ramajan
-
బంధాలు... బంధనాలు
రమజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాద్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సహజంగానే చార్మినార్ పరిసరాలు జనరద్దీతో కళకళలాడుతుంటాయి. రకరకాల వస్తుసామగ్రితో పాతబస్తీ దుకాణాలు మెరిసిపోతుంటాయి. చిన్నా పెద్దా వయోభేదం లేకుండా ఆడమగ అనే లింగభేదం లేకుండా ఆ పరిసరాలు జనజాతరను తలపిస్తుంటాయి. చార్మినార్ ప్రాంతంలో మాత్రమే దొరికే కొన్ని రకాల వస్తువులను కొనుక్కోవడానికి మహిళలు క్యూ కడతారు. రంగురంగుల, రకరకాల గాజులు, అత్తర్లు, నగలు, రకరకాల డ్రైఫ్రూట్స్, సేమియాలు, గాజు, పింగాణి వస్తువులు, వస్త్రాల కొనుగోలులో తలమునకలై పోతారు. హైదరాబాద్‌లో రంజాన్ హడావిడి, ప్రత్యేకించి పాతబస్తీ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. పాతబస్తీకి పగలు-రేయి ఒక్కటే. మహిళల షాపింగ్‌తో చార్మినార్ పరిసరాలు పోటెత్తుతాయి. పిల్లల ఆనందానికి అవధులే ఉండవు. ఈ ఆహ్లాదకరమైన నేపథ్యంలో... ఓ రోజు సాయంత్రం షమీమ్ తన కొడుకు అంజుమ్‌ను ఇఫ్తార్ సామగ్రి కోసం చార్మినార్‌కు పంపింది. అంజుమ్ హుషారుగా బైక్ మీద బయలుదేరాడు. చార్మినార్ పరిసరాలన్నీ పోలీసుల పహరాలో ఉన్నాయి. ఏమై ఉంటుంది? ఇంత మంది పోలీసులు ఉన్నారెందుకు? అనుకుంటూనేదుకాణాల వైపు వెళ్తున్నాడు. క్షణాల్లోనే పాతబస్తీ మొత్తం పోలీసులు విస్తరించారు. అంజుమ్ అడుగుపెట్టేటప్పటికి పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు ఇప్పుడు వందకి పైగా ఉన్నారు. అంజుమ్ మనసు కీడును శంకించింది. తాను వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్లిపోవడం శ్రేయస్కరం అని తోచింది. ైబైక్ని తనకు అవసరమైన సరుకులు దొరికే దుకాణాల వరుసలోకి తిప్పాడు. అంతలో... ఓ పోలీస్ దారికి అడ్డుగా నిలబడి ఉన్నాడు. అంజుమ్‌ని ఆపేశాడు. బండి కాగితాలు తియ్ బిక్కుబిక్కుమంటూ బండి దిగుతున్న అంజుమ్‌ను పోలీసు భాషలో నోటికొచ్చినట్లు తిడుతూ, ‘బండి కాగితాలు తియ్’ అని హూంకరించాడు. కాగితాల కోసం టూల్‌కిట్ దగ్గరకు వంగుతున్న అంజుమ్ జేబులో నుంచి రెండు పేపర్లు జారిపడ్డాయి. వెంటనే పోలీసు వాటిని తీసుకున్నాడు. అవి అరబ్, ఉర్దూ భాషల్లో ఉండడంతో అతడిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ‘ఐసిస్‌తో నీకెప్పటి నుంచి సంబంధం ఉంది? నువ్వెప్పుడైనా సిరియా వెళ్లావా? ఇక్కడ నీ బాస్ ఎవరు? ఎవరెవరితో పరిచయాలున్నాయి’ వంటి రకరకాల ప్రశ్నలు సంధించాడు. వాటిలో ఏ ఒక్క ప్రశ్నకూ అంజుమ్ దగ్గర సమాధానం లేదు. అతడి చేతిలో ఉన్నవి రంజాన్ వేళలు తెలిపే సమయ పట్టిక, నమాజుకు సంబంధించిన అరబీ బుక్లెట్స్. వెళ్లినవాడు ఎంతకీ రాడేం? ఇక్కడ షమీమ్.. ఇంట్లో ఇతర పనులు పూర్తి చేసుకుని వంటకు సమాయత్తమవుతోంది. సరుకుల కోసం వెళ్లిన అంజుమ్ ఇంకా రాలేదేమిటి అనుకుంటూ ఇంట్లోకి, బయటకు తిరుగుతోంది. క్షణానికోసారి వీధి మలుపు వైపు చూస్తోంది. భర్త ఇక్బాల్ ఇంటికి వచ్చాడు. వంట చేసిన ఆనవాళ్లు కనిపించలేదు. ఇఫ్తార్ సమయం దాటిపోయింది. ఆలస్యమయ్యే కొద్దీ వారిలో ఆందోళన పెరుగుతోంది. అంతలో అంజుమ్ రానే వచ్చాడు. రావడానికైతే వచ్చాడు కానీ చేతిలో సరుకుల్లేవు. ముఖం పాలిపోయి ఉంది. బాగా భయపడ్డాడని తెలుస్తోంది. బైక్ నడపడం సరిగా రాకుండానే సెంటర్‌కు తీసుకెళ్లాడు. యాక్సిడెంట్ ఏమైనా జరిగిందేమోనని తల్లిదండ్రులు సందేహించారు. ఏమైందని అడిగితే మెల్లగా నోరు విప్పాడు అంజుమ్. ‘‘ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పన్నాగం పన్నుతున్నారని పాతబస్తీలో పోలీసులు మోహరించారు. అనుమానం వస్తే చాలు వంద ప్రశ్నలు వేస్తున్నారు. చార్మినార్ దగ్గర నన్ను ఆపేశారు. నాకేమీ తెలియదని నమ్మకం కుదిరే వరకు కదలనివ్వలేదు. వాళ్లు వెళ్లమనగానే ఇంటికొచ్చేశాను. ఇక అక్కడ సరుకుల కోసం తిరగడానికి భయమేసింది’’ అంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. ‘‘టీవీలో అన్నిసార్లు చెప్తుంటే పిల్లాడిని చార్మినార్కి పంపిస్తావా’’ అని కసురుకుంటూ వెళ్లి టీవీ ఆన్ చేశాడు ఇక్బాల్. ఎవరో ఏదో చేశారని! టీవీలో దృశ్యాలు చూస్తుంటే షమీమ్‌కు స్పృహ తప్పినంత పనైంది. కొడుకుకు తప్పిన గండం గుర్తు చేసుకుని మరీ భయపడుతోంది. పదే పదే అల్లాను తలుచుకుంటోంది. ‘‘అల్లాహ్! పరుల ప్రాణాలు తియ్యమని, ప్రార్థనమందిరాలు ధ్వంసం చేయమని నా మతం ఎక్కడా చెప్పలేదు. ఎవరో ముష్కరులు ఏదో చేశారని అన్నెం పున్నె ఎరుగని నా కొడుకును అనుమానించారు. నా కొడుకును పెద్ద ఆపద నుంచి రక్షించావు. ఇలా ఎంతమందిని అనుమానిస్తారో? దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులతోపాటు ఎంతమంది అమాయకులు ఈ విషవలయంలో చిక్కుకుంటారో?’’ అని ఆవేదనతో ఆమె ఆత్మ ఘోషించింది. ఈ ఆత్మఘోష ఒక్క షమీమ్ది మాత్రమే కాదు. పాతబస్తీలో అనేకమంది గుండెకోత. రంజాన్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. మాసం మొదలైనప్పటి నుంచి పండుగను ఎంత వేడుక చేసుకోవాలోనని కలలుకంటారు. నిన్న, మొన్నటి కలకలంతో పాతబస్తీలో మాత్రమే కాదు హైదరాబాద్‌లో అనేక కుటుంబాలు భయం గుప్పెట్లో రోజులు గడుపుతున్నాయి. పండుగ సంతోషం నగరవాసుల ముఖాల్లో కనిపించడం లేదు. ‘అల్లాహ్! పండుగ రోజుల్లో కూడా ఈ శిక్ష ఏంటి? మాకెందుకీ శిక్ష’ అంటూ నగరవాసి ఆవేదన. నగరంతో బంధం కలుపుకున్న ప్రతి ఒక్కరి ఆందోళన. - ఎం.డి ఉస్మాన్‌ఖాన్ ఇస్లాం బోధనలు నిష్కారణంగా ఒక మనిషిని హతమారిస్తే మానవజాతిని చంపినట్లే.ఎవరి మాటల ద్వారా, చేతల ద్వారా వారి పొరుగువారు సురక్షితంగా ఉండరో వారు విశ్వాసులు కారు. మీ పొరుగువారు పస్తులుంటే, మీరు గనుక కడుపు నిండా భుజిస్తే మీలో విశ్వాసం లేదు. భువిలో కల్లోల్లాన్ని రేకెత్తించకండి. అలాంటి వారిని దేవుడు ప్రేమించడు. మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనుల్లో అందరితో సహకరించండి. పాపకార్యాల్లో, అత్యాచారాల్లో ఎవరితోనూ సహకరించకండి. దైవానికి భయపడండి. ఇది దైవభక్తి పరాయణతకు నిదర్శనం.సాటి వారిని ప్రేమించండి. వారి ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం. అది పాపం. అది నరకం. హింసా దౌర్జన్యాలు పరిష్కార మార్గాలు కానేకావు. అవి ప్రగతికి, మన ఉనికికే అవరోధాలు, ప్రమాదాలు. -
ఉపవాసమూ ఆరాధనే!
ఇది రమజాన్ మాసం. ముస్లిం సోదరులు ఈ మాసంలో ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఈ సందర్భంగా ఉపవాసానికీ, ఆధ్యాత్మికతకూ గల సంబంధం ఏమిటో, మతపరంగా దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందో చూద్దాం. ఉపవాసాన్ని అరబ్బీ భాషలో ’సౌమ్ ’ లేక ’సియామ్ ’ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడం, కట్టుబడి ఉండడం అనే అర్థాలు ఉన్నాయి. ఇస్లామీ పరిభాషలో సౌమ్ అంటే ఒక నిర్ణీతకాలం వరకు అన్నపానీయాలు త్యజించడం, లైంగికవాంఛలను అదుపులో పెట్టుకోవడం. తినడం, త్రాగడం, స్త్రీ పురుషుల లైంగిక సంబంధాలు మనోవాంఛల్ని, మానవ సహజమైన కోరికల్ని ప్రేరేపిస్తాయి. ఈ మూడింటి నుండి ఒక నిర్ణీత కాలం వరకు దూరంగా ఉండడం, లేక ఆగిపోవడం అనేదే ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ఉపవాసం అంటే! అయితే ఈ బాహ్యసంబంధమైన కోరికలతో పాటు, అంతరంగంలోని కోరికలు, చెడుల నుండి హృదయాన్ని, నోటిని సురక్షితంగా ఉంచుకోవడం కూడా ఉపవాస ఆరాధనలో భాగమే. ధర్మశాస్త్రాలను తీసుకువచ్చిన దైవప్రవక్తలంతా శాస్త్రావతరణకు పూర్వం ఒక నిర్ణీత కాలం వరకు నిష్ఠాగరిష్ఠ జీవితాన్ని గడిపారు. శక్తిమేరకు తినడం, తాగడం వంటి మానవ సహజమైన అవసరాలను విసర్జించారు. వారు ఈవిధంగా తమ ఆత్మలను సంస్కరించుకొని వాటిని అల్లాహ్ భయభక్తులతో నింపారు. అప్పుడే వారిైపై దైవ సందేశం అవతరించింది. హజ్రత్ మూసా అలైహిస్సలాం (మోషేప్రవక్త) ఇటువంటి జీవితాన్నే నలభై రోజులు గడిపారు. తరువాతనే ఆయనపై ‘తౌరాత్’ గ్రంథం అవతరించింది. హజ్రత్ ఈసా అలైహిస్సలాం (ఏసుక్రీస్తు ప్రవక్త) కూడా ఇటువంటి వ్రతాన్నే 40 రోజులు పాటించారు. అప్పుడే ఆయన వాక్కునుండి ఆయన హృదయం వివేక విజ్ఞతా జ్యోతుల్ని విరజిమ్మడం ప్రారంభించింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కూడా 30 రోజుల వరకు హిరా గుహలో, ఆరాధనలో నిమగ్నమయ్యారు. దాని తరువాతనే ఆయనకు దైవ సందేశానుగ్రహం పొందే భాగ్యం కలిగింది. అసలు ఉపవాసం ముఖ్య ఉద్దేశ్యం మనిషిని భయభక్తులు (తఖ్వా) కలవాడుగా తీర్చిదిద్దడం. అతని హృదయాన్ని పవిత్రతతో, పరిశుభ్రతతో నింపడం. భయభక్తులు అంటే, మానవ హృదయం పాపకార్యాల పట్ల ఏవగింపును ప్రదర్శిస్తూ, సదాచారాల వైపు అధికంగా మొగ్గే స్థితి. ఈ స్థితిని మానవుడిలో జనింపజేయడమే ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యం. సంపన్నులకు, కడుపునిండిన వాళ్ళకు ఆకలిదప్పుల బాధ ఏమిటో తెలిపేది ఉపవాసం మాత్రమే. ఉపవాసం ఉన్నప్పుడే వారు తమ నిరుపేద సోదరుల ఆకలిబాధను గ్రహించగలుగుతారు. వారికి పట్టెడన్నం పెట్టి వారి క్షుద్బాధను నివారించడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అర్ధం చేసుకోగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే, ఉపవాసం ఒక నిర్బంధ సైనిక శిక్షణ. ప్రతి విశ్వాసికి ఈ శిక్షణ సంవత్సరానికొకసారి ఇవ్వబడుతుంది. దీనివల్ల అతను శారీరక కష్టానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. ప్రపంచ వ్యవహారాల్లో శ్రమకు, కృషికి, కష్టనష్టాలకు ఏమాత్రం జంకడు. అందుకే పవిత్ర ఖురాన్ ఉపవాసాన్ని సహనం అని కూడా అభివర్ణించింది. ఉపవాసం ప్రాముఖ్యతను తెలిపే ఒక ప్రవచనం ఇలా ఉంది. ‘దేవుడు ఇలా ఉపదేశించాడని ముహమ్మద్ ప్రవక్త(స) చెప్పారు. ఆదం సంతానం ప్రతి పనికీ ప్రతిఫలం నిర్ణయించబడి ఉంది. కాని ఉపవాసానికి మాత్రం అలాలేదు. ఎందుకంటే, ఉపవాసం నాది. దాని ప్రతిఫలం నా దాసునికి స్వయంగా నేనే ఇస్తాను. అంటే ఉపవాసం మాత్రమే దైవానిదా? మిగతావి కావా? అని కాదు. విషయం ఏమిటంటే, మిగతా ఆరాధనలన్నీ బాహ్యంలో వ్యక్తమవుతాయి. ఉదాహరణకు నమాజ్, హజ్, జకాత్ ఇవన్నీ బయటికి వ్యక్తమయ్యే ఆచరణలు. ఇతరులు చూడడానికి, వారికి తెలియడానికి అవకాశమున్న ఆచరణలు. కాని ఉపవాసం అలాకాదు. ఇది కేవలం దైవానికి దాసునికి మధ్య మాత్రమే ఉండే సంబంధం. బాహ్య ప్రదర్శనకు అవకాశం లేని ఆరాధన. ఉపవాసం ఉన్న వ్యక్తి తాను ఇతరులకు చెప్పేవరకు దాన్ని గురించి వారికి తెలియదు. ఈ విషయమే ఇతర ఆరాధనల నుండి ఉపవాసాన్ని వేరుచేస్తుంది, మరో విషయం ఏమిటంటే, నమాజ్ ఇస్లాంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన విధి. నమాజ్ స్వర్గానికి తాళంచెవి. విశ్వాసానికీ అవిశ్వాసానికి మధ్య భేదం తెలిపేది నమాజ్ మాత్రమే. అయినా బహిష్టు సమయంలో స్త్రీలకు ఈ విధి నుండి మినహాయింపు ఇవ్వబడింది. వారు దాన్ని ఖజా కూడా పాటించనవసరంలేదు. కాని ఆకాలంలో తప్పిపోయిన ఉపవాసాలను మాత్రం ఖజా పాటించాలి.’ దీన్నిబట్టి ఉపవాసానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఉపవాసం ఒక ప్రాచీన ఆరాధన. పూర్వకాలం నుండి వివిధ మతాల్లో, వివిధ జాతుల్లో ఇది చలామణిలో ఉంది. ఈనాటికీ ఆయా మతధర్మాల అనుయాయులు ఏదో ఒక రూపంలో ఉపవాసవ్రతం పాటించడాన్ని మనం చూడవచ్చు. ‘ప్రజలకు రమజాన్ ఉపవాసాల వాస్తవికత గనక తెలిస్తే, వారు సంవత్సర కాలమంతా రమజానే అయితే బాగుండు అని అభిలషిస్తారు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స). కనుక మనిషికి మానసికంగా, ఆధ్యాత్మికంగా శాంతి కావాలంటే రమజాన్ ఉపవాసాలను పాటించాలి. ఉపవాసం ఉండడం వల్ల కడుపు కేవలం ఖాళీగానే కాదు, పరిశుభ్రంగా కూడా ఉంటుంది. ఆ ప్రభావం తప్పకుండా హృదయంపై, మేధపై పడుతుంది. ఉపవాసం మన ఉద్రేకాలను, ఆవేశకావేశాలను కొంతకాలం వరకు చల్లబరుస్తుంది. భావాల్లో, ఆలోచనల్లో సమతూకం, ప్రశాంతత నెలకొంటాయి. సకాలంలో నిద్రలేస్తాం. సకాలంలో పనులు చేస్తాం, బాధ్యతాభావం పెరుగుతుంది. జవాబుదారీతనం వస్తుంది. దైవచింతన, పరలోక చింతన, పాపభీతి, పశ్చాత్తాపభావన, మంచీచెడుల విచక్షణ వంటి అనేక మంచి గుణాలు మన సొంతమవుతాయి. కరుణామయుడైన దైవం అందరికీ ఈ విషయాలను అర్ధం చేసుకొని ఆచరించే సౌభాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ దేవునికి దగ్గరగా నివసించడమే ఉద్దేశ్యం జీవితంలో ప్రతి అంశాన్నీ దైవంతోనూ, భక్తితోనూ జోడించడం హిందూ సంప్రదాయ విశిష్ఠత. తినే ఆహారాన్ని దేవునికి ముందుగా సమర్పించి, దానిని నైవేద్యంగా స్వీకరించడం ఒక కోణమైతే, నిరాహారంగా రోజు గడపడాన్ని కూడా భగవంతుడితో జోడించి ఉపవాసంగా మార్చుకోవడం హైందవం ప్రత్యేకత. ఇక్కడ ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగల సందర్భంగా ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార పానీయాలను తీసుకోరు.లేదా కొద్దిమొత్తంలో మాత్రమే తీసుకుంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట, ఒకరోజు లేదా కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. ఉపవాసం కేవలం మనస్సును దేవుని యందు లగ్నం చేయడానికి మాత్రమే కాదు. శరీరంలోని ఆహారాన్ని జీర్ణం చేసే యంత్రాంగానికి విశ్రాంతినిచ్చి దద్వారా జీర్ణప్రక్రియను మరింత శ క్తిమంతం చేయడానికి కూడా ఉపయోపడుతుంది. - ఆర్.ఎ.ఎస్. శాస్త్రి, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు, ఆదోని. యేసుక్రీస్తు కూడా ఉపవసించారు! ఉపవాసం అంటే దేవునికి సమీపంగా జీవించడం అని అర్థం. ఉపవాసం మంచిది అని, ఆరోగ్యదాయకం అని, దేవుణ్ణి సంతోషపరిచే ఆరాధన ప్రక్రియ అని ఏసు సెలవిచ్చాడు. ఏసు సహితం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మోషే ప్రవక్త 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని నుండి దశాజ్ఞలను పొందాడు. ఏసు శిష్యులు అద్భుతకార్యాలు చేయలేకపోయారు. ఏసు చేశాడు. మేమెందుకు చేయలేకపోయామని బాధతో వారు ఏసును ప్రశ్నించారు. ఉపవాసం ద్వారానే అది సాధ్యం అయింది అని ప్రభువు వారికి బదులిచ్చారు. దైవదృష్టికి ఆమోదయోగ్యమైన ఉపవాసమేమిటంటే.. నువ్వు ఉపవాసం ఉండి, నీ ఆహారాన్ని ఆకలిగొన్న వారికి తినిపించడం. ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖ ముఖం పెట్టుకోకుండా శరీరాన్ని, ఆత్మను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. - రెవ. బైరపోగు సామ్యేల్ బాబు, బేతనియ చర్చి, హైదరాబాద్ శాస్త్రీయ దృక్పథం ఉపవాసం వల్ల ఆధ్యాత్మికంగానే కాదు. భౌతికంగా కూడా చాలా మేలు జరుగుతుందని సశాస్త్రీయంగా రుజువైంది. లంఖణాలవల్ల మనిషి ఆయుష్షు పెరుగుతుందని భారత్, జర్మనీ శాస్త్రజ్ఞులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఉపవాసాల వల్ల మానవుడి జీవితకాలం పెరగడమేగాక మనిషిలోని శక్తి వృథాకాదని కూడా పరిశోధనలో తేలింది. ఉపవాసం వల్ల శారీరక కణాలు నష్టపోవు. మరోఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఉపవాసం ఉన్నప్పుడు పేగుల్లోని కణాలు పుష్టినిచ్చే పదార్థాలను బాగా స్వీకరిస్తాయి. పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలెక్యులర్ బయాలజీ డిప్యూటీ డెరైక్టర్ పి.డి. గుప్తా ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దేవుడు మానవాళి సాఫల్యం కోసం అవతరింపజేసిన ఆజ్ఞలు, ఆదేశాలన్నీ మానవ నైజానికి, మానవ అవసరాలకు, మానవ సహజ లక్షణాలకు అతి సమీపంగానే కాదు. అతికినట్లుగా సరిపోతాయి. వైద్యశాస్త్రం ప్రకారం - ఉపవాసం పాటించడం వల్ల మనస్సును నియంత్రించుకునే అలవాటు అవుతుంది. దీనివల్ల మనిషి తన ఆత్మపైనేకాక, శరీరంపై కూడా మంచిప్రభావం పడినట్లు గ్రహిస్తాడు. మనసు అదుపులో ఉన్నకారణంగా కామ, క్రోధ, మద, మాత్సర్యాలపై సునాయాసంగా విజయం సాధిస్తాడు. శారీరక ఆరోగ్యం విషయంలో ఉపవాసం గురించి సుప్రసిద్ధ పాశ్చాత్య వైద్యప్రముఖులు ముఖ్యంగా యూరోపియన్ వైద్యులు ఏమంటున్నారో చూద్దాం. ఎవరైనా తమ మనస్సుపై నియంత్రణ సాధించాలనుకుంటే, వారు అధికంగా ఉపవాసాలు పాటించాలి. - డా. రిచర్డ్ ఉపవాసం పాటిస్తే ఊహలు చెదరవు. నాలుక వేగం తగ్గుతుంది. అంటే మాటల్లో దురుసుతనం తగ్గిపోతుంది. దుష్కార్యాలు చేసే శక్తి సన్నగిల్లుతుంది. బ్రహ్మచర్య జీవితం సాఫీగా, సజావుగా గడిచిపోతుంది. - డా. మైకేల్ ఆరోగ్యం కోసం ఉపవాసం ఎంతో మేలైన విధానం. దీనివల్ల శరీరం అనేక రోగాల నుండి రక్షణ పొందుతుంది. శరీరంలోని చెడుపదార్ధాలు ఈ విధానం ద్వారా తమ విష ప్రభావాన్ని కోల్పోతాయి. - డా. ఎడ్వర్డ్ నిక్సన్ రెండువారాలు ఎడతెరిపి లేకుండా ఉపవాసాలు పాటిస్తే ఓ నలభయ్యేళ్ళవాడి శరీరంలోని నరాలు పదమూడు సంవత్సరాల బాలుడి శరీరంలోని నరాల్లా తయారవుతాయి. - చికాగో యూనివర్శిటీ పరిశోధన -
నేడు రంజాన్ పండుగ
-
ఈద్ ముబారక్
మనలో ప్రతి ఒక్కరం రమజాన్ పండుగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవాలి.ఆనందంలో అందరినీ భాగస్వాములను చేయాలి. ‘జకాత్’, ‘ఫిత్రా’, ‘సద్ ఖి’ ‘ఖైరాత్’ల పేరుతో సమాజంలోని అభాగ్యుల పట్ల మన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. కుల, మతాలు, వర్గ, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా సమాజంలో శాంతిస్థాపనకు ప్రయత్నంచేయాలి. దారిద్య్రం, పేదరికం, అసమానత, అణచివేత, దోపిడి, పీడన లాంటి దుర్మార్గాలను దూరం చేసి, శాంతి,సంతోషాలను- సోదర భావాన్ని, సామరస్య వాతావరణాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోది చేయాలి. ఇదే ‘ఈదుల్ ఫిత్’్ర (రమజాన్ పండుగ) మానవాళికిస్తున్న మహత్తర సందేశం. అద్భుతమైన ఆదేశం. రమజాన్... పేరు వినగానే మనసు, త నువు తన్మయత్వంతో పులకించిపోతాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా ఒంగిపోతుంది. గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. నిజానికి రమజాన్ నెలరోజుల పండుగ అంటే అతిశయోక్తి కాదు. రమజాన్ నెలవంక కనిపించింది మొదలు షవ్వాల్ నెలవంక దర్శనం దాకా ఏకధాటిగా నెలరోజుల పాటు ముస్లింల ఇళ్లు, వీధులన్నీ ‘సహెరీ’ ‘ఇఫ్తార్’ల సందడిలో వినూత్న శోభను సంతరించుకుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ప్రేమామృతాన్ని చిలకరిస్తూ ఉంటాయి. భక్తులు పవిత్ర ఖురాన్ పారాయణా మధురిమను గ్రోలుతూ పొందే వినూత్న అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాల అపూర్వ సమ్మేళనమే ఈదుల్ ఫిత్ ్రపర్వదినం. నిష్ఠగా ఉపవాసం రమజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే ఆరాధన రోజా. ముస్లింలు అత్యంత నియమ నిష్ఠలతో ‘రోజా’ (ఉపవాసవ్రతం) పాటిస్తారు. అంటే రోజూ పద్నాలుగు గంటలకు పైగా అన్నపానీయాలకు, లైంగిక కోర్కెలకు దూరంగా ఉంటాడు. ఇక్కడ రోజా అనేది కేవలం కొన్ని గంటలపాటు పస్తు మాత్రమే ఉండే ప్రక్రియ కాదు. దీని ద్వారా మానవుల్లో మానవీయ సుగుణాలు పెంపొందించడం, ప్రేమ, కరుణ, జాలి, త్యాగం, సహనం, పరోపకారం లాంటి గుణాలను జనింపజేసి, సత్కార్యాల వైపు మనిషిని ప్రేరేపించడం అసలు ఉద్దేశ్యం. మానవ ఆత్మను పవిత్రతతో, పరిశుద్ధతతో నింపడం అసలు ధ్యేయం. ఉపవాసం వల్ల సహన శక్తి పెరుగుతుంది. ఉద్రేకాలు, ఆవేశకావేశాలు తగ్గి పోతాయి. భావాల్లో, ఆలోచనల్లో సమతూకం నెలకొంటుంది. బాధ్యతా భావం పెరుగుతుంది. మంచీచెడు విచక్షణ అలవడుతుంది. ఉపవాసం పాటించడం వల్ల పేదసాదల ఆకలి బాధ అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. కడుపు నిండా తిండికి నోచుకోని అభాగ్యజీవులను ఆదుకోవాలన్న భావన వారిలో పెల్లుబుకుతుంది. ఆ తర్వాత ఈ మాసంలో మరో ముఖ్యమైన నియమం భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజు ఆచరించడం. నమాజు దైవభక్తితోపాటు సమానత్వ భావనను నేర్పుతుంది. ధనిక, బీద, ఎక్కువ, తక్కువ, అధికారి- సేవకుడు అనే తారతమ్యం లేకుండా అందరినీ ఏకం చేస్తుంది. ఎలాంటి అసమానతా దొంతరలు లేకుండా ఒకే పంక్తిలో, భుజాలు కలిపి దైవారాధన చేస్తారు. దానం కనీసం ధర్మం అలాగే ‘ఫిత్రా’దాన ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ కూడా జరుపుకోలేని స్థోమత లేని వారికి ‘ఫిత్రా’ దానాల వల్ల ఎంతో కొంత ఊరట లభిస్తుంది. పేదసాదలు ఈ పైకంతో పండగ కు కావలసిన వస్తుసామగ్రి కొనుక్కొని పండుగ సంతోషంలో పాలు పంచుకోగలుగుతారు. ఫిత్రా దానాలకు ప్రతి పేదవాడూ అర్హుడే. ముస్లిములు, ముస్లిమేతరులు అన్న తారతమ్యం లేనే లేదు. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆగత్యపరులను ఆదుకోవాలి. ఇస్లామీయ ఆరాధనల్లో నమాజ్, రోజాలతోపాటు ‘జకాత్’ కూడా ముఖ్యమైనదే. ప్రతి కలిగిన వారు తమ సంపాదనలోని మిగులు ధనంపై రెండున్నర శాతం పేదసాదల కోసం అప్పగించాలి. ఇదేదో సంపన్నులు దయదలచి చేసే దానం కాదు. ‘జకాత్’ పేదల హక్కు. సమాజంలోని సంపన్నులంతా ఎలాంటి లోభత్వానికి, పిసినారి తనానికి పాల్పడకుండా నిజాయితీగా ‘జకాత్’ చెల్లిస్తే సమాజంలో పేదరికానికి, దారిద్య్రానికి అవకాశమే ఉండదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఏ ఆరాధన తీసుకున్నా, ప్రతిదానిలో ప్రేమ, కరుణ, జాలి, సహనం, త్యాగం, పరోపకారం, మానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, చెడుల నిర్మూలన, మంచి, మానవీయ సుగుణాల విస్తరణ లాంటి అనేక అంశాల బోధనలే మనకు కనపడతాయి. ఒక పేదవాని మోముపై చిరునవ్వులు చూడలేని భక్తితత్వం, నిరర్థకం, నిర్హేతుకం. పండుగలు మనకిస్తున్న సందేశం ఇదే. - ఎండీ ఉస్మాన్ ఖాన్ నమాజును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న ప్రవక్త! ఒకసారి ముహమ్మద్ ప్రవక్త మహనీయులు పండుగ నమాజు కోసం ఈద్గాకు వెళుతున్నారు. దారిలో ఒకబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. చింపిరిజుట్టు, మాసిన దుస్తులు, కళ్లు పీక్కుపోయి ఒళ్లంతా దుమ్ముకొట్టుకునిపోయి దీనంగా ఉన్నాడు. నమాజుకు వెళుతున్న ప్రవక్త మహనీయులు అతడిని సమీపించి, ‘‘బాబూ! ఎందుకేడుస్తున్నావు? ఈ రోజు పండగ కదా! నీ ఈడు పిల్లలంతా శుభ్రంగా స్నానం చేసి, కొత్తబట్టలు తొడుక్కొని ఆనందంతో కేరింతలు కొడుతూ పండగ సంబరాల్లో మునిగిపోతే, నువ్వెందుకిలా బాధపడుతున్నావు?’’ అంటూ ఆరా తీశారు అనునయిస్తూ. అప్పుడా అబ్బాయి, ‘‘అయ్యా! నేనొక అనాథను. తల్లిదండ్రులు లేరు. ఈ రోజు పండుగ. నాతోటి పిల్లలంతా ఆనందంతో ఆడుతూ పాడుతూ ఈద్గాకు వెళుతున్నారు. వాళ్ల తలిదండ్రులు వారికవన్నీ సమకూర్చారు. మరి నాకెవరున్నారు? అమ్మానాన్నలుంటే నాక్కూడా అన్నీ సమకూర్చేవారు. కాని తలిదండ్రులు లేని అభాగ్యుణ్ణి నేను. ఏం చేయాలో పాలుపోక దుఃఖం పొంగుకొస్తోంది...’’ అంటూ ఇక మాట్లాడలేక భోరుమన్నాడు. ఈ మాటలు విన్న మమతల మూర్తి కారుణ్య హృదయం ద్రవించిపోయింది. పండుగ నమాజు కోసం వెళుతున్న ప్రవక్త వారు పండుగ ప్రార్థనను సైతం కాసేపటికోసం వాయిదా వేసుకుని బాబును ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రవక్త సతీమణి హ// ఆయెషా సిద్ధిఖీ బాబును అక్కున చేర్చుకున్నారు. మాతృప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. వెంటనే బాబుకు స్నానం చేయించి, మంచి దుస్తులు తొడిగారు. అత్తరు పూశారు. తలకు టోపీ పెట్టారు. తరువాత ప్రవక్త వారు - ‘‘ఈ రోజు నుండి నువ్వు అనాథవు కావు. మేమిద్దరం నీ తలిదండ్రులం. ఏమంటావు?’’ అని నుదుటిని ముద్దాడుతూ ప్రేమగా అడిగారు. అప్పుడా అబ్బాయి ఆనందంతో ‘‘ముహమ్మద్ ప్రవక్త నా తండ్రి, ఆయెషా సిద్ధిఖీ నా తల్లి’’ అంటూ అరిచాడు. ఈ విధంగా ఆ అబ్బాయి మోములో ఆనందం పూసిన తరువాతనే ప్రవక్త మనసు కుదుటపడింది. స్వహస్తాలతో అతడికి ఖర్జూర పాయసం తినిపించి, అప్పుడు బాబును వెంటబెట్టుకుని పండుగ నమాజుకు వెళ్లారు ప్రవక్త (స). పండుగ సంతోషంలో ఈద్ నమాజులాంటి దైవకార్యానికి వెళుతున్నాం కాబట్టి అనాథలు, అభాగ్యుల సంగతి తరువాత అని ప్రవక్త భావించలేదు. అభాగ్యుల మోముపై చిరునవ్వు మెరిసే వరకూ దైవకార్యాన్ని సైతం వాయిదా వేసుకున్నారు. -
నిరుపేదలూ ఇఫ్తార్ ఇవ్వొచ్చు
ఇస్లాం వెలుగు ‘రమజాన్’ అత్యంత శుభప్రదమైన, పుణ్యప్రదమైన మహామాసం. ఈ పవిత్ర మాసం మరికొన్ని రోజులు ఉందనగానే మమతలమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) విశ్వాసుల సమాజాన్ని మానసికంగా సమాయత్త పరిచే వారు. ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిగా పొందగలిగే వాతావరణాన్ని సృష్టించేవారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి రమజాన్ ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను ప్రజలకు బోధ పరిచేవారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) షాబాన్ మాసం చివరి తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ప్రజలారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన పవిత్రమాసం (రమజాన్) తన ఛాయను మీపై కప్పబోతోంది. ఆ పవిత్రమాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాలకన్నా శ్రేష్ఠమైనది. ఆ మాసం ఉపవాసాలను అలా్లహ మీకు విధిగా చేశాడు. అలాగే ఈ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే ఇతర కాలంలో 70 విధులు నిర్వహించిన దానితో సమానంగా పుణ్యం లభిస్తుంది. ఎవరైనా ఈ మాసంలో (దైవ ప్రసన్నత, పుణ్యఫలాపేక్షలతో) ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే అతని పాపాలు క్షమించబడతాయి. నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. అతనికి ఉపవాసం ఉన్నవారితో సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది. అలాగని ఉపవాసం పాటించే వ్యక్తి పుణ్యఫలంలో ఏ మాత్రం కొరత కలగదు’’ అని చెప్పారు. అప్పుడు ప్రజలు ‘‘దైవ ప్రవక్తా! మాలో ప్రతి ఒక్కరికీ ఇఫ్తార్ చేయించేటంత స్తోమత లేకపోతేనో?’’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త మహానీయులు, ‘‘కొద్ది మజ్జిగతో లేక గుక్కెడు మంచినీటితో ఇఫ్తార్ చేయించినా దైవం అతనికి కూడా అదే పుణ్యం ప్రసాదిస్తాడు’’ అని చెబుతూ, తన ప్రసంగాన్ని కొన సాగించి, ఇలా అన్నారు. ‘‘ఎవరైనా ఒక రోజె దారుకు (ఉపవాసికి) కడుపు నిండా భోజనం పెడితే అతనికి అల్లాహ్ నా హౌజు (కౌసర్ కొలను) నుండి తనివి తీరా తాగిస్తాడు. తర్వాత ఇక అతనికి ఎప్పటికీ దాహం వేయదు. చివరికతను స్వర్గంలో ప్రవేశిస్తాడు’’ అని చెప్పాడు. అంతేకాదు, ‘‘ఈ మాసంలోని మొదటి భాగం కారుణ్యం, మధ్యభాగం క్షమాపణ (మన్నింపు), చివరి భాగం నరకాగ్ని నుండి విముక్తి ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో తమ సేవకుల పనిభారాన్ని తగ్గిస్తారో, అల్లాహ్ వారిని క్షమిస్తాడు. వారికి నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదిస్తాడు’’ (బైహఖీ-ఈమాన్ అధ్యయం) అని చెప్పారు. ఇలా పవిత్ర రమజాన్‌కు సంబంధించి కారుణ్యమూర్తి ముహమ్మద్(స) మనకు బోధించిన అమృత వచనాలు. అందుకని ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిస్థాయిలో పొందడానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దైవంతో సంబంధం పటిష్ట పరచుకోవాలి. ఆర్థిక స్తోమతను బట్టి వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేస్తుండాలి. సమాజంలోని అభాగ్యులను ఏమాత్రం విస్మరించకూడదు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
మానవతా విలువలను మేలుకొలిపే రమజాన్
దైవ ప్రసాదితమైన దివ్య ఖుర్ఆన్ గ్రంథం అవతరించిన పవిత్ర మాసం రమజాన్. మానవుడు పరిపూర్ణ ప్రేమమూర్తిగా మారేందుకు అవకాశం కల్పించే రమజాన్ ఎంతో శుభప్రదమైనది. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, కోర్కెలను అదుపులో పెట్టుకునే మనోనిశ్చలతను, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రమజాన్. ‘‘నీ సంపాదన నీ సుఖసంతోషాలకే, నీ భోగలాలసతకే వినియోగించడం మానవత్వం కాదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవాలి. నీ సంపాదనలో కొంత భాగం వారికిచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపాలి. అపుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం’’ అని ప్రబోధించారు ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ రసూలుల్లాహ్(స.అ.స). మనిషి మానవతామూర్తిగా మారడానికి రమజాన్ అవకాశం కల్పిస్తుంది. ఇస్లాం మతానికి మూలం... ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఉందని ప్రవక్త ముహమ్మద్ ప్రవచించారు. అవి 1. కలిమా(అల్లాహ్ ఒక్కడే. ఆయన సర్వశక్తిమంతుడు. ఆరాధనలకు ఆయనే అర్హుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ముహమ్మద్ ఆయన ప్రవక్త అని విశ్వసించాలి). 2. నమాజ్ (ప్రతి రోజూ ఐదు పూటలా దైవధ్యానం చేయాలి). 3. రోజా (రమజాన్ మాసంలో విధిగా ఉపవాసం ఉండాలి). 4. జకాత్ (తన సంపాదనలో కొంత బాగాన్ని సంవత్సరానికి ఒకసారి పేదలకు దానం చేయాలి). 5. హజ్ (స్తోమతగలవారు జీవితంలో ఒకసారైనా మక్కా, మదీనా యాత్ర చేయాలి) ప్రతి ముస్లిం ఈ ఐదు సూత్రాలను కచ్చితంగా పాటించాలని ప్రవక్త నిర్దేశించారు. ఉపవాసంతో పరివర్తన రమజాన్ నెలలో చంద్రుడు కనిపించిన రోజు నుంచి 30 రోజులపాటు ఉపవాసం (రోజా) ఉంటారు. రమజాన్ శబ్దవ్యూత్పత్తిలోనే ఉపవాసం సూచన ఉంది. ‘రమ్జ్’ అంటే కాలుట. దహించుట అని అర్థం. ఉపవాసం వల్ల ఆకలి బాధ తెలుస్తుంది. ఆకలిగొన్నవారి పట్ల సానుభూతి పెరుగుతుంది. ప్రాతఃకాలం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్షను నియమ నిష్టలతో పాటించాలి. ఐదు పూటలా ప్రార్థనతో పాటు పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయాలి. ఓరిమితో, సహనంతో ప్రేమమూర్తిగా, మానవతావాదిగా మెలగాలి. ప్రాతఃకాలంలో భోజనంచేయడాన్ని ‘సహరి’ అంటారు. సాయంత్రం ఉపవాసదీక్ష విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. ఇఫ్తార్ సమయంలో ముస్లింలందరూ మస్జీద్‌లో చేరి దీక్ష విరమిస్తారు. గోధుమ గంజితో పాటు ఖర్జూరం, వివిధ రకాల పండ్లు తీసుకోవచ్చు. హైదరాబాద్‌లాంటి నగరాల్లో హలీమ్, హరీస్ అనే పేరుతో మాంసాహార వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆహార అలవాట్లకు అనుగుణంగా తమకు అందుబాటులో ఉన్న ఏ ఆహారపదార్థాలైనా భుజించవచ్చు. ఉపవాసం ఉండలేకపోతే... రమజాన్ నెలలో ఏ కారణం చేతనైనా ఉపవాసానికి భంగం కలిగి పూర్తిచేయలేకపోతే ‘కఫ్పారా’(మూల్యం) చెల్లించాలి. పరిహారంగా రమజాన్ తర్వాత అరవై రోజులు ఉపవాసముండాలి. అదీ వీలుకాకపోతే ఒక పేదవ్యక్తికి 60 రోజులకు సరిపడా ఆహారం ఇవ్వాలి. ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అయితే అందులో కొన్ని సడలింపులు ఉన్నాయి. దూరప్రయాణాలు చేసేవారు, దీర్ఘ రోగాలతో బాధపడేవారు, వయసుమీరిన వారు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు, ఋతుస్రావం అవుతున్న మహిళలు ఉపవాసం ఉండకపోవచ్చు. అయితే, వారు రమజాన్ మాసంలో ఎన్నిరోజులు ఉపవాసదీక్ష పాటించలేకపోయారో అనంతరం అన్ని రోజులు ఉపవాసం ఉండాలి. కడుపులోని బిడ్డ భయంతో ఉపవాసం ఉండకపోతే ‘ఫిదియా’ చెల్లించాలి. అంటే రెండు పూటలా ఒక పేదవానికి కడుపునిండా అన్నం పెట్టాలి. సామూహిక ప్రార్థనామహిమ ఉపవాసం వల్ల కర్తవ్యపరాయణత్వం, కష్టాలను సహనంతో ఎదుర్కొనే శక్తి కలుగుతాయి.. కామక్రోధ మద మాత్సర్యాది అరిషడ్వర్గాలకు కళ్లెం వేయడంవల్ల మనో నిశ్చలత ఏర్పడుతుంది. దైవం పట్ల విశ్వాసం, పాపభీతి పెరిగి దుష్కృత్యాలు తగ్గుతాయి. రోజూ ఐదుసార్లు దైవప్రార్థన(నమాజ్)తో పాటు రమజాన్ మాసంలో ప్రతిరాత్రి ‘తరావీహ్’ నమాజ్ ప్రత్యేకంగా చేస్తారు. రోజుకు 20 రకాతుల చొప్పున నమాజ్ చేస్తూ 30 రోజులలో ఖుర్ఆన్లోని 30 భాగాలను పఠించడం పూర్తిచేస్తారు. మహిళలు ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న వారు రమజాన్ మాసంలో ఉపవాసదీక్షతో పాటు ఎతెకాఫ్(ప్రాథమిక అవసరాల కోసం తప్ప మిగిలిన సమయమంతా దైవధ్యానంలోనే గడపడం) పాటించాలి. సాధారణంగా మగవాళ్లు మస్జీద్‌లో, ఆడవాళ్లు ఇంటిలోని ఒక గదిలో ఉండి నిరంతరం దైవధ్యానంలో, ప్రార్థనలో నిమగ్నమవుతారు. వీటితో పాటు తహజ్జూద్ నమాజ్ (అర్థరాత్రి తర్వాత తొలివేకువలో చేసే ప్రార్థన) చేయాలి. దైవాదేశం వెలువడిన రాత్రి రమజాన్ నెలలో 27వ దినంనాటి రాత్రిని ‘మహిమగల రాత్రి’ (లైలతుల్ ఖద్)్రగా భావిస్తారు. దీనినే ‘షబే ఖద్’్ర అని కూడా అంటారు. ఆ రాత్రి జాగరణ చేసి అత్యంత విశ్వాసంతో, నిష్ఠతో, పుణ్యఫలాపేక్షతో ప్రార్థన చేస్తే కృతాపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడని, ఇహపరసుఖాలు ప్రసాదిస్తాడని ముస్లింల విశ్వాసం. మనిషికి మార్గదర్శనం చేయడంకోసం, మానవతా విలువలు పాటించి సన్మార్గంలో నిడిచేవిధంగా, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దేందుకు విశ్వప్రభువు ఖుర్ఆన్ పవిత్ర గ్రంథ సూక్తులను ప్రవక్త ద్వారా షబేఖద్ ్రరాత్రి నుంచే మానవాళికి అందించడం ప్రారంభించారు. ఈ రాత్రి మహత్మ్యం గురించి అల్ ఖద్ ్రసూరాలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు...‘‘మేము ఖుర్ఆన్ను ఈ షబేఖదర్లోనే అవతరింపజేశాము. షబేఖదర్ అంటే మీకు ఏమి తెలుసు. షబేఖదర్ వేయి మాసాల కంటే ఉత్తమమైనది. ఈ రాత్రి దూతలు, హజ్రత్ జిబ్రయీల్ విశ్వప్రభువు ఆజ్ఞ మేరకు ప్రతి పనినీ నిర్వహించేందుకు భువికి దిగివస్తారు. ఉదయం అయ్యేవరకూ శుభాశీస్సులు ప్రాప్తిస్తాయి.’’ మక్కాలో నివసించే ముహమ్మద్ రసూలువారికి చిన్నప్పటి నుంచి దైవచింతన ఎక్కువ. వీలు చిక్కినప్పుడల్లా సమీపంలోని హిరా అనే పేరుగల కొండ గుహకు వెళ్లి ధ్యానం(తపస్సు) చేసేవారు. క్రీ.శ.610 సంవత్సరం రమజాన్ నెలలో మూడు రోజులపాటు హిరా గుహలోనే దైవ ధ్యానంలో గడిపారు. అప్పుడు ఒక రోజు రాత్రి జిబ్రయీల్ ప్రత్యక్షమై దైవవాణి (ఖుర్ఆన్) వినిపించారు. అప్పటి నుంచి 22 సంవత్సరాలపాటు ఇహపరలోకాల్లో సాఫల్యం కోసం మానవునికి మార్గనిర్దేశనం చేయడానికి ముహమ్మద్ ప్రవక్తకు దైవాదేశం వెలువడింది. సర్వేశ్వరుని సూక్తుల సమాహారమే ఖుర్ఆన్ పవిత్ర గ్రంథం. వెల్లివిరిసే ఐక్యత ముస్లింలందరూ ఒకే నెలలో ఒకే కాలంలో ఉపవాసవ్రతాన్ని పాటిస్తారు కాబట్టి పరస్పర సహకారం, సోదరభావం కలిగి ఐక్యత పరిఢవిల్లుతుంది. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో, ఆత్మవిమర్శతో ఉపవాసాలు పాటిస్తారో పూర్వం వారు చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడని ముహమ్మద్ ప్రవక్త సెలవిచ్చారు. రమజాన్ విశిష్టమైనది కాబట్టి ఈ నెలలోనే జకాత్ ఇస్తారు. తమ వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడమే జకాత్. 7.5 తులాల బంగారం, లేక 52.5 తులాల వెండి, లేదా దాని విలువ గల డబ్బు ఏడాదిపాటు మన వద్ద ఉంటే వాటి విలువలో నూటికి 2.50 రూపాయల ప్రకారం జకాత్‌గా తీసి ఆ మొత్తాన్ని పేదలకు దానధర్మాలు చేయాలి. ముప్పై రోజుల కఠిన ఉపవాసదీక్షానంతరం రమజాన్ ‘ఖుద్బా’ (పండుగ) చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి ‘ఈద్గాహ్’లో సామూహికంగా ప్రార్థన చేస్తారు. ఆరోజు సేమ్యా పాయసం తింటారు. ప్రార్థనకు వెళ్లేముందే ‘ఫిత్రా’ (దానం) ఇస్తారు. డబ్బు రూపంలో కానీ, ధాన్యం రూపంలో గానీ పేదలకు ఫిత్రా ఇస్తారు. ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అంతమంది పేర ఫిత్రా ఇవ్వాలి. 1.75 కిలోల గోధుమలు లేదా దాని విలువ గల డబ్బు ఈద్ నమాజ్‌కు ముందే పేదలకు ఇవ్వాలి. ముస్లింలందరూ కొత్తదుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో, భక్తిప్రపత్తులతో పండుగ చేసుకుంటారు. ఖుద్బా అనంతరం పరస్పరం ఈద్ ముబారక్(పండుగ శుభాకాంక్షలు) చెప్పుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. - సద్దపల్లి ఖుదాబక్ష్ ‘ఇస్లాం’ అనే అరబ్బీ పదానికిస్వయంసమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన, శాంతి అనే అర్థాలు ఉన్నాయి. సర్వాంతర్యామికి, విశ్వప్రభువుకు,జీవనదాతకు మానవుడు స్వయంసమర్పణ చేసుకోవడమే ఇస్లాం. ఇస్లాం క్యాలెండర్ (హిజ్రీ శకం) ప్రకారం ఈనెల 29వతేదీ నుంచి రమజాన్ నెల ప్రారంభం అవుతుంది. జూలై 29వ తేదీ (నెలవంక కనిపిస్తే...) ఈదుల్ ఫితర్ జరుపుకుంటారు. రమజాన్ నెలలో నిష్కల్మష హృదయంతో, చిత్తశుద్ధితో, సంపూర్ణ విశ్వాసంతో, భక్తిప్రపత్తులతో ప్రార్థిస్తే సర్వేశ్వరుని కృపకు పాత్రులవుతారని, ఇహపర సుఖాలు లభిస్తాయని ముస్లింల విశ్వాసం. ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు చేసే నియ్యత్... ‘అల్లాహుమ్మ అసూము గదల్ల్లక ఫగ్ఫిర్లి మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు’ (అర్థంః దేవా... నా ఉపవాసాన్ని స్వీకరించు. నీవు ఏ పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తానని సెలవిచ్చావో దాన్ని నాకు ప్రసాదించు.) ‘ఇఫ్తార్’ (ఉపవాస దీక్ష విరమణ) సమయంలో చేసే ప్రార్థన (దువా)... ‘అల్లాహుమ్మ లకాసుమ్తు వ బికా ఆమంతు వ అలైక తవక్కల్తు వ అలా రిజ్జఖ అఫ్తర్ తు వతఖబ్బల్ మిన్ని’(అర్థంః దేవా. నేను నీ కోసమే ఉపవాసం పాటించాను. నీవు ప్రసాదించిన దానిద్వారానే ఉపవాస దీక్ష విరమిస్తున్నాను). ‘అల్లాహ్’ అనే పదానికి ముహజ్జబుల్ లుగాత్ గ్రంథంలో అర్థం ఇలా ఉంది. 1. ఖాలిఖ్ (సృష్టికర్త). 2. పర్వర్దిగార్ (సృష్టిస్థితిలయకారుడు, పోషించువాడు). ఈ పదం ఇలాహ్ అనే అరబ్బీ పదం నుంచి రూపొందింది. అల్లా- దేవుడు, ప్రభువు, సర్వశక్తిమంతుడు (ఎన్సైక్లోపిడియా ఏషియాటికా). లాహ్- అరబ్బీ క్రియ నుంచి రూపొందింది. కంపించుట, ప్రకాశించుట అని అర్థం. ఇలాహ్- దేవత...దానికి అల్ ప్రత్యయం చేర్చి దేవుడు అనే అర్థంలో అల్లాహ్ అని వాడుకలోకి వచ్చింది.