Rakhine
-
400 మంది ముస్లింలు ఊచకోత
-
400 మంది ముస్లింలు ఊచకోత
సాక్షి, రఖైన్: సుగంధ ద్రవ్యాల సువాసనలతో అలరారే మయన్మార్ మట్టి రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు విరుచుకుపడటంతో వారిని అడ్డుకునేందుకు ఆర్మీ నరమేధానికి దిగాల్సివచ్చింది. మత ఘర్షణల్లో సుమారు 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఆ దేశ సైనికాధిపతి మిన్ ఆంగ్ హ్లెయింగ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ దేశంలో నివసించే రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ(మైనారిటీ). దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు రఖైన్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. బర్మాలో బౌద్ధులకు, రోహింగ్యా ముస్లింలకు మధ్య విభేదాలు కొత్తవేమీ కాదు. గత ఐదేళ్లుగా ఈ మత పరమైన సంక్షోభం బర్మాలో కొనసాగుతూనే ఉంది. సైన్యం, రోహింగ్యా ముస్లింల మధ్య జరుగుతున్న మారణహోమంలో రఖైన్ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. ఎంతలా అంటే వాటి ఆనవాళ్లు కూడా తెలుసుకోలేనంతలా. సైన్యం మీద కక్ష్యతో రోహింగ్యా మిలిటెంట్లు మారుమూల గ్రామాలకు నిప్పు పెడితే.. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు. బంగ్లాదేశ్‌కు చేరేందుకు అడ్డుగా ఉన్న నాఫ్ నదిని దాటేందుకు తాత్కాలిక పడవలను ఆశ్రయించారు. అయితే, అవి మార్గం మధ్యలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊచకోతలపై దేశ వ్యాప్తంగా పుకార్లు చెలరేగడంతో అశాంతి నెలకొంది. రఖైన్ రాష్ట్రం జాతి, మతపరంగా చీలిపోయింది. ఊచకోతలో మరణించిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని, మిలటరీ దళాలు తక్కువ మంది మరణించినట్లు లెక్కలు చూపుతున్నాయని స్వచ్చంద సంస్ధలు ఆరోపిస్తున్నాయి. జాతిని కూకటివేళ్లతో పెకలించేందుకే.. రోహింగ్యా జాతిని నశింపజేసేందుకు సైన్యం, బౌద్ధులు యత్నిస్తున్నారని స్వచ్చంద సంస్థల ఆరోపణ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కూడా మయన్మార్‌పై ఇదే ఆరోపణ చేశారు. బర్మాలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకూ 27 వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు పారిపోయినట్లు ఐరాస ఓ ప్రకటనలో పేర్కొంది. మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. పౌరుల ప్రాణాలను కాపాడాలని మయన్మార్ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. -
మయన్మార్ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి
మాంగ్డా: మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది. -
మయన్మార్‌లో మారణకాండ
- బంగ్లా సరిహద్దు రఖీనేలో తీవ్రవాదుల దాడి - 70 మంది మృతి.. వందల మందికి గాయాలు నెపిటా: మయన్మార్‌లో మరోసారి రక్తపుటేరులు పారాయి. బంగ్లాదేశ్ సరిహద్దులోని రఖీనే రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్రవాదులు జరిపిన భీకర దాడుల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడికి పాల్పడింది రోహింగ్యా ముస్లిం(బెంగాలీ) తీవ్రవాదులేనని మయన్మార్ ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బంగ్లా సరిహద్దులోని మంగ్టావ్ పోలీస్ స్టేషన్‌ను తీవ్రవాదులు పేల్చేశారని, అదే సమయంలో రఖినేలోని కొన్ని పోలీస్ స్టేషన్లు, ఆర్మీ క్యాంపులపైనా దాడులు జరిగాయని, మొత్తం 200 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని, కొందరు సాధారణ పౌరులు కూడా చనిపోయారని ఆర్మీ వర్గాలు చెప్పారు దశాబ్ధాల వైరం: బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే రఖీనే రాష్ట్రంలోకి రొహింగ్యా ముస్లింల వలసలు ఎక్కువ. దీంతో స్థానిక ప్రజలకు, వలసదారులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఒక దశలో రంగంలోకి దిగిన సైన్యం.. రోహింగ్యాలను తిరిగి బంగ్లాదేశ్‌లోకి వెళ్లగొట్టేయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రారంభమైన హింసాయుత పోరాటం.. దశాబ్ధాలుగా కొనసాగుతోంది.