ఈద్ ముబారక్
మనలో ప్రతి ఒక్కరం రమజాన్ పండుగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవాలి.ఆనందంలో అందరినీ భాగస్వాములను చేయాలి. ‘జకాత్’, ‘ఫిత్రా’, ‘సద్ ఖి’ ‘ఖైరాత్’ల పేరుతో సమాజంలోని అభాగ్యుల పట్ల మన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. కుల, మతాలు, వర్గ, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా సమాజంలో శాంతిస్థాపనకు ప్రయత్నంచేయాలి. దారిద్య్రం, పేదరికం, అసమానత, అణచివేత, దోపిడి, పీడన లాంటి దుర్మార్గాలను దూరం చేసి, శాంతి,సంతోషాలను- సోదర భావాన్ని, సామరస్య వాతావరణాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోది చేయాలి. ఇదే ‘ఈదుల్ ఫిత్’్ర (రమజాన్ పండుగ) మానవాళికిస్తున్న మహత్తర సందేశం. అద్భుతమైన ఆదేశం.
రమజాన్... పేరు వినగానే మనసు, త నువు తన్మయత్వంతో పులకించిపోతాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా ఒంగిపోతుంది. గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. నిజానికి రమజాన్ నెలరోజుల పండుగ అంటే అతిశయోక్తి కాదు. రమజాన్ నెలవంక కనిపించింది మొదలు షవ్వాల్ నెలవంక దర్శనం దాకా ఏకధాటిగా నెలరోజుల పాటు ముస్లింల ఇళ్లు, వీధులన్నీ ‘సహెరీ’ ‘ఇఫ్తార్’ల సందడిలో వినూత్న శోభను సంతరించుకుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ప్రేమామృతాన్ని చిలకరిస్తూ ఉంటాయి. భక్తులు పవిత్ర ఖురాన్ పారాయణా మధురిమను గ్రోలుతూ పొందే వినూత్న అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాల అపూర్వ సమ్మేళనమే ఈదుల్ ఫిత్ ్రపర్వదినం.
నిష్ఠగా ఉపవాసం
రమజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే ఆరాధన రోజా. ముస్లింలు అత్యంత నియమ నిష్ఠలతో ‘రోజా’ (ఉపవాసవ్రతం) పాటిస్తారు. అంటే రోజూ పద్నాలుగు గంటలకు పైగా అన్నపానీయాలకు, లైంగిక కోర్కెలకు దూరంగా ఉంటాడు. ఇక్కడ రోజా అనేది కేవలం కొన్ని గంటలపాటు పస్తు మాత్రమే ఉండే ప్రక్రియ కాదు. దీని ద్వారా మానవుల్లో మానవీయ సుగుణాలు పెంపొందించడం, ప్రేమ, కరుణ, జాలి, త్యాగం, సహనం, పరోపకారం లాంటి గుణాలను జనింపజేసి, సత్కార్యాల వైపు మనిషిని ప్రేరేపించడం అసలు ఉద్దేశ్యం. మానవ ఆత్మను పవిత్రతతో, పరిశుద్ధతతో నింపడం అసలు ధ్యేయం. ఉపవాసం వల్ల సహన శక్తి పెరుగుతుంది. ఉద్రేకాలు, ఆవేశకావేశాలు తగ్గి పోతాయి. భావాల్లో, ఆలోచనల్లో సమతూకం నెలకొంటుంది. బాధ్యతా భావం పెరుగుతుంది. మంచీచెడు విచక్షణ అలవడుతుంది. ఉపవాసం పాటించడం వల్ల పేదసాదల ఆకలి బాధ అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. కడుపు నిండా తిండికి నోచుకోని అభాగ్యజీవులను ఆదుకోవాలన్న భావన వారిలో పెల్లుబుకుతుంది.
ఆ తర్వాత ఈ మాసంలో మరో ముఖ్యమైన నియమం భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజు ఆచరించడం. నమాజు దైవభక్తితోపాటు సమానత్వ భావనను నేర్పుతుంది. ధనిక, బీద, ఎక్కువ, తక్కువ, అధికారి- సేవకుడు అనే తారతమ్యం లేకుండా అందరినీ ఏకం చేస్తుంది. ఎలాంటి అసమానతా దొంతరలు లేకుండా ఒకే పంక్తిలో, భుజాలు కలిపి దైవారాధన చేస్తారు.
దానం కనీసం ధర్మం
అలాగే ‘ఫిత్రా’దాన ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ కూడా జరుపుకోలేని స్థోమత లేని వారికి ‘ఫిత్రా’ దానాల వల్ల ఎంతో కొంత ఊరట లభిస్తుంది. పేదసాదలు ఈ పైకంతో పండగ కు కావలసిన వస్తుసామగ్రి కొనుక్కొని పండుగ సంతోషంలో పాలు పంచుకోగలుగుతారు.
ఫిత్రా దానాలకు ప్రతి పేదవాడూ అర్హుడే. ముస్లిములు, ముస్లిమేతరులు అన్న తారతమ్యం లేనే లేదు. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆగత్యపరులను ఆదుకోవాలి.
