పట్టాలు తప్పిన రాజ్య రాణి ఎక్స్ప్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం మీరట్- లక్నో రాజ్య రాణి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
రాంపూర్, ముందపండా స్టేషన్ల మధ్య గల బ్రిడ్జి సమీపంలో రైలు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి తీవ్రగాయాలు కాలేదని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ నీరజ్ శర్మ వెల్లడించారు. సహయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
రైలు ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత నవంబర్లో ఇండోర్- పాట్నా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 142 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడిన విషయం తెలిసిందే.