ఎన్టీఆర్ లేనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు లేకపోవడంతో రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆయన భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్బంగా ఆమె శనివారం నక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.
నటనలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఆ మహనీయుడు ప్రస్తుత తరుణంలో జీవించి ఉంటే తెలుగువారంతా ఒక్క తాటిపైనే ఉండేవారిని అన్నారు. ఎన్టీఆర్ పాలన ప్రజారంజకంగా సాగిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పాలనకన్నా మెరుగ్గా పాలన చేయగలమని ఊహించుకుని కొంత మంది స్వార్థంతో, కుట్రతో ఆయన నుంచి అధికారాన్ని లాక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని లక్ష్మీ పార్వతి తీవ్ర ఆవేదన చెందారు.