వైఎస్సార్సీపీలోకి విశాఖ టీడీపీ సీనియర్ నేత గంపల
సాక్షి, అమరావతి: విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకటరామచంద్రరావు(వాడబలిజ సామాజికవర్గం), ఆయన సతీమణి సంధ్యారాణిలు వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో సోమవారం వారు పార్టీలో చేరారు. విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్ ఎలక్షన్ ఇన్చార్జిగా రామచంద్రరావు పనిచేశారు. గతంలో ఏపీసీసీ జాయింట్ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్రరావు.. సెన్సార్ బోర్డు మెంబర్గా, పోర్ట్ ట్రస్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.
వైఎస్సార్సీపీలోకి డాక్టర్ కంచర్ల
విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరిలోవ ప్రాంతంలో పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు తదితరులున్నారు.