ముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఈ నెల 4న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే ఆరెస్సెస్ తమపై కపట ప్రేమ చూపుతోందని ఆరోపించాయి. సోమవారం జరగనున్న ఆ ఇఫ్తార్ విందుకు తాము హాజరు కాబోమని ముస్లీం సంఘాలు తేల్చిచెప్పాయి.
కాగా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్( ఎమ్‌ఆర్‌ఎమ్) ఈ ఇఫ్తార్‌ను ముంబైలో నిర్వహించనుంది. ఈ విందుకు దాదాపు 30 ముస్లిం దేశాలనుంచి 200మంది ముస్లిం ప్రముఖులను ఆహ్వానించింది.
ఎమ్‌ఆర్‌ఎమ్ జాతీయ కన్వీనర్ విరాగ్ పాచ్‌పోర్ మాట్లాడుతూ..ఆరెస్సెస్ పట్ల మైనారీటీలకు ఉన్న దురభిప్రాయాలను తొలగించడానికే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఆరెస్సెస్ ఇతర మతాలను గౌరవిస్తుంది. దేశంలో శాంతి చేకూర్చడానికే సంఘ్ కృషి చేస్తుంది. సోదర భావంతో ఇతర మతస్థులను గౌరవిస్తుంది’ అని తెలిపారు.
కాగా 2019 ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికే ఆరెస్సెస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుందని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. ముస్లింలపై దాడులు చేస్తూ కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డాయి. ఆరెస్సెస్ ఇఫ్తార్‌ను కపటనాటకంగా భావించి విందును బహిష్కరిస్తున్నామని పలు ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment