Ramadan fasts
-
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్‌లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
రంజాన్ ఉపవాసంపై సింగర్ అనుచిత వ్యాఖ్యలు.. నటి ఫైర్
మోడల్, నటి గౌహర్ ఖాన్ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో తను ఉపవాసం ఉంటుందా? లేదా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. దీనికి గౌహర్ స్పందిస్తూ.. గర్భంతో ఉన్నందున ఈ ఏడాది రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని తెలిపింది. దానికి బదులుగా నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇకపోతే హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ దంపతులు రంజాన్ మాసంలో ఉపవాసం చేయడంపై సెటైర్లు విసిరారు. 'మేమైతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మా శరీరాలకు పోషకాలు కావాలి. అందుకే ఆ ఆలోచన కూడా చేయం. అయినా ఇలా కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడమేంటో మాకిప్పటికీ అర్థం కాదు. అంతగా అవసరమైతే టీవీ చూడటం, సెల్‌ఫోన్ వాడటం మానేయండి. అంతే తప్ప తిండి మానేయడమేంటి? మరీ తెలివి తక్కువ వాళ్లలా ఉన్నారనిపిస్తోంది' అని వెకిలిగా మాట్లాడారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన గౌహర్ ఖాన్ సింగర్ జంటపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. దాని వెనక ఉన్న సైన్స్ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి కాస్తైనా తెలుసా? ముందు అవి తెలుసుకోండి. మీకంటూ ఓ అభిప్రాయం ఉండటం తప్పనడం లేదు. కానీ వాటిని ఎలా వ్యక్తీకరించాలనే తెలివి కూడా ఉంటే బాగుంటుంది' అని చురకలంటించింది. ఇక గౌహర్ ఖాన్ విషయానికి వస్తే.. ఆమె సరుకులు కొనడానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు జైద్ దర్బార్‌ను కలిసింది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది స్నేహానికి దారి తీసింది. కొంత సమయానికే అది ప్రేమగా మారింది. 2020 నవంబర్ 5న వీరి నిశ్చితార్థం జరగ్గా డిసెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. 2022 డిసెంబర్లో తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది నటి. ఆమె చివరగా శిక్షా మండల్ సినిమాలో నటించింది. -
రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం!
రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ విందు కానిస్తారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ ఇఫ్తార్ లో వడ్డించే వంటకాలు అద్భుతమైన రుచులతో ఉంటాయి. వీటిలో 10 వెరైటీల గురించి కలినరీ స్పెషలిస్ట్ పల్టి హరినాథ్ వివరిస్తున్నారు. సాధారణంగా రంజాన్ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, నిమ్మరసంతో ముగిస్తారు. అయితే ఈ పండుగ విందుల్లో ఆరగించే టాప్ 10 వంటకాల్లో... ► హలీమ్ – ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నిదానంగా ఉడికించి తయారుచేస్తారు. ఈ ఫుడ్ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ► కెబాబ్స్:మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం ఫ్రై చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా వీటిని వండుతారు. ► చికెన్ షావార్మా – అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్ ఇది. సన్నగా కోసిన చికెన్ లేదా మటన్ ముక్కలను బ్రెడ్ లోపల కూరగాయలు, సాస్ కలిపి ఆరగిస్తారు. ► కీమా సమోసా – గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి. ► మటన్ రెసాలా – ఇది పూర్తిగా బెంగాలీ డిష్. బోన్ మటన్ పీస్‌లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ► దమ్ బిర్యానీ – దక్షిణ భారతదేశంలో దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్ లేదా చికెన్, మసాలాలు నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది. ► ఫలాఫెల్ –అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్ ఒకటి. బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్ లేదా పట్టీ ఫలాఫెల్. వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్ సమయంలో సర్వ్ చేస్తారు. . ► షీర్ ఖుర్మా – మొఘలాయ్ వంటకం ఇది. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. రెండింటి మేళవింపే ఈ షీర్ఖుర్మా దీని ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ► అఫ్లాటూన్– ప్రత్యేక తియ్యని వంటకం అఫ్లాటూన్ . స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్ ఇది. రూ అఫ్జా – రంజాన్ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్ ఎఫెక్ట్ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఐకమత్యం పెంచే రుచులు... ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాటయ్యే ఇఫ్తార్ విందులు అందర్నీ ఆకట్టుకుంటాయి. –మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్–మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
హలీం సలాం
అలా మొదలైంది.. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించే వంటకాల్లో ఓ ప్రత్యేక డిష్ గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అదే హలీమ్. అలా పర్షియా నుంచి పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. ఇరాన్, ఇరాక్, తదితర అరబ్ దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరవాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి జతకట్టాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, యెమన్, అరబ్ ఎమిరేట్స్, అమెరికా, బ్రిటన్లలో లొట్టలేసుకుంటూ ఆరగించే వంటకం హైదరాబాద్ హలీం.. ఐదు దశాబ్దాల క్రితమే.. నవాబ్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో బ్రహ్మాండమైన ఆదరణ పొందినప్పటికీ హలీం అమ్మకాలు మాత్రం ఐదు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. ఇరాన్ నుంచి నగరానికి వచ్చిన ఓ కుటుంబం పాతబస్తీలోని చార్మినార్ వద్ద మదీనా సర్కిల్లో ‘మదీనా’ పేరుతో హోటల్ పెట్టి హలీం విక్రయాలను ప్రారంభించింది. భిన్న‘రుచుల’ పసందు.. తొలినాళ్లలో నాన్‌వెజ్‌తో తయారైన హలీం ఇప్పుడు వెజిటేరియన్‌గా కూడా లభ్యమవుతోంది. నాన్‌వెజ్‌లో మటన్, చికెన్, బీఫ్, ఫిష్, ఈమూ హలీంలు ప్రత్యేకం. ఇందులో సైతం దక్కని, ఇరానీ, అరేబియన్, జఫ్రానీ, యమనీ విధానాల్లో తయారు చేస్తుంటారు. కొవ్వు తక్కువగా ఉండే ఈమూ హలీం తయారీ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. వెజిటేరియన్లో కూడా అనేక రకాలుగా హలీం హోటల్స్‌లో దొరుకుతోంది. ‘పిస్తా’కు ప్రత్యేక గుర్తింపు హలీం తయారీలో నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నందుకు హైదరాబాద్ పిస్తా హౌస్‌కు జాతీయ స్థాయిలో జియోగ్రాఫికల్ ట్యాగ్ లభించింది. పాతబస్తీలోని శాలిబండలో 1997లో ప్రారంభమైన పిస్తా హౌస్ అనతి కాలంలో దేశ విదేశాలకు విస్తరించి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఐఎస్ఐ మార్కుతో పాటు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 514 అవార్డులు లభించాయి. ప్రతిరోజు సుమారు ఐదు క్వింటాళ్ల వరకు హలీం తయారు చేసి హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో 400కు పైగా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, తదితర ప్రాంతాల్లో ‘పిస్తా’కు ఏడు బ్రాంచీలు ఉన్నాయి. తయారీ ప్రత్యేకం.. ఈ ప్రత్యేక వంటకం తయారీ కూడా ప్రత్యేకమే. హలీం తయారీకి కనీసం 9 గంటల సమయం పడుతోంది. తెల్లవారు జామున 4 గంటలకే తయారీ విధానం ప్రారంభమవుతుంది. హలీం వంటకంలో మటన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫూట్స్ తదితర వాటిని వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాసుమతి బియ్యం, పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాల దినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. అనంతరం సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. ఫిష్ హలీంలో గోధుమలు, మసాలాలు కలిపి ఉడికించి చివరన చేప ముక్కలను కలిపి తయారు చేస్తారు. రుచుల్లో రకాలు.. దక్కనీ హలీం ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా తయారు చేస్తారు. ఇందులో గోధుమలు కంటే మాంసం మోతాదు రెండింతలు అధికంగా ఉంటుంది. నెయ్యితో పాటు ఇతర దినుసులను వినియోగిస్తారు. ఇరానీ హలీం ఇరానీ హలీం ఘాటుగా ఉండదు. డ్రై ఫూట్స్‌తో పాటు గోధుమలు, మినపప్పు, తక్కువ మోతాదులో మసాల దినుసులు వినియోగిస్తారు. వెజిటేరియన్ హలీం శాకాహారుల కోసం ప్రత్యేకంగా వెజిటేరియన్ హలీంలను కూడా కొన్ని హోటల్స్ అందిస్తున్నాయి. గోధుమ రవ్వతో పాటు మసాల దినుసులు కలిపి ఈ వంటకం చేస్తారు. దీనిలో బీన్స, క్యారెట్, కీరా, పచ్చి బటానీ కలిపి ఉడికిస్తారు. ఘాటుగా ఉండకుండా పలు హోటల్స్‌లో పెరుగు, పాలు కూడా కలుపుతారు. ప్యారడైజ్ స్పెషల్.. హైదరాబాద్ బిర్యానికి ప్యారడైజ్ హోటల్‌కు ఎంత పేరుందో..స్వచ్ఛమైన హలీంకు సైతం ఇక్కడ గొప్ప ఆదరణ ఉంది. ‘హలీం తయారీకి ఉపయోగించే నాణ్యమైన మాంసం, గోధుమలు, స్వచ్ఛమైన నెయ్యి, దినుసులు అన్నీ హైదరాబాదీవే’అని చెబుతారు హోటల్ మేనేజర్ అహ్మద్. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ హలీం ప్రియుల సందడి మొదలవుతుంది. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్యారడైజ్ హోటల్లో 28 ఏళ్ల నుంచి హలీంను రుచి చూపిస్తున్నారు. ప్రపంచానికి రుచి చూ‘పిస్తా’.. ప్రపంచ వ్యాప్తంగా హలీం విక్రయాలను విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకు ‘టార్గెట్- 2020’గా పెట్టుకున్నాం. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాలతోపాటు వివిధ దేశాలకు ‘హైదరాబాద్ పిస్తా హలీమ్’ను ఎగుమతి చేస్తున్నాం. అమెరికాలో ప్రత్యేకంగా హలీం తయారు చేస్తున్నాం. వచ్చే ఏడాది స్విడ్జర్లాండ్, జెనీవా నగరాల్లో కేంద్రాలను ప్రారంభిస్తాం. వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ తీసుకొని పంపిస్తున్నాం. - మహ్మద్ అబ్దుల్ మాజీద్, పిస్తాహౌస్ యాజమాని ధరలు ఇలా.. మటన్ హలీం రూ. 90 నుంచి 170 వరకు, చికెన్ రూ. 70 నుంచి 90 వరకు, వెజిటేరియన్ హలీం రూ.70 నుంచి రూ.90 వరకు లభిస్తోంది. వీటిలో సింగిల్, ప్లేట్, స్పెషల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్ ధరలు వేర్వేర్వుగా ఉంటాయి.