కందుకూరు, న్యూస్‌లైన్: రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి పనులు అత్యంత నిదానంగా సాగుతూ నత్తలు నవ్వుకునే స్థితిలో ఉన్నాయి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జికా) రూ. 23 కోట్లు కేటాయించింది. నెల్లూరుకు చెందిన స్వప్న కన్‌స్ట్రక్షన్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. 2012 ఫిబ్రవరి 22న ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేసేందుకు నీటి పారుదల శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రా క్టు సంస్థ ఇప్పటి వరకు 36 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన నాలుగు నెలల గడువులో 64 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉంది. పనుల జాప్యంపై అధికారులు ఇప్పటికే రెండు దఫాలు కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చారు. అయినా కాంట్రాక్టర్‌కు చీమకుట్టినట్లైనా లేదు. కందుకూరుకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పురపాలక శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాజెక్టు పనులు ఇంత నత్తనడకన సాగుతున్నా కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది ఆయకట్టు పరిధిలో పంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే నిదానంగా సాగుతున్న ఈ పనులకు రెండు నెలలకు పైగా జరుగుతున్న సమైక్య ఉద్యమ సెగ కూడా తగిలింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే పరిస్థితి లేక అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు.
గతేడాది వర్షాలు లేకపోవడంతో పంటలు పండక అల్లాడిన రైతులు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి లింగసముద్రం, వలేటివారిపాలెం, గుడ్లూరు మండలాలకు సాగు నీరందుతుంది. పరోక్షంగా ఉలవపాడు, కందుకూరు మండలాలకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో దోహదకారిగా ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తై నిండా నీళ్లుంటే దిగువ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా మెండుగా ఉంటాయి. సాగు నీటితో పాటు తాగునీటి పథకాలు కూడా నీటితో కళకళలాడతాయి. వర్షాలు పడే సమయం అసన్నం కావడం, ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 25 వేలకు పైగా ఎకరాల్లో ఆయకట్టు భూమి ఉంది. కుడి కాలువ కింద దాదాపు 19 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద మరో ఆరు వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇక్కడ ప్రధానంగా వరితో పాటు పత్తి, మెట్ట పంటలు సాగు చేస్తారు.
రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం
Published Wed, Oct 16 2013 7:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement