నేపాల్లో నూతనాధ్యాయం
తన గమ్యాన్నీ, గమనాన్నీ నిర్దేశించే మెరుగైన రాజ్యాంగం కోసం ఏడేళ్లుగా నేపాల్ సాగిస్తున్న అన్వేషణ ముగిసింది. ఆదివారం జరిగిన ఒక ఉత్సవంలో ఆ దేశ అధ్యక్షుడు రాం బరణ్ యాదవ్ నూతన రాజ్యాంగం అమల్లోకొచ్చినట్టు ప్రకటించారు. 2007లో రాచరికానికి ముగింపు పలికి తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన నాటినుంచీ నేపాల్ ఎన్నో పురుటి నొప్పుల్ని అనుభవించింది. రాజ్యాంగ రచన అన్నది మౌలికంగా ఒక రాజకీయ ప్రక్రియ గనుక దాన్ని రూపొందించే క్రమంలో ఎన్నో సమస్యలు సహజం. రాచరికాన్ని పునరుద్ధరించాలనే శక్తులు ఒకవైపు...తాత్కాలిక రాజ్యాంగం గుర్తించిన విధంగా ఇది రిపబ్లిక్గా కొనసాగాలనే శక్తులు మరోవైపు హోరా హోరీ తలపడ్డాయి.
తమ అస్తిత్వం, ఆకాంక్షలమాటేమిటని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు నిలదీశాయి. ప్రావిన్సుల ఏర్పాటును జనాభాకు అనుగుణంగా కాక ఆయా ప్రాంతాల్లో జాతుల పొందిక ఆధారంగా నిర్ణయించాలని డిమాండ్ చేశాయి. ఇందుకు అంగీకరిస్తే ఇతర జాతులనుంచి కూడా ఆ తరహా డిమాండ్లే వస్తాయని మూడు ప్రధాన పార్టీలు-నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు), యునెటైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) భావించాయి. వాస్తవానికి జాతుల ప్రాతిపదికగానే ఫెడరల్ వ్యవస్థ ఉండాలని...జాతులకు విడిపోయే హక్కుతోసహా స్వయం నిర్ణయాధికారం ఉండాలని మావోయిస్టులు పదేళ్ల సాయుధ పోరాటకాలంలో బలంగా వాదించారు.
వివిధ జాతులను ఆ ప్రాతిపదికనే కూడగట్టారు. తీరా సమయం వచ్చేసరికి తమ వైఖరిని మార్చుకున్నారు. వాస్తవానికి నేపాల్లో ఈ ఏడేళ్ల కాలంలో జరిగిందంతా పాత విలువలకూ, కొత్త ఆకాంక్షలకూ మధ్య జరిగిన హోరాహోరీ పోరాటం. రాజు మహేంద్ర పాలనాకాలంలో అగ్రవర్ణాల సంస్కృతినీ, మతాన్నీ, వారి భాషనూ తమపైన రుద్దారని...దాన్నే నేపాలీ జాతీయతగా చూపే ప్రయత్నం చేశారని అట్టడుగు జాతులు వాదించాయి. ఈ క్రమంలో తమ అస్తిత్వాన్నీ, ఆకాంక్షలనూ అణగదొక్కారని ఆరోపించాయి. ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి జాతుల జనాభా ప్రాతిపదికన ప్రావిన్సులు ఏర్పడటమే పరిష్కారమని పేర్కొన్నాయి. కానీ అది నెరవేరలేదు. ఫలితంగా గత నెలలో రాజ్యాంగం ముసాయిదా వెల్లడైన వెంటనే దేశంలోని 75 జిల్లాల్లో సగానికిపైగా జిల్లాలు అల్లర్లతో అట్టుడికాయి. హింసాకాండ, పోలీసు కాల్పుల్లో 40 మంది మరణించారు.
నేపాల్ రాజ్యాంగ రచనకు సంబంధించిన ఈ ఏడేళ్ల ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. రాజ్యాంగ సభకు 2008లో జరిగిన ఎన్నికల్లో మావోయి స్టులే 40 శాతం స్థానాలను గెల్చుకున్నారు. ఆ పార్టీ అధినేత ప్రచండ ప్రధాని అయ్యారు. రాజ్యాంగ రచన రెండేళ్లలో పూర్తి కావాలన్నది ఆనాటి లక్ష్యం. కానీ దాని ్న మరో రెండేళ్లు పొడిగించారు. అయినా ఎలాంటి ప్రగతీ లేకపోవడంతో 2012లో ఆ సభ కాస్తా రద్దయింది. చివరకు ఆపద్ధర్మ ప్రభుత్వం 2013లో కొత్త రాజ్యాంగ నిర్ణా యక సభకు ఎన్నికలు నిర్వహించింది.
ఆ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ ఆధిక్యం సాధించగా, మావోయిస్టులు మూడో స్థానానికి పడిపోయారు. వైరిపక్షాలు మూడూ పంతాలూ, పట్టింపులకూ పోవడంతో ఈ ఏడాది జనవరికి పూర్తి కావాల్సిన రాజ్యాంగ రచనా ప్రక్రియ మరో తొమ్మిది నెలలు సాగింది. చివరకు మొన్న ఏప్రిల్లో ప్రధాన పార్టీలు మూడు, మాధేసి జనాధికార్ ఫోరం (డెమోక్రసీ) ఒక అంగీకారానికొచ్చాయి. 16 అంశాల కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాయి.
ఇప్పుడు అమల్లోకొచ్చిన రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏడు ప్రావిన్సులుం టాయి. గణతంత్రంగా, రాష్ట్రాల సమాఖ్యగా, లౌకికవాదం ఆలంబనగా నేపాల్ ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికీ అమల్లో ఉన్న చరిత్ర పూర్వం సంప్రదాయా లనూ, మత, సాంస్కృతిక స్వేచ్ఛలను గౌరవించడమే లౌకికవాదంగా నిర్వచించు కుంది. అక్కడి హిందుత్వవాదులు దేశం హిందూ రాజ్యంగా ఉండాలని గట్టిగా వాదిం చారు. అందుకోసం నిరసనలకు దిగారు. కానీ వారి మాట చెల్లుబాటు కాలేదు. ఈనెల 16న జరిగిన ఓటింగ్లో 598 మంది సభ్యుల్లో 507 మంది కొత్త రాజ్యాంగానికి అను కూలంగా ఓటేశారు.
25 మంది వ్యతిరేకించగా, 66 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. పార్లమెంటులోని 275 స్థానాల్లో 165 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 75 జిల్లాలకు ఒక్కొక్క స్థానం చొప్పున, మిగిలిన 90 స్థానాలూ జనాభా ప్రాతిపదికన ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. మరో 110 స్థానాలు ఆయా పార్టీల కుండే దామాషా ఓటు ప్రాతిపదికన కేటాయిస్తారు. ఇందులో మహిళలు, మైనారిటీ జాతులు, ఇతర అట్టడుగు సెక్షన్ల వారికి ఆయా పార్టీలు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. 304 అధికరణలతో, 37 విభాగాలతో ఉన్న నేపాల్ రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులతోపాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను హామీ ఇచ్చింది. అంతేకాదు... భిన్న లైంగిక భావనలుండే లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్ వర్గాలవారి హక్కులనూ గుర్తించింది.
ఇది ఆసియా దేశాల్లోనే ప్రథమం. అయితే మహిళల పునరుత్పత్తి హక్కులతోసహా వారికి సంబంధించిన అనేక అంశాల్లో చేయాల్సింది చాలా ఉన్నదని మహిళా సంఘాలంటున్నాయి. నేపాల్ చరిత్రలో 1948 నుంచి ఇంతవరకూ ఆరు రాజ్యాంగాలు అమలయ్యాయి. వాటిలో కొన్ని పెత్తందారీతనంతో, మరికొన్ని ప్రజాస్వామిక మార్గంలో ఉనికిలోకి వచ్చాయి. అయితే పార్టీల్లో, వివిధ సంఘాల్లో, పౌరుల్లో విస్తృతంగా చర్చ జరిగి ఆమోదించిన తొలి రాజ్యాంగం ఇదే. ఇందులోనూ ఎన్నో లోపాలుండవచ్చు. వివిధ జాతులు ఆరోపిస్తున్నట్టు వారి ఆకాంక్షలను ఇది సమగ్రంగా ప్రతిబింబించకపోయి ఉండొచ్చు. అయితే ఈ రాజ్యాంగం సవరణలకు వీలైనదే. కనుక ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులకు అనుగుణంగా మార్పులూ, చేర్పులూ ఉంటాయని ఆశించాలి. ఆరున్నర దశాబ్దాలుగా ఎన్నో కష్టాలనూ, క్లిష్ట దశలను చవిచూసిన నేపాల్ ఇకనుంచి సమష్టి తత్వంతో ముందుకు సాగగలదని ఆకాంక్షించాలి.