అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు
సిడ్నీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలలో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు జీక్యూజీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ జైన్ తాజాగా స్పష్టం చేశారు. భారత్‌లో 25 శాతం ఎయిర్ ట్రాఫిక్ అదానీ నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్టుల ద్వారానే నమోదవుతున్నట్లు జైన్ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ సరుకు రవాణా(కార్గో)లో అదానీ గ్రూప్ పోర్టులు 25 నుంచి 40 శాతం పరిమాణాన్ని సాధిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఐదేళ్లుగా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు చేపట్టేందుకు వేచిచూస్తున్నట్లు విలేకర్ల సమావేశంలో జైన్ తెలియజేశారు.
స్థానిక ఇన్వెస్టర్లతో జైన్ సమావేశమ వుతున్నారు. అయితే షేర్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో దీర్ఘకాలం వేచి చూసినట్లు వెల్లడించారు. కాగా.. ఇటీవల అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీలలో అమెరికా ఈక్విటీ పెట్టుబడుల కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ 1.87 బిలియన్ డాలర్లు(రూ. 15,446 కోట్లు) ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇకపైన కూడా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులను మరింత విస్తరించనున్నట్లు జైన్ స్పష్టం చేశారు. ఇటీవల సెకండరీ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)లకు చెందిన మైనారిటీ వాటాలను జీక్యూజీ పార్ట్నర్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
అదానీ పవర్ అనుబంధ సంస్థల విలీనం
పూర్తిస్థాయి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకున్నట్లు అదానీ పవర్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. వీటిలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, ఉడుపి పవర్ కార్పొరేషన్, రాయ్‌పూర్ ఎనర్జెన్, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్, అదానీ పవర్ ముంద్రా లిమిటెడ్ ఉన్నట్లు పేర్కొంది. గత నెల(ఫిబ్రవరి) 8న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ ఇందుకు అనుమతించినట్లు తెలియజేసింది.