, మారియమ్మన్‌ల మొక్కుల కోసమే ఇలా మారినట్లు సమాచారం.