వేలూరు: స్థానిక మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళినితో మాట్లాడేందుకు ఆమె భర్త మురుగన్ విముఖత వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని మహిళా జైలులోను, ఆమె భర్త మురుగన్‌లు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి భార్యభర్తలిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంట్లో భాగంగా గత నెల 20వ తేదీన నళిని, మురుగన్‌లు మాట్లాడుకున్నారు.
ఇదిలాఉండగా శనివారం వీరిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం జైలు అధికారులు మురుగన్‌కు తెలిపారు. అయితే ఇందుకు మురుగన్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వేరే ఏ రోజైనా ఆమెతో మాట్లాడతానని మురుగన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో మురుగన్ నళినితో కలిసేందుకు ఎందుకు నిరాకరించాడు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.