తెలుగు ఓటర్లు ఇంటింటా ప్రచారం చేయాలి
ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు రాంలాల్ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్ధులను గెలిపించడంలో ముందుండాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంలాల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని సూచిం చారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏపీ, తెలంగాణ నేతలు, కార్యకర్తలకు సోమవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాంలాల్ దిశానిర్దేశం చేశారు. ఆప్ ఒక ప్రాంతీయ పార్టీ అని, పాలన చేయలేక 49 రోజుల్లో పారిపోయిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. తొలుత కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు, స్థానిక బీజేపీ నేత పురిగళ్ల రఘురాం.. ఏపీ, టీ నేతలు, కార్యకర్తలతో ప్రచారం తీరుపై సమీక్షించారు.
విశ్వసనీయతకు, మోసానికి మధ్య ఎన్నికలు: దత్తాత్రేయ
విశ్వసనీయత, మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు సముచిత నిర్ణయం తీసుకోవాలని మంత్రి దత్తాత్రేయ పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను వంచనకు పాల్పడే పార్టీని నమ్మొద్దన్నారు. బీజేపీని గెలిపిస్తే, కేంద్రంతో కలసి మరింత అభివృద్ధిని చేసుకోడానికి వీలవుతుందన్నారు.