ఇస్లామీయ ఆరాధనల్లో నమాజ్, రోజాలతోపాటు ‘జకాత్’ కూడా ముఖ్యమైనదే. ప్రతి కలిగిన వారు తమ సంపాదనలోని మిగులు ధనంపై రెండున్నర శాతం పేదసాదల కోసం అప్పగించాలి. ఇదేదో సంపన్నులు దయదలచి చేసే దానం కాదు. ‘జకాత్’ పేదల హక్కు. సమాజంలోని సంపన్నులంతా ఎలాంటి లోభత్వానికి, పిసినారి తనానికి పాల్పడకుండా నిజాయితీగా ‘జకాత్’ చెల్లిస్తే సమాజంలో పేదరికానికి, దారిద్య్రానికి అవకాశమే ఉండదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ఏ ఆరాధన తీసుకున్నా, ప్రతిదానిలో ప్రేమ, కరుణ, జాలి, సహనం, త్యాగం, పరోపకారం, మానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, చెడుల నిర్మూలన, మంచి, మానవీయ సుగుణాల విస్తరణ లాంటి అనేక అంశాల బోధనలే మనకు కనపడతాయి. ఒక పేదవాని మోముపై చిరునవ్వులు చూడలేని భక్తితత్వం, నిరర్థకం, నిర్హేతుకం. పండుగలు మనకిస్తున్న సందేశం ఇదే.
- ఎండీ ఉస్మాన్ ఖాన్
నమాజును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న ప్రవక్త!
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త మహనీయులు పండుగ నమాజు కోసం ఈద్‌గాకు వెళుతున్నారు. దారిలో ఒకబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. చింపిరిజుట్టు, మాసిన దుస్తులు, కళ్లు పీక్కుపోయి ఒళ్లంతా దుమ్ముకొట్టుకునిపోయి దీనంగా ఉన్నాడు. నమాజుకు వెళుతున్న ప్రవక్త మహనీయులు అతడిని సమీపించి, ‘‘బాబూ! ఎందుకేడుస్తున్నావు? ఈ రోజు పండగ కదా! నీ ఈడు పిల్లలంతా శుభ్రంగా స్నానం చేసి, కొత్తబట్టలు తొడుక్కొని ఆనందంతో కేరింతలు కొడుతూ పండగ సంబరాల్లో మునిగిపోతే, నువ్వెందుకిలా బాధపడుతున్నావు?’’ అంటూ ఆరా తీశారు అనునయిస్తూ.
అప్పుడా అబ్బాయి, ‘‘అయ్యా! నేనొక అనాథను. తల్లిదండ్రులు లేరు. ఈ రోజు పండుగ. నాతోటి పిల్లలంతా ఆనందంతో ఆడుతూ పాడుతూ ఈద్‌గాకు వెళుతున్నారు. వాళ్ల తలిదండ్రులు వారికవన్నీ సమకూర్చారు. మరి నాకెవరున్నారు? అమ్మానాన్నలుంటే నాక్కూడా అన్నీ సమకూర్చేవారు. కాని తలిదండ్రులు లేని అభాగ్యుణ్ణి నేను. ఏం చేయాలో పాలుపోక దుఃఖం పొంగుకొస్తోంది...’’ అంటూ ఇక మాట్లాడలేక భోరుమన్నాడు.
ఈ మాటలు విన్న మమతల మూర్తి కారుణ్య హృదయం ద్రవించిపోయింది. పండుగ నమాజు కోసం వెళుతున్న ప్రవక్త వారు పండుగ ప్రార్థనను సైతం కాసేపటికోసం వాయిదా వేసుకుని బాబును ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రవక్త సతీమణి హ// ఆయెషా సిద్ధిఖీ బాబును అక్కున చేర్చుకున్నారు. మాతృప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. వెంటనే బాబుకు స్నానం చేయించి, మంచి దుస్తులు తొడిగారు. అత్తరు పూశారు. తలకు టోపీ పెట్టారు. తరువాత ప్రవక్త వారు - ‘‘ఈ రోజు నుండి నువ్వు అనాథవు కావు. మేమిద్దరం నీ తలిదండ్రులం. ఏమంటావు?’’ అని నుదుటిని ముద్దాడుతూ ప్రేమగా అడిగారు. అప్పుడా అబ్బాయి ఆనందంతో ‘‘ముహమ్మద్ ప్రవక్త నా తండ్రి, ఆయెషా సిద్ధిఖీ నా తల్లి’’ అంటూ అరిచాడు. ఈ విధంగా ఆ అబ్బాయి మోములో ఆనందం పూసిన తరువాతనే ప్రవక్త మనసు కుదుటపడింది. స్వహస్తాలతో అతడికి ఖర్జూర పాయసం తినిపించి, అప్పుడు బాబును వెంటబెట్టుకుని పండుగ నమాజుకు వెళ్లారు ప్రవక్త (స).
పండుగ సంతోషంలో ఈద్ నమాజులాంటి దైవకార్యానికి వెళుతున్నాం కాబట్టి అనాథలు, అభాగ్యుల సంగతి తరువాత అని ప్రవక్త భావించలేదు. అభాగ్యుల మోముపై చిరునవ్వు మెరిసే వరకూ దైవకార్యాన్ని సైతం వాయిదా వేసుకున్నారు.