వైఎస్సార్‌సీపీకి ఓటు వేయొద్దనడం తగదు
తెలంగాణ జేఏసీకి ‘గట్టు’ హితవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీకి ఓట్లు వేయొద్దని జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పడం సరైంది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డి పరిపాలన వల్ల అత్యధికంగా లబ్దిపొందినది తెలంగాణ ప్రాంతమేనని, వైఎస్సార్ పాలన కావాలని ఈ ప్రాంత మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
‘ఉచిత విద్యుత్ వల్ల తెలంగాణకు రూ.4,500 కోట్ల లబ్ది చేకూరింది. జలయజ్ఞంలో భాగంగా ఇక్కడి ప్రాజెక్టుల నిర్మాణం కోసం దాదాపు రూ.85వేల కోట్లు ఖర్చు చేశారు. మిగతా అనేక సంక్షేమ పథకాల వల్ల కూడా తెలంగాణ ప్రాంతానికే అధిక లబ్ది చేకూరింది’ అని ఆయన వివరించారు. అలాంటి వైఎస్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటుంటే వద్దని చెప్పడానికి జేఏసీ ఎవరు? అని ప్రశ్నించారు.