RAMANAMURTHY
-
షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!
(మంథా రమణమూర్తి) మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి. లాభాలు రావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కు తత్వం బోధపడింది.... ప్రపంచ ఓటీటీ రారాజు నెట్‌ఫ్లిక్స్‌లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్ హేస్టింగ్స్ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్‌ఫ్లిక్స్‌ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్వర్డ్ షేరింగ్‌కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కు 2 లక్షల మంది గుడ్‌బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి. ఏప్రిల్– జూన్‌లోనూ ఈ షాక్ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్స్క్రిప్షన్ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్. యాడ్ మార్కెట్ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్‌ఫ్లిక్స్ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి. అమెజాన్‌కు ఆ అవసరం లేదా? ప్రకటనతో కూడిన వీడియో ఆన్ డిమాండ్ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్‌స్టార్ ఇప్పటికే ఏవీవోడీ మోడల్‌ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్‌తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్ నెక్స్›్ట వంటి ఇతర స్ట్రీమింగ్ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా సబ్స్క్రిప్షన్ ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం తట్టుకోగలుగుతున్నాయి. దీనిపై ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్‌ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్‌లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు. ఆహా... నెట్‌ఫ్లిక్స్ దారిలోనే తెలుగు కంటెంట్‌కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రామ్‌శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్‌లో కొన్ని యాడ్స్ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్‌స్టార్‌కు 3.6 కోట్లు, అమెజాన్‌కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశీ టాప్–10లోనూ లేదు. యాడ్స్‌ను స్కిప్ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్ 2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్ మున్ముందు ఎస్వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్ 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్‌వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్ తెలిపింది. యాడ్స్ నుంచి ప్రీమియంవైపు కూడా...! చేతిలో కంటెంట్ ఉన్నపుడు దాన్ని యాడ్స్‌తో... యాడ్స్ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్ గోల్డ్ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్‌తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!. -
అటవీశాఖ అధికారి వీబీ రమణమూర్తి ఆత్మహత్య
-
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
ఓట్ల కోసమే టీడీపీ, బీజేపీ నేతల చెట్టాపట్టాల్ అభివృద్ధి కోసం మాత్రం కలిసి తిరగరు మోసకారి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందే ‘సాక్షి’తో స్వతంత్ర అభ్యర్థి లీడర్ రమణమూర్తి ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని స్వతంత్ర అభ్యర్థి వి.వి.రమణమూర్తి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టుభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, సీపీఎంలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏనాడూ కలిసి పని చేయని టీడీపీ, బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారని రమణమూర్తి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలసి ఉత్తరాంధ్ర ప్రజలను ఘోరంగా మోసం చేశాయని మండిపడ్డారు. ‘హోదా’పై యూటర్న్ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి పెడతామని హామీ ఇచ్చి, ఆ తరువాత మాట మార్చేశారని రమణమూర్తి గుర్తు చేశారు. హోదా కోసం ప్రజలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తే హోదా కుదరదు, ప్రత్యేక çప్యాకేజీ ఇస్తామంటూ మాటమార్చి ప్రజలను మోసం చేసిన తీరు చరిత్రలోనే ఎన్నడూ లేదని ఆయన ధ్వజమెత్తారు. రైల్వే జోన్ సాధనలో విఫలం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇస్తామని చెప్పిన టీడీపీ, బీజేపీలు.. దాని సాధనలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. రైల్వేజోన్ కోసం నిలదీస్తున్న ప్రజలకు ఇదిగో.. అదిగో అంటూ మోసం చేసే పద్ధతిలోనే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్ర కోసం అధికార పార్టీలు చేసినది శూన్యమని ఆరోపించారు. విభజన చట్టంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ మోక్షం లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ మకాం మార్చేశారు.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండుసార్లు పనిచేసిన సీపీఎం బలపరిచిన అభ్యర్థి ఎం.వి.ఎస్.శర్మ ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మకాం మార్చేశారని రమణమూర్తి ఆరోపించారు. అదే పార్టీ బలపరిచిన అజశర్మ ఇప్పుడు పోటీకి దిగినా.. ప్రచారం చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవ చేశారు. పట్టభద్రుల తరఫున ఎన్నికైన శర్మ ఏనాడూ వారి సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవన్నారు. ఓటర్లు వివేకంతో ఆలోచించాలి ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వివేకంతో ఆలోచించాలని రమణమూర్తి పిలుపునిచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ–బీజేపీలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలన్న ఆత్రుతతో అర డజను మంది మంత్రులు, ఆరుగురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలను మోహరించి మరోసారి పట్టభద్రులను మోసగించే పనికి పూనుకున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై జర్నలిస్టుగా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉత్తరాంధ్ర గళం వినిపిస్తానని రమణమూర్తి స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ‘బాబు’ టోకరా టీడీపీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలనెలా నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని రమణమూర్తి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ దానిపై నోరు కూడా మెదపడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంపై ప్రభుత్వంలో ఇటీవల చలనం వచ్చిందన్నారు. ఏటా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను ఐటీ రాజధాని చేస్తామని, మరో సిలికాన్ వ్యాలీగా మారుస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో విశాఖలో ఒక్క ఐటీ కంపెనీనైనా స్థాపించారా? అని ఆయన ప్రశ్నించారు. ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తోందన్నారు. -
ధైర్యం కోల్పోకండి
⇒ రమణమూర్తి కుటుంబానికి జగన్ పరామర్శ ⇒ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ⇒ శ్రీకాకుళం నుంచి కాకినాడ వచ్చిన జననేత ⇒ నేటి ఉదయం హైదరాబాద్ పయనం కాకినాడ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మబలిదానం చేసిన చీకట్ల వెంకటరమణమూర్తి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ర్ట ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉంటున్న రమణమూర్తి కుటుంబాన్ని మంగళవారం రాత్రి పరామర్శించారు. జగన్‌ను చూడగానే రమణమూర్తి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి బోరున విలపించారు. జగన్ వీరి కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండాలని చెప్పి ఓదార్చారు. కుమారుడు రాజేష్‌తో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమణమూర్తి భార్య పార్వతితో జగన్ మాట్లాడారు. కాపుల కోసమే తన భర్త ప్రాణాలను పణంగా పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబానికి ఇప్పుడు దిక్కెవరంటూ ఆవేదన చెందారు. రమణమూర్తి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని సూచించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి రాక చీకట్ల వెంకటరమణమూర్తి ఆత్మబలిదానంతో చలించిపోయిన జగన్ కాకినాడకు వచ్చి కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆవశ్యకతపై యువతలో చైతన్యం తేవడానికి శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన యువభేరిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో కాకినాడ వచ్చారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాకినాడకు చేరుకున్న జగన్ నేరుగా రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి వచ్చారు. అక్కడ నివాసం ఉంటున్న రమణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. కాపు ఐక్యగర్జన సభ నేపథ్యంలో విధ్వంసం చోటుచేసుకోవడం, రిజర్వేషన్ల కల్పన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం వంటి పరిణామాలతో కలత చెంది వెంకటరమణమూర్తి బలిదానం చేసుకున్న ఘటన వివరాలను ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తూ జగన్‌కు తెలియజేశారు. తర్వాత పార్టీ నాయకులతో కలిసి ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లనున్నారు.జగన్ వెంట ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, పినిపే విశ్వరూప్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ముత్తా గోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, గిరిజాల వెంకటస్వామినాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, తోట నాయుడు, అనంత ఉదయభాస్కర్, ముత్తా శశిధర్, ధర్మాన కృష్ణదాసు, ఆర్‌వీజేఆర్ కుమార్, అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, చెల్లుబోయిన వేణు, యనమదల మురళీకృష్ణ దంపతులు, పలువురు నాయకులు ఉన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పెంట (బొబ్బిలి రూరల్) : మండలంలో పెంట గ్రామానికి చెందిన మర్రాపు జయలక్ష్మి (ప్రమీల) బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. తన భార్య చున్నీతో ఉరి వేసుకుందని భర్త నాగభూషణరావు చెబుతుండగా, తమ కుమార్తెను భర్త, అతని కుటుంబ సభ్యులే అదనపు కట్నం కోసం హత్య చేశారని మృతురాలి తండ్రి జి. గౌరునాయుడు ఆరోపిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని డీఎస్పీ రమణమూర్తి, సీఐ రవి, ఎస్సై రవీంద్రరాజులతో పాటు తహశీల్దార్ మాసిలామణి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. భర్త, అత్త, మామ, మరిదిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వివాహం అరుున కొద్ది నెలలకే.. పార్వతీపురం మండలం బంటువానివలసకు చెందిన జయలక్ష్మికి బొబ్బిలి మండలం పెం ట గ్రామానికి చెందిన నాగభూషణరావుతో 2015 ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. వివాహ సమయంలో 1,50,000 రూపాయల నగదు, తులంన్నర బంగారం వరకట్నంగా అందించారు. అరుునా అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త శకుంతుల, మామ గోపాల, మరిది మోహనరావులు నిత్యం వేధించేవారని జయలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లైన పది నెలలకే తన కుమార్తెకు నూరేళ్లు నిండిపోయూయని వారు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. -
నిర్వేదంగా కాదు... నిక్షేపంగా!
