ఇప్పటికే గవర్నర్లుగా ఉన్న తమిళిసై సౌందరరాజన్, ఇలగణేశన్, కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయి పదవుల్లో తమిళులకు ప్రాధాన్యమిస్తూ అటు నాయకులను, ఇటు ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే ఇద్దరు గవర్నర్లు, ఓ కేంద్రమంత్రి తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా మరొకరికి రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదా దక్కింది. దీంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే.. ఎప్పటికైనా పదవి సిద్ధిస్తుందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్రంలో ఊపందుకుంది. ఇది రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
తమిళనాడులో పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అధిష్టానం ‘కొత్త’ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న మరో సీనియర్ నేతకు గవర్నర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. ఝార్ఖాండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడడంతో ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. సీపీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అలాగే మరో సీనియర్‌నేత ఇలగణేషన్‌ను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. తాజాగా ఆయన్ని అక్కడి నుంచి నాగాలాండ్‌కు బదిలీ చేశారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఎల్. మురుగన్‌కు ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు కూడా అవకాశం రాక పోదా..? అని ఎదురు చూసిన బీజేపీ సీనియర్ సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ పదవి దక్కింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ అధిష్టానం, మరో నేతను అందలం ఎక్కించడం విశేషం.
కార్యకర్త నుంచి గవర్నర్ స్థాయికి..
తిరుప్పూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయస్సు నుంచే ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999లో రెండు సార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగారు. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అంటే సీపీరాధాకృష్ణన్ అనే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన కన్నా జూనియర్లు అనేక మంది రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్తున్న సమయంలో, తనకు అవకాశం దక్కక పోదా? అని ఎదురు చూసిన సీపీఆర్ ఎట్టకేలకు లక్కీచాన్స్ కొట్టేశారు.
మద్దతుదారుల సంబరాలు
సీపీ రాధాకృష్ణన్‌ను ఝార్ఖాండ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగానే ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇక సీఎం ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి, ఉప నేత పన్నీరు సెల్వం, గవర్నర్లు తమిళి సై, ఇలగణేషన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్యంగం ప్రకారం విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.
చదవండి: ట్రెజర్ హంట్ – ఎంపవర్‌మెంట్!
వారధిగా ఉంటా..
తనను కొత్త గవర్నర్‌గా నియమించినట్లు సమాచారం రావడంతో తిరుప్పూర్‌లో సీపీ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనకు దక్కిన గౌరవం కాదని.. తమిళనాడు ప్రజలకు లభించిన గొప్ప అవకాశం అని అభివర్ణించారు. అందుకే తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని, ఝార్ఖాండ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రమిస్తానని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment