Rajiv gruhakalpa residential
-
ఆడుకుంటూ.. అనంత లోకాలకు.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకార.. ఖమ్మం జిల్లాకు చెందిన మూర్తమ్మ కొన్ని సంవత్సరాలుగా సూరారం రాజీవ్ గృహకల్ప 29/27వ బ్లాక్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు తులసీనాథ్ (13) ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు సెలవు కావడంతో తులసీనాథ్ రాజీవ్ గృహకల్ప 27వ బ్లాక్‌లోని భవనంపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతో బాలుడి తండ్రి కనకరత్నం కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి మూర్తమ్మ టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. -
పెళ్లైన పది రోజులకే యువజంట బలవన్మరణం..!!
సాక్షి, మేడ్చల్ : ఇటీవలే వివాహం చేసుకున్న నూతన వధూవరులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఓల్డ్ అల్వాల్‌లోని చిన్నన్నతోటలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన మున్నా మల్లేష్ (26) దంపతులు ప్రేమించుకుని 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్నోజి గూడ వద్ద గల రాజీవ్ గృహకల్పలోని బ్లాక్ నెంబర్ 78లో నివాసముంటున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం రాజీవ్ గృహకల్పలో నివాసముండేందుకు ఇటీవల వచ్చివెళ్లారని, మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 457 కోట్ల నల్లా బిల్లు బకాయిలు మాఫీ
* గ్రేటర్లో 3,12,468 పేద కుటుంబాలకు లబ్ధి * ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలవేళ పేదలపై రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. గ్రేటర్ పరిధిలోని మురికివాడలు, రాజీవ్ గృహకల్ప నివాస సముదాయాల్లో నివసిస్తున్నవారు, గృహ వినియోగదారుల నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేసింది. పేదలకు సంబంధించి రూ. 457.75 కోట్ల పెండింగ్ నల్లా బిల్లు బకాయిలను మాఫీ చేస్తూ మంగళవారం మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులతో గ్రేటర్ పరిధిలో 3,12,468 పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో మురికివాడలకు చెందిన 68,261 కుటుంబాలు, రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో నివసిస్తున్న 8,563 కుటుంబాలు, గృహ వినియోగ కేటగిరీ కింద 2,35,644 అల్పాదాయ, మధ్యాదాయ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. 2015 నవంబర్ నాటికి మొత్తం నల్లా బిల్లు బకాయిలురూ. 299.52 కోట్లు కాగా.. దీనిపై కొన్నేళ్లుగా విధించిన వడ్డీ రూ.158.18 కోట్లుగా ఉంది.బకాయిలతో పాటు ఈ వడ్డీ మొత్తాన్నీ ప్రభుత్వం మాఫీ చేయడం గమనార్హం. తాజా ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వం జలమండలి ఎండీని ఆదేశించడంతో పేదలకు ఉపశమనం లభించింది. కాగా, జలమండలి పరిధిలో మొత్తం 8.46 లక్షల నల్లా కనెక్షన్లుండగా.. మాఫీతో 3,12,468 మందికి లబ్ధి చేకూరనుంది. అత్యధికంగా పాతనగరంలో రూ. 3 వేల నుంచి రూ.50 వేల వరకు బకాయి పడిన వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.