ఉపవాసమూ ఆరాధనే!
ఇది రమజాన్ మాసం. ముస్లిం సోదరులు ఈ మాసంలో ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఈ సందర్భంగా ఉపవాసానికీ, ఆధ్యాత్మికతకూ గల సంబంధం ఏమిటో, మతపరంగా దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందో చూద్దాం. ఉపవాసాన్ని అరబ్బీ భాషలో ’సౌమ్ ’ లేక ’సియామ్ ’ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడం, కట్టుబడి ఉండడం అనే అర్థాలు ఉన్నాయి. ఇస్లామీ పరిభాషలో సౌమ్ అంటే ఒక నిర్ణీతకాలం వరకు అన్నపానీయాలు త్యజించడం, లైంగికవాంఛలను అదుపులో పెట్టుకోవడం. తినడం, త్రాగడం, స్త్రీ పురుషుల లైంగిక సంబంధాలు మనోవాంఛల్ని, మానవ సహజమైన కోరికల్ని ప్రేరేపిస్తాయి. ఈ మూడింటి నుండి ఒక నిర్ణీత కాలం వరకు దూరంగా ఉండడం, లేక ఆగిపోవడం అనేదే ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ఉపవాసం అంటే!
అయితే ఈ బాహ్యసంబంధమైన కోరికలతో పాటు, అంతరంగంలోని కోరికలు, చెడుల నుండి హృదయాన్ని, నోటిని సురక్షితంగా ఉంచుకోవడం కూడా ఉపవాస ఆరాధనలో భాగమే. ధర్మశాస్త్రాలను తీసుకువచ్చిన దైవప్రవక్తలంతా శాస్త్రావతరణకు పూర్వం ఒక నిర్ణీత కాలం వరకు నిష్ఠాగరిష్ఠ జీవితాన్ని గడిపారు. శక్తిమేరకు తినడం, తాగడం వంటి మానవ సహజమైన అవసరాలను విసర్జించారు. వారు ఈవిధంగా తమ ఆత్మలను సంస్కరించుకొని వాటిని అల్లాహ్ భయభక్తులతో నింపారు. అప్పుడే వారిైపై దైవ సందేశం అవతరించింది. హజ్రత్ మూసా అలైహిస్సలాం (మోషేప్రవక్త) ఇటువంటి జీవితాన్నే నలభై రోజులు గడిపారు. తరువాతనే ఆయనపై ‘తౌరాత్’ గ్రంథం అవతరించింది. హజ్రత్ ఈసా అలైహిస్సలాం (ఏసుక్రీస్తు ప్రవక్త) కూడా ఇటువంటి వ్రతాన్నే 40 రోజులు పాటించారు. అప్పుడే ఆయన వాక్కునుండి ఆయన హృదయం వివేక విజ్ఞతా జ్యోతుల్ని విరజిమ్మడం ప్రారంభించింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కూడా 30 రోజుల వరకు హిరా గుహలో, ఆరాధనలో నిమగ్నమయ్యారు. దాని తరువాతనే ఆయనకు దైవ సందేశానుగ్రహం పొందే భాగ్యం కలిగింది.
అసలు ఉపవాసం ముఖ్య ఉద్దేశ్యం మనిషిని భయభక్తులు (తఖ్వా) కలవాడుగా తీర్చిదిద్దడం. అతని హృదయాన్ని పవిత్రతతో, పరిశుభ్రతతో నింపడం. భయభక్తులు అంటే, మానవ హృదయం పాపకార్యాల పట్ల ఏవగింపును ప్రదర్శిస్తూ, సదాచారాల వైపు అధికంగా మొగ్గే స్థితి. ఈ స్థితిని మానవుడిలో జనింపజేయడమే ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యం.
సంపన్నులకు, కడుపునిండిన వాళ్ళకు ఆకలిదప్పుల బాధ ఏమిటో తెలిపేది ఉపవాసం మాత్రమే. ఉపవాసం ఉన్నప్పుడే వారు తమ నిరుపేద సోదరుల ఆకలిబాధను గ్రహించగలుగుతారు. వారికి పట్టెడన్నం పెట్టి వారి క్షుద్బాధను నివారించడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అర్ధం చేసుకోగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే, ఉపవాసం ఒక నిర్బంధ సైనిక శిక్షణ. ప్రతి విశ్వాసికి ఈ శిక్షణ సంవత్సరానికొకసారి ఇవ్వబడుతుంది. దీనివల్ల అతను శారీరక కష్టానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. ప్రపంచ వ్యవహారాల్లో శ్రమకు, కృషికి, కష్టనష్టాలకు ఏమాత్రం జంకడు. అందుకే పవిత్ర ఖురాన్ ఉపవాసాన్ని సహనం అని కూడా అభివర్ణించింది.
ఉపవాసం ప్రాముఖ్యతను తెలిపే ఒక ప్రవచనం ఇలా ఉంది. ‘దేవుడు ఇలా ఉపదేశించాడని ముహమ్మద్ ప్రవక్త(స) చెప్పారు. ఆదం సంతానం ప్రతి పనికీ ప్రతిఫలం నిర్ణయించబడి ఉంది. కాని ఉపవాసానికి మాత్రం అలాలేదు. ఎందుకంటే, ఉపవాసం నాది. దాని ప్రతిఫలం నా దాసునికి స్వయంగా నేనే ఇస్తాను. అంటే ఉపవాసం మాత్రమే దైవానిదా? మిగతావి కావా? అని కాదు. విషయం ఏమిటంటే, మిగతా ఆరాధనలన్నీ బాహ్యంలో వ్యక్తమవుతాయి. ఉదాహరణకు నమాజ్, హజ్, జకాత్ ఇవన్నీ బయటికి వ్యక్తమయ్యే ఆచరణలు. ఇతరులు చూడడానికి, వారికి తెలియడానికి అవకాశమున్న ఆచరణలు. కాని ఉపవాసం అలాకాదు. ఇది కేవలం దైవానికి దాసునికి మధ్య మాత్రమే ఉండే సంబంధం. బాహ్య ప్రదర్శనకు అవకాశం లేని ఆరాధన. ఉపవాసం ఉన్న వ్యక్తి తాను ఇతరులకు చెప్పేవరకు దాన్ని గురించి వారికి తెలియదు. ఈ విషయమే ఇతర ఆరాధనల నుండి ఉపవాసాన్ని వేరుచేస్తుంది,
మరో విషయం ఏమిటంటే, నమాజ్ ఇస్లాంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన విధి. నమాజ్ స్వర్గానికి తాళంచెవి. విశ్వాసానికీ అవిశ్వాసానికి మధ్య భేదం తెలిపేది నమాజ్ మాత్రమే. అయినా బహిష్టు సమయంలో స్త్రీలకు ఈ విధి నుండి మినహాయింపు ఇవ్వబడింది. వారు దాన్ని ఖజా కూడా పాటించనవసరంలేదు. కాని ఆకాలంలో తప్పిపోయిన ఉపవాసాలను మాత్రం ఖజా పాటించాలి.’ దీన్నిబట్టి ఉపవాసానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
ఉపవాసం ఒక ప్రాచీన ఆరాధన. పూర్వకాలం నుండి వివిధ మతాల్లో, వివిధ జాతుల్లో ఇది చలామణిలో ఉంది. ఈనాటికీ ఆయా మతధర్మాల అనుయాయులు ఏదో ఒక రూపంలో ఉపవాసవ్రతం పాటించడాన్ని మనం చూడవచ్చు. ‘ప్రజలకు రమజాన్ ఉపవాసాల వాస్తవికత గనక తెలిస్తే, వారు సంవత్సర కాలమంతా రమజానే అయితే బాగుండు అని అభిలషిస్తారు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స).
కనుక మనిషికి మానసికంగా, ఆధ్యాత్మికంగా శాంతి కావాలంటే రమజాన్ ఉపవాసాలను పాటించాలి. ఉపవాసం ఉండడం వల్ల కడుపు కేవలం ఖాళీగానే కాదు, పరిశుభ్రంగా కూడా ఉంటుంది. ఆ ప్రభావం తప్పకుండా హృదయంపై, మేధపై పడుతుంది. ఉపవాసం మన ఉద్రేకాలను, ఆవేశకావేశాలను కొంతకాలం వరకు చల్లబరుస్తుంది. భావాల్లో, ఆలోచనల్లో సమతూకం, ప్రశాంతత నెలకొంటాయి. సకాలంలో నిద్రలేస్తాం. సకాలంలో పనులు చేస్తాం, బాధ్యతాభావం పెరుగుతుంది. జవాబుదారీతనం వస్తుంది. దైవచింతన, పరలోక చింతన, పాపభీతి, పశ్చాత్తాపభావన, మంచీచెడుల విచక్షణ వంటి అనేక మంచి గుణాలు మన సొంతమవుతాయి. కరుణామయుడైన దైవం అందరికీ ఈ విషయాలను అర్ధం చేసుకొని ఆచరించే సౌభాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
దేవునికి దగ్గరగా నివసించడమే ఉద్దేశ్యం
జీవితంలో ప్రతి అంశాన్నీ దైవంతోనూ, భక్తితోనూ జోడించడం హిందూ సంప్రదాయ విశిష్ఠత. తినే ఆహారాన్ని దేవునికి ముందుగా సమర్పించి, దానిని నైవేద్యంగా స్వీకరించడం ఒక కోణమైతే, నిరాహారంగా రోజు గడపడాన్ని కూడా భగవంతుడితో జోడించి ఉపవాసంగా మార్చుకోవడం హైందవం ప్రత్యేకత. ఇక్కడ ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగల సందర్భంగా ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార పానీయాలను తీసుకోరు.లేదా కొద్దిమొత్తంలో మాత్రమే తీసుకుంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట, ఒకరోజు లేదా కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. ఉపవాసం కేవలం మనస్సును దేవుని యందు లగ్నం చేయడానికి మాత్రమే కాదు. శరీరంలోని ఆహారాన్ని జీర్ణం చేసే యంత్రాంగానికి విశ్రాంతినిచ్చి దద్వారా జీర్ణప్రక్రియను మరింత శ క్తిమంతం చేయడానికి కూడా ఉపయోపడుతుంది. - ఆర్.ఎ.ఎస్. శాస్త్రి, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు, ఆదోని.
యేసుక్రీస్తు కూడా ఉపవసించారు!
ఉపవాసం అంటే దేవునికి సమీపంగా జీవించడం అని అర్థం. ఉపవాసం మంచిది అని, ఆరోగ్యదాయకం అని, దేవుణ్ణి సంతోషపరిచే ఆరాధన ప్రక్రియ అని ఏసు సెలవిచ్చాడు. ఏసు సహితం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మోషే ప్రవక్త 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని నుండి దశాజ్ఞలను పొందాడు. ఏసు శిష్యులు అద్భుతకార్యాలు చేయలేకపోయారు. ఏసు చేశాడు. మేమెందుకు చేయలేకపోయామని బాధతో వారు ఏసును ప్రశ్నించారు. ఉపవాసం ద్వారానే అది సాధ్యం అయింది అని ప్రభువు వారికి బదులిచ్చారు. దైవదృష్టికి ఆమోదయోగ్యమైన ఉపవాసమేమిటంటే.. నువ్వు ఉపవాసం ఉండి, నీ ఆహారాన్ని ఆకలిగొన్న వారికి తినిపించడం. ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖ ముఖం పెట్టుకోకుండా శరీరాన్ని, ఆత్మను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. - రెవ. బైరపోగు సామ్యేల్ బాబు, బేతనియ చర్చి, హైదరాబాద్
శాస్త్రీయ దృక్పథం
ఉపవాసం వల్ల ఆధ్యాత్మికంగానే కాదు. భౌతికంగా కూడా చాలా మేలు జరుగుతుందని సశాస్త్రీయంగా రుజువైంది. లంఖణాలవల్ల మనిషి ఆయుష్షు పెరుగుతుందని భారత్, జర్మనీ శాస్త్రజ్ఞులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఉపవాసాల వల్ల మానవుడి జీవితకాలం పెరగడమేగాక మనిషిలోని శక్తి వృథాకాదని కూడా పరిశోధనలో తేలింది. ఉపవాసం వల్ల శారీరక కణాలు నష్టపోవు. మరోఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఉపవాసం ఉన్నప్పుడు పేగుల్లోని కణాలు పుష్టినిచ్చే పదార్థాలను బాగా స్వీకరిస్తాయి. పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలెక్యులర్ బయాలజీ డిప్యూటీ డెరైక్టర్ పి.డి. గుప్తా ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
దేవుడు మానవాళి సాఫల్యం కోసం అవతరింపజేసిన ఆజ్ఞలు, ఆదేశాలన్నీ మానవ నైజానికి, మానవ అవసరాలకు, మానవ సహజ లక్షణాలకు అతి సమీపంగానే కాదు. అతికినట్లుగా సరిపోతాయి. వైద్యశాస్త్రం ప్రకారం - ఉపవాసం పాటించడం వల్ల మనస్సును నియంత్రించుకునే అలవాటు అవుతుంది. దీనివల్ల మనిషి తన ఆత్మపైనేకాక, శరీరంపై కూడా మంచిప్రభావం పడినట్లు గ్రహిస్తాడు. మనసు అదుపులో ఉన్నకారణంగా కామ, క్రోధ, మద, మాత్సర్యాలపై సునాయాసంగా విజయం సాధిస్తాడు. శారీరక ఆరోగ్యం విషయంలో ఉపవాసం గురించి సుప్రసిద్ధ పాశ్చాత్య వైద్యప్రముఖులు ముఖ్యంగా యూరోపియన్ వైద్యులు ఏమంటున్నారో చూద్దాం. ఎవరైనా తమ మనస్సుపై నియంత్రణ సాధించాలనుకుంటే, వారు అధికంగా ఉపవాసాలు పాటించాలి.
- డా. రిచర్డ్
ఉపవాసం పాటిస్తే ఊహలు చెదరవు. నాలుక వేగం తగ్గుతుంది. అంటే మాటల్లో దురుసుతనం తగ్గిపోతుంది. దుష్కార్యాలు చేసే శక్తి సన్నగిల్లుతుంది. బ్రహ్మచర్య జీవితం సాఫీగా, సజావుగా గడిచిపోతుంది. - డా. మైకేల్
ఆరోగ్యం కోసం ఉపవాసం ఎంతో మేలైన విధానం. దీనివల్ల శరీరం అనేక రోగాల నుండి రక్షణ పొందుతుంది. శరీరంలోని చెడుపదార్ధాలు ఈ విధానం ద్వారా తమ విష ప్రభావాన్ని కోల్పోతాయి. - డా. ఎడ్వర్డ్ నిక్సన్
రెండువారాలు ఎడతెరిపి లేకుండా ఉపవాసాలు పాటిస్తే ఓ నలభయ్యేళ్ళవాడి శరీరంలోని నరాలు పదమూడు సంవత్సరాల బాలుడి శరీరంలోని నరాల్లా తయారవుతాయి. - చికాగో యూనివర్శిటీ పరిశోధన