Rallapadu Project
-
రాళ్లపాడుకు జలసిరులు
వర్షాధారిత ప్రాజెక్ట్‌గా మిగిలిన రాళ్లపాడుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో జలసిరులు పొంగనున్నాయి. 1.1 టీఎంసీల సామర్థ్యం కలిగిన రాళ్లపాడు ప్రాజెక్ట్ నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరు. ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఇప్పటికే సోమశిల జలాలను కేటాయించగా, తాజాగా వెలిగొండ నుంచి కూడా నీటి వాటాను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాళ్లపాడులో నిరంతరం జలకళ తాండవియనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాళ్లపాడు ప్రాజెక్ట్.. రతనాల ప్రాజెక్ట్‌గా మారనుంది. కేవలం వర్షాధారితంగా నీటిని నింపుకునే ఈ ప్రాజెక్ట్‌కు ఇక నుంచి పుష్కలంగా నీటి వనరులు అందనున్నాయి. అటు పెన్నా, ఇటు కృష్ణా నది జలాలు తరలి రానున్నాయి. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టుకు పెన్నానది జలాలు వస్తుండగా, భవిష్యత్‌లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. మరో పక్క రాళ్లపాడు ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిని పెంచేందుకు ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీంతో రాళ్లపాడు ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు, తాగునీటి అవసరాలకు పుష్కలంగా నీరు అందనుంది. నీటి వనరులతో సస్యశ్యామలం రాళ్లపాడు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.1 టీఎంసీలు. అధికారిక, అనధికారిక ఆయకట్టు కలుపుకుని మొత్తం 25 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని 130 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు దాదాపు 2.2 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. తాజా నిర్ణయంతో సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీల నీరు అదనంగా ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కింద 20.14 కి.మీ. పొడవు ఉండే కుడి కాలువ పరిధిలో లింగసముద్రం, గుడ్లూరు, కొండాపురం మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 3 కి.మీ. పొడవు ఉండే ఎడమ కాలువ కింద లింగసముద్రం, వలేటివారిపాళెం మండలాల్లో 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా వర్షాధార ప్రాజెక్ట్ కావడంతో వర్షాలు పడి ప్రాజెక్ట్ నిండితేనే పంటలు పండుతాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో కేవలం రెండు, మూడు సార్లే పూర్తి స్థాయిలో పంటలు పండాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సోమశిల ఉత్తర కాలువ ద్వారా 1.5 టీఎంసీల నీటిని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు కేటాయించారు. 1.17 టీఎంసీల వెలిగొండ జలాలు వెలిగొండ ప్రాజెక్టు నుంచి 1.17 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. నీటి కేటాయింపుతో పాటు కాలువ పనులకు రూ.6.14 కోట్లు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉదయగిరికి నీటిని తరలించే ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌లోకి నీటిని మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి రాళ్లపాడు వరకు మొత్తం 57 కి.మీ. దూరం ఉంది. కేవలం 4 కి.మీ. కాలువ తవ్వడం ద్వారా ఉప్పువాగు నుంచి నక్కలగండి చెరువుకు మళ్లించి అక్కడి నుంచి మన్నేరు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులోకి నీటిని తరలించాలనేది ప్రతిపాదన. త్వరలో టెండర్ల కేటాయించి, పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్లు రామాయపట్నం పోర్టు భూమి పూజకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టేందుకు రూ.27 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 3 కి.మీ. పొడవు ఉన్న కాలువను 15.95 కి.మీ. మేర పొడిగించనున్నారు. తద్వారా కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 1,500 ఎకరాల నుంచి 4 వేల ఎకరాలకు పెరుగుతోంది. చీమలపెంట, శాఖవరం, వీఆర్ కోట, కలవళ్ల, నలదలపూరు గ్రామాల చెరువులకు నీరు అందుతోంది. వర్షాధారితంగా చేరే నీటితో పాటు అదనంగా సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీలు రావడంతో ప్రాజెక్ట్ పరిధిలో ఆయకట్టు 40 వేల ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా. ఎడమ కాలువ -
ఐదేళ్లు ‘రాళ్ల’పాలు!
సాక్షి, లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గానికే తలమానికమైన రాళ్లపాడు ప్రాజెక్టు ఎన్నడూ లేని విధంగా కరువు రక్కసిలో కొట్టుమిట్టుడుతోంది. 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేక ప్రాజెక్టు దిగువ ప్రాంతం రైతులు అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో గ్రామాలు విడిచి రాష్ట్రం దాటి బయటకు వెళ్లారు. ఇంత జరుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం రైతులపై చిన్నచూపు చూసిందనే చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి సోమశిల ఉత్తర కాలువ పనులు పూర్తి చేయించి ప్రాజెక్టుకి సోమశిల జలాలు తీసుకురండి అని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నాయకులు రైతుల గోడు ఎవరూ పట్టించుకోలేదు. రైతు సంఘం నాయకులు ప్రాజెక్టు వద్ద ధర్నా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి చేపట్టారు. తన వ్యాపారాలకే పరిమితమైన ఎంఎల్ఏ పోతుల రామారావు రాళ్లపాడు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చింతలదేవి వద్ద అడ్డంకులు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి వద్ద సోమశిల ఉత్తర కాలువ పనులను ఆగ్రామ రైతులు ఆపివేశారు. దాదాపు ఒకటిన్న సంవత్సరం ఈకాలువ పనులను నాయకులు పట్టించుకోలేదు. చింతలదేవి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంలో జాప్యం కారణంగా కాలువ పనులు అప్పట్లో ఆగాయి. ప్రభుత్వం ఎంఎల్ఏ రామారావు పట్టించుకోక పోవడంతో కాలువ పనులు పూర్తి కాలేదు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కందుకూరులో జరిగిన బహిరంగ సభలో కాలువ విషయం చెప్పడంతో కాలువ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తక్షణమే చింతలదేవి వద్ద రైతులకు నష్ట పరిహారం చెల్లించ కుండానే కాలువను తీశారు. పనులు పూర్తి కాకుండానే గేట్లు ఎత్తిన ఎంఎల్ఏ సోమశిల ఉత్తర కాలువ పనులు పూర్తి కాకుండానే హంగు, ఆర్భాటాలతో ఎంఎల్ఏ రామారావు అక్కడికి వెళ్లి ఉత్తర కాలువకు నీటిని వదిలారు. ఈకాలువ ద్వారా నీరు 10రోజులకు కలిగిరి మండలం చేరుకుంది. అయితే అక్కడ కాలువలో పూడికితీత పనులు పూర్తి కాకపోవడంతో కాలువలో నీరు కట్టపొర్లి తెగిపోయే ప్రమాదం ఉండడంతో నీటిని సోమశిల అధికారులు నిలిపివేశారు. కాలువ పనులు అరకొరగా చేసి మళ్ళీ నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి కేవలం 30ఎంఫ్టీ నీరుమాత్రమే ప్రాజెక్టులోకి చేరింది. కానీ సాగుకి, తాగుకి నీరిస్తామని చెప్పిన ఎంఎల్ఏ రామారావు పూర్తిగా విఫల మయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2014కి ముందే 90 శాతం పూర్తి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి సోమశిల ఉత్తర కాలువ ద్వారా రాళ్ళపాడు ప్రాజెక్టుకు 1.5టిఎంసీల నీరు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. ఆయన వెంటనే స్పందించడంతో టెండర్లు పిలిచి వెంటనే కాలువ పనులు మొదలు పెట్టారు. కాలువ పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరిత గతిన పూర్తి చేసి ప్రాజెక్టుకు నీరందించే విధంగా మహీధర్‌రెడ్డి కృషి చేశారు. 2014 ఎలక్షన్‌కి ముందే ఉత్తర కాలువ పనులు 90 శాతం పూర్తిచేసిన ఘనత మహీధర్‌రెడ్డికే దక్కుతుంది. 2014 తరువాత టీడీపీ ప్రభుత్వంలో కాలువ పనులను నాయకులు పట్టించుకోకనే ప్రాజెక్టుకు నీళ్లు రాలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కొంతమేర తాగునీరు వచ్చినా సాగుపై ఈప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే సోమశిల జలాలు రప్పించడంలో విఫలమైందని చెప్పవచ్చు. టీడీపీ నాయకులకు పట్టదా? సోమశిల జలాలు 5 సంవత్సరాల నుంచి రాళ్ళపాడు ప్రాజెక్టుకు తీసుకురావడంలో ఈప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టులో నీళ్ళు లేక రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సోమశిల జలాలు వచ్చి ఉంటే ప్రాజెక్టు కింద భూములు సస్యస్యామంలంగా ఉండేవి. రైతులు అప్పుల బాదలు లేకుండా పసు గ్రాసానికి ఇబ్బందులు లేకుండా ఉండేవి. నాయకులకు చిత్తశుద్ధి లేకనే సాగుకి నీరివ్వలేదు. – జి.హనుమంతరావు, పెదపవని కరువు వల్ల జ్యూస్ కొట్లకు వెళ్ళాం తీవ్ర అనావృష్టి వలన ప్రాజెక్టులో నీరు లేక పంటలు పండక అప్పులపాలై ఏంచేయాలో అర్థంకాక రాష్ట్రం దాటి జ్యూస్ కొట్లు పెట్టుకుని వలస వెళ్లవలసి వచ్చింది. సోమశిల జలాలు ప్రాజెక్టుకు వచ్చింటే తాగు నీటికి, సాగు నీటికి ఇబ్బందులు తొలగిపోయేవి. ప్రభుత్వం, నాయకులు పట్టించుకోకనే ప్రాజెక్టు కింద భూములు బీళ్ళుగా మారాయి. –గొర్రెపాటి ప్రభాకర్, మేదరమిట్లపాలెం పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు కింద కరువు సోమశిల ఉత్తర కాలువ పనులు 2014లోనే 90శాతం పనులు పూర్తయినా 2014 నుండి 2018 వరకు ఈకాలువ పనులుపై ఎంఎల్ఏ పర్యవేక్షణ లేకపోవడంతో పనులు కాంట్రాక్టర్ పూర్తి చేయలేదు. సోమశిల జలాలు రాళ్లపాడు ప్రాజెక్టుకి 2015 నుంచి వచ్చి ఉంటే ఈరోజు ప్రాజెక్టు కింద ఉన్న రైతులు బతుకు దెరువు కోసం వలసలు వెళ్లేవారు కాదు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి నిదర్శనం. – డేగా మాల్యాద్రి -
రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం
కందుకూరు, న్యూస్‌లైన్: రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి పనులు అత్యంత నిదానంగా సాగుతూ నత్తలు నవ్వుకునే స్థితిలో ఉన్నాయి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జికా) రూ. 23 కోట్లు కేటాయించింది. నెల్లూరుకు చెందిన స్వప్న కన్స్ట్రక్షన్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. 2012 ఫిబ్రవరి 22న ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేసేందుకు నీటి పారుదల శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రా క్టు సంస్థ ఇప్పటి వరకు 36 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన నాలుగు నెలల గడువులో 64 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉంది. పనుల జాప్యంపై అధికారులు ఇప్పటికే రెండు దఫాలు కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చారు. అయినా కాంట్రాక్టర్‌కు చీమకుట్టినట్లైనా లేదు. కందుకూరుకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పురపాలక శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాజెక్టు పనులు ఇంత నత్తనడకన సాగుతున్నా కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది ఆయకట్టు పరిధిలో పంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే నిదానంగా సాగుతున్న ఈ పనులకు రెండు నెలలకు పైగా జరుగుతున్న సమైక్య ఉద్యమ సెగ కూడా తగిలింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే పరిస్థితి లేక అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. గతేడాది వర్షాలు లేకపోవడంతో పంటలు పండక అల్లాడిన రైతులు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి లింగసముద్రం, వలేటివారిపాలెం, గుడ్లూరు మండలాలకు సాగు నీరందుతుంది. పరోక్షంగా ఉలవపాడు, కందుకూరు మండలాలకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో దోహదకారిగా ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తై నిండా నీళ్లుంటే దిగువ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా మెండుగా ఉంటాయి. సాగు నీటితో పాటు తాగునీటి పథకాలు కూడా నీటితో కళకళలాడతాయి. వర్షాలు పడే సమయం అసన్నం కావడం, ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 25 వేలకు పైగా ఎకరాల్లో ఆయకట్టు భూమి ఉంది. కుడి కాలువ కింద దాదాపు 19 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద మరో ఆరు వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇక్కడ ప్రధానంగా వరితో పాటు పత్తి, మెట్ట పంటలు సాగు చేస్తారు.