rakshaka thadi
-
చెనక్కాయకు రక్షకతడి కష్టం
అనంతపురం అగ్రికల్చర్: కన్నీరు కార్చడానికి కూడా నీళ్లు కరువైన అనంతపురం జిల్లాలో... లక్షలాది ఎకరాల వేరుశనగ పంటకు రక్షకతడి ఇచ్చి కాపాడటం ఎవరి వల్ల కాదని శింగనమలకు చెందిన రైతు విజభాస్కర్ చెప్పారు. మంగళవారం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంశంపై ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలతో జరిగిన సమీక్షా సమావేశంలో పలువురు రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. వ్యవసాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ కె.రాజారెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ నాయుడు, క్రీడా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కేవీ రావు తదితరుల సమక్షంలో రైతులు మాట్లాడారు. వేరుశనగకు రక్షకతడి అసాధ్యం లక్షల ఎకరాల వేరుశనగకు రక్షకతడి ఇవ్వడం ఎవరి వల్లా కాదు. నీటి వనరులు అందుబాటులో లేవు. బోరుబావులు నీళ్లు రాక ఎండిపోతున్నాయి. ఉన్న పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 10 నుంచి 20 మిల్లీమీటర్లు (మి.మీ) మేర రెండు మూడు తడులు ఇస్తే గానీ వేరుశనగ పండదు. దానికి బదులు కంది పంటకు రక్షక తడి ఇస్తే ప్రయోజనం ఉంటుంది. తక్కువ కాలవ్యవధి కలిగిన కంది రకాలు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయడం కూడా కష్టమే. చాలా మంది రైతులు ఆగస్టు నెలలో కూడా వేరుశనగ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్వింటా రూ.11 వేలకు కొంటే... ఇపుడు అమ్మాలంటే రూ.7 వేలు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ కోసమైనా వేరుశనగ వేసే పరిస్థితి ఉంది. - విజయభాస్కర్, శింగనమల నవధాన్యాలను ప్రోత్సహించాలి వేరుశనగను తగ్గించి నవధాన్యపు పంటలను ప్రోత్సహించాలి. పావు కిలో, అర కిలో అంటూ కిట్లు రూపంలో అరకొరగా ఇస్తే ప్రయోజనం ఉండదు. ముందస్తు ప్రణాళికతో చిరుధాన్యాలు, నవధాన్యపు పంటలపై అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే పంటల విస్తీర్ణం పెరుగుతుంది. - భాస్కర్, చెన్నేకొత్తపల్లి -
కంట‘తడి’
- జిల్లా పర్యటనలో రక్షకతడి ఊసెత్తని సీఎం చంద్రబాబు - ఉద్యాన రైతుల ఆశలు ఆవిరి - పండ్ల తోటలకు పెను విపత్తు - వేలాది ఎకరాల్లో ఎండిపోతున్న తోటలు - తీవ్ర ఆందోళనలో అన్నదాతలు అనంతపురం అగ్రికల్చర్ : రక్షకతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యాన రైతులకు చివరికి కంటతడే మిగిలింది. పండ్లతోటలను వేసవి విపత్తు నుంచి కాపాడేందుకు రక్షకతడులు ఇస్తామని ఈ నెల 20న జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని రైతులు ఎదురుచూశారు. అయితే ఆయన ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. రక్షకతడులు ఎప్పుడిస్తారంటూ రోజూ ఉద్యానశాఖ అధికారులకు ఫోన్ చేస్తూ వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీరా సీఎం వచ్చాక ఆ విషయాన్నే మరచిపోయారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసి కూడా జిల్లా మంత్రులు కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఆయన వద్ద ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడం రైతులతో పాటు అధికారులనూ విస్మయానికి గురి చేసింది. పండ్ల తోటల విషయంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య ధోరణి ఉద్యాన రైతులను అష్టకష్టాలు, తీవ్ర నష్టాల పాలు చేసే ప్రమాదముంది. ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా పేరుగాంచి.. ఉద్యానహబ్ దిశగా అడుగులేస్తున్న ‘అనంత’లో ప్రస్తుతం పండ్లతోటల మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలో 1.71 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో చీనీ, మామిడి, అరటి, దానిమ్మ, సపోటా, బొప్పాయి, జామ, ద్రాక్ష, రేగు, ఆకు, వక్క, కూరగాయలు తదితర పండ్లు, పూలు, ఔషధ తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా చీనీ 45 వేల హెక్టార్లు, మామిడి 39 వేల హెక్టార్లలో ఉన్నాయి. 26 మీటర్లకు పైగా పడిపోయిన భూగర్భజలం ఈ ఏడాది నైరుతితో పాటు ఈశాన్య రుతుపవనాలు కూడా మొహం చాటేయడంతో వర్షం జాడ కరువైపోయింది. వర్షపాతం 42 శాతం తక్కువగా నమోదైంది. పైగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాల సగటు మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా 26 మీటర్లకన్నా ఎక్కువ లోతుకు పడిపోయింది. ఇప్పటికే 75 వేలకు పైగా బోరుబావులు ఎండిపోయినట్లు అంచనా. పండ్లతోటలను కాపాడుకునేందుకు కొందరు కొత్త బోర్లు వేయిస్తూ విఫలమవుతున్నారు. మరికొందరు ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నా పూర్తిస్థాయిలో రక్షించుకోలేకపోతున్నారు. అధికారికంగా ఇప్పటికే ఐదు వేల ఎకరాల్లో చీనీ తోటలు, మూడు వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా 12వేల ఎకరాల్లో చీనీ, ఏడు వేల ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితి ఉండటంతో పండ్లతోటలు పెద్దఎత్తున ఎండిపోయే ప్రమాదముంది. ఆశలు రేకెత్తించి.. ఆపై నీళ్లు చల్లారు ఈ వేసవిలో చీనీ, మామిడి తోటలకు రక్షకతడి ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారులు ఆశలు రేకెత్తించారు. కనీసం 20 వేల ఎకరాలకు రక్షకతడి ఇవ్వడానికి రూ.42 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి, ఉద్యాన శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు కూడా పంపారు. చీనీతోటలకైతే ఎకరాకు నెలకు రూ.6,400, మామిడికైతే రూ.3,600 ఇవ్వాలని ప్రతిపాదించారు. సీఎం జిల్లా పర్యటనలో రక్షకతడికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని అంతా భావించారు. అయితే..చివరకు చేదు అనుభవమే ఎదురైంది. పండ్లతోటల గురించి సీఎం తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అధికారుల ప్రతిపాదనలకు కూడా ఉద్యాన కమిషనరేట్ నుంచి సానుకూల స్పందన రాలేదు. -
కంది పంట కాపాడేందుకు రక్షకతడి
కణేకల్లు : కంది పంటను కాపాడుకునేందుకు రక్షకతడులు అందిస్తున్నామని జేడీఏ శ్రీరామూర్తి పేర్కొన్నారు. మండలంలోని పులచెర్ల, పుల్లంపల్లి గ్రామాల్లో సాగులో ఉన్న కంది పంటను రాయదుర్గం ఏడీఏ మద్డిలేటి, ఏఓ శ్రీనివాసులతో కలిసి గురువారం పరిశీలించారు. జేడీఏ మాట్లాడుతూ రక్షకతడి కోసం ఒక ట్యాంకుకు రూ.430 ఖర్చు అవుతోందని, ఇందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 20 శాతం రైతులు భరించాలన్నారు. అనంతరం ఆయన మండలంలోని బ్రహ్మసముద్రం, బెణికల్లు గ్రామాల్లో హెచ్చెల్సీ ఆయకట్టులో నీళ్లు లేక ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. బాధిత రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. -
రక్షకతడి పేరుతో రూ. కోట్లు స్వాహా
అనంతపురం సెంట్రల్ : కంది పంటలకు రక్షకతడి అందించే ముసుగులో అధికారపార్టీ నేతలు రూ. వందల కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్దం చేశారని డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రక్షించినట్లు కాకిలెక్కలు చూపి రూ. 300 కోట్లు దిగమింగారని ఆరోపించారు. ప్రస్తుతం కంది పంటకు రక్షకతడి అందించాలని చెబుతూ మరో రూ. 300 కోట్లు నొక్కేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు.