మురుగన్, నళిని
సాక్షి, చెన్నై: విదేశాల్లో ఉన్న బంధువులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు నళిని, మురుగన్‌లకు అనుమతి ఇవ్వవచ్చుగా అని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఈ విషయంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధి హత్య కేసులో నిందితుల విడుదలకు పట్టుబడుతూ సాగుతున్న న్యాయ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో జైల్లో ఉన్న నిందితులు తీవ్ర మనో వేదనలో ఉన్నారని.. పెరోల్ ఇవ్వాలని కొన్ని పిటిషన్లు, తమ వాళ్లతో సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని మరికొన్ని పిటిషన్లు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.
అదే సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురైన నళిని గత వారం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్ ఒకటి సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయ స్థానం విదేశాల్లో ఉన్న బంధువులతో వీడియో కాల్ లేదా, ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుకునేందుకు అనుమతి ఇవ్వవచ్చుగా అని కోర్టు కేంద్రానికి సూచించింది. నళిని, మురుగన్‌లు కుటుంబీకులతో మాట్లాడాలని, వారిని చూడాలన్న ఆశతో ఉన్నట్టుందని పేర్కొంటూ, ఈ విషయంగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment