ఏఎస్పీ రమా రాజేశ్వరి బదిలీ
నల్లగొండ క్రైం : జిల్లా అదనపు ఎస్పీ రమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఈమెను మల్కాజ్గిరి డీసీపీగా ఉద్యోగ్యోన్నతిపై బదిలీ చేస్తూ ఆదివారం ఉన్నతస్థాయి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 11 నెలల పాటు పని చేసిన తనకు ఎనలేని సంతృప్తి మిగిలిందన్నారు. విభిన్న రకాలైన కేసుల విచారణ, పరిష్కారం ద్వారా అనుభవం గడించానని, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావు మార్గదర్శకంలో పలు కేసులను విజయవంతంగా చేధించగలిగానని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించగలగడం శాఖాపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తృప్తినిచ్చిందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, సంఘటనలపై సత్వరమే స్పందించడంతో పాటు కేసులను పరిశోధించి జాతీయస్థాయిలో ఒక నివేదికను అందజేయడం వల్ల తగిన గుర్తింపు లభించిందన్నారు. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపైన సీఎంకు నివేదిక ఇచ్చినట్లు వివరించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్భయ వార్డు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందుని చెప్పారు.