అరవై ఎనిమిదేళ్ల రమణమూర్తి ఇటీవలే రిటైర్ అయ్యారు. ఇంట్లో ఇద్దరే. ఆయన... ఆయన భార్య. అంతే. చాలాకాలం నుంచి వాళ్లిద్దరూ ఒంటరిగానే జీవిస్తున్నారు. కారణం... ఇద్దరు పిల్లలనూ దాదాపు పదేళ్లకు పైబడి యూఎస్‌లోనే ఉంటున్నారు. ఇటీవల గమనించిందేమిటంటే... ఇటీవల రోజువారీ వ్యవహారాలపై ఆయనకు ఆసక్తి తగ్గి పోయింది. గతంలోలా ఏదీ మక్కువ కలిగించడం లేదు. వాకింగ్ మానేశారు. చెస్ ఆడటంలేదు. ఎందుకో ఒక్కసారిగా తాను బాగా ఒంటరినైపోయిన ఫీలింగ్. ప్రపంచంపై నమ్మకం కోల్పోయారు. మతిమరపు కూడా వచ్చింది. బాగా దగ్గరివాళ్లను గుర్తుపట్టడం లేదు. పైగా అందరినీ అనుమానిస్తున్నారు. డాక్టర్‌కు చూపిస్తే సైకియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చారు. దాంతో ఆయన మరింత ముకుళించుకుపోయారు. ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అని అడుగుతున్నారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడం అంటే అదేమీ పిచ్చి కానక్కర్లేదనీ, అందరిలోనూ తమ మనసుకు ఏదైనా సమస్య వస్తే కలవాల్సింది ఆయననేననీ, అందుకే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడంలో తప్పులేదని అతికష్టం మీద ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది. సైకియాట్రిస్ట్ ఆయనను పరీక్షించి వృద్ధాప్యంలో సాధారణంగా కనిపించే డిప్రెషన్‌గా గుర్తించి చికిత్స చేయడంతో ఆయన సమస్యకు పరిష్కారం లభించింది. పిల్లలందరూ తల్లిదండ్రులను తమ కెరియర్ కోసం విడిచి విదేశాలకో లేదా దూర ప్రాంతాలకో వెళ్లడం, ఆ తర్వాత తల్లిదండ్రులూ రిటైర్ అయిపోయి జీవితంలో వ్యాపకాలేవీ లేని సమయంలో లోనయ్యే ఈ తరహా డిప్రెషన్ ఇటీవల వేలాదిమందిలో విస్తరిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు దీని పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. వృద్ధాప్యంలో వచ్చే డిప్రెషన్, దాని నివారణ వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. సాధారణంగా డిప్రెషన్ అన్నది ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్‌కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ కింది అంశాలు వృద్ధాప్య డిప్రెషన్‌కు దోహదపడతాయి. త ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు ఈ వయసులో ఎక్కువ. జ్ఞాపకశక్తితో పాటు మెదడు సంబంధమైన సమస్యలూ ఎక్కువే. పైగా ఆ వయసులో శారీరక దృఢత్వం తగ్గడంతో సర్జరీ లేదా ఇతరత్రా వ్యాధుల వల్ల శరీరం కూడా పూర్తిగా సహకరించదు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఒంటరితనం: ఈ వయసులో పిల్లలు తమ జీవితాల్లో స్థిరపడటానికి దూరప్రాంతాలకు వెళ్లి ఉంటారు. తమంతట తామే తేలిగ్గా కదల్లేని స్థితిలో ఎక్కువగా ఉంటారు. దాంతో ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో తమకు ఎవరూ అందుబాటులో లేకపోవడం కూడా డిప్రెషన్‌కు తేలిగ్గా దారితీస్తుంది. ఏ ప్రయోజనం కోసం జీవించాలనే భావన: అన్ని వ్యాపకాలూ తీరిపోయాక కొందరిలో ఒక చిత్రమైన భావన మొలకెత్తుతుంది. ఇది కాస్త ప్రమాదకరం. ఇక ఏ ప్రయోజనం కోసం బతకాలనే భావన అంకురిస్తే అది తేలిగ్గా డిప్రెషన్‌కు దారితీస్తుంది. అర్థం లేని భయాలు: తాము ఒంటరిగా ఉన్నప్పుడు చనిపోతామేమో, ఈ వయసులో అకస్మాత్తుగా ఏవైనా ఆర్థికసమస్యలు చుట్టుముడితే అధిగమించడం ఎలా, వృద్ధాప్యం లో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గకుండా అలాగే కొనసాగుతుంటే ఎలా... లాంటి అర్థం లేని భయాలు వారిని చుట్టుముడతాయి. ఇటీవలే సంభవించిన మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో ఎవరైనా చనిపోవడం వృద్ధులను కుంగదీస్తుంది. తమ ఈడు స్నేహితులు, తమకంటే చిన్నవారిగా ఉండే కుటుంబసభ్యులు, ఆ మాటకొస్తే తమ ఇంటి పెంపుడు జంతువులు, అన్నిటికంటే తీవ్రంగా జీవిత భాగ స్వామి మరణం లాంటివి ఇంకా బాధపెడతాయి. ఇలాంటి సందర్భాల్లో వారింకా తేలిగ్గా డిప్రెషన్‌కు లోనవుతారు. అది బాధా... డిప్రెషనా? ఒకరు తీవ్రమైన బాధకు లోనై ఉన్నప్పుడు వారు వాస్తవంగా తీవ్రమైన బాధలో ఉన్నారా లేక డిప్రెషన్లో ఉన్నారా అన్న విషయం తెలుసుకోవడం ఒకింత కష్టమే. ఈ రెండింటికీ మధ్య తేడాను తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా బాధ, సంతోషం, ఇతరత్రా ఉద్వేగాలు కలుగుతుంటాయి. సంతోషం తర్వాత బాధ, బాధ తర్వాత సంతోషం కలుగుతాయి. కానీ డిప్రెషన్లో ఉన్నవారు బాధతో, ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతోనే ఉంటారు. ఇదీ తేడా. వృద్ధుల్లో డిప్రెషన్‌కు కారణమయ్యే వైద్య-ఆరోగ్యాంశాలు : వృద్ధాప్యంలో కనిపించే ఆరోగ్యసమస్యల కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలోనూ అందరిలో కనిపించే సాధారణ వ్యాధుల కంటే భయంకరమైనవిగా పేరొందిన కారణంగా కొన్ని వ్యాధులు వారిని మానసికంగా కుంగదీస్తాయి. నిజానికి సాధారణ వ్యాధులే ఒక్కోసారి ప్రమాదం కలిగించేంత తీవ్రతతో ఉన్నా... వాటి కంటే ప్రమాదకరం కానంత తక్కువ తీవ్రతలో ఉన్నవే ఎక్కువగా కుంగదీయవచ్చు. అలాంటి వ్యాధుల్లో కొన్ని... పార్కిన్సన్ పక్షవాతం గుండెజబ్బులు క్యాన్సర్ థైరాయిడ్ డిజార్డర్, డయాబెటిస్, దాని కారణంగా వచ్చే అనుబంధ సమస్యలు విటమిన్ బి-12 లోపం, మతిమరపు, అల్జైమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్ల్కిరోసిస్. ప్రిస్క్రిప్షన్‌లో వాడే మందులతో డిప్రెషన్: వృద్ధాప్యంలో వచ్చే కొన్ని సమస్యల కోసం వాడే మందుల దుష్ర్పభావం వల్ల కూడా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఒకటి కంటే ఎక్కువగా మందులు / అనేక మందులు వాడేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. దీనికీ ఒక కారణం ఉంది. అవే మందులు కాస్తంత తక్కువ వయసు ఉండేవారిలో అదేరీతిలో ప్రవర్తించవు. అయితే ఒకింత వయసు పైబడ్డవారిలో శరీర జీవక్రియలు మందగించడం వల్ల ఆ మందులను పూర్తిగా తమలోకి ఇంకేలా చేసుకునే శక్తి శరీరానికి ఉండకపోవచ్చు. దాంతో ఇలాంటి దుష్ర్పభావాలు కలుగుతాయి. సాధారణంగా రక్తపోటు మందులు, బీటా బ్లాకర్లు, నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్సన్ డిసీజ్‌కు వాడే మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి వృద్ధుల్లో డిప్రెషన్ కలిగించేందుకు ఆస్కారం ఎక్కువ. వృద్ధుల్లో ఆల్కహాల్ - డిప్రెషన్ : చాలామంది తమ జీవితంలోని చివరి మజిలీగా పరిగణించే వృద్ధాప్యంలో నిశ్చింతగా మద్యం సేవిస్తూ జీవితాన్ని ఆనందించవచ్చని భావిస్తుంటారు. ఇక కొందరు వృద్ధులు రాత్రివేళ తమకు తేలిగ్గా, సుఖంగా నిద్రపట్టడానికి కూడా మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. అంటే మద్యం తాము కోరుకున్న ఆనందాన్ని ఇవ్వకపోగా, ప్రతికూల ఫలితాలను ఇస్తుందన్నమాట. దాంతోపాటు ఆల్కహాల్ వల్ల తేలిగ్గా ఆగ్రహాలకు, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగ్జైటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు దెబ్బతినడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. పైగా ఆ వయసులో ఆల్కహాల్‌తో మరో ప్రమాదమూ ఉంది. ఆ వయసులో వృద్ధులు తీసుకునే అనేక మందులతో అది ప్రతిచర్యజరిపి కొన్ని ప్రతికూల ఫలితాలనూ ఇచ్చే అవకాశం ఉంది. వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులను పనిచేయకుండా చేసే గుణం కూడా ఉంది. పైగా అది నిద్రలోని నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. వృద్ధాప్య డిప్రెషన్ల లక్షణాలు : నిత్యం తీవ్రమైన విచారం. అలసట జీవితంలోని అనేక అంశాల పట్ల ఆసక్తి కోల్పోవడం (అవే అంశాలు తమకు గతంలో చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చినవై ఉంటాయి) క్రమంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం క్రమంగా ఆకలి తగ్గుతుండటం బరువు కూడా క్రమంగా తగ్గుతూ పోవడం తరచూ నిద్రాభంగం కలుగుతుండటం (ఇది అనేక రకాలుగా జరగవచ్చు. నిద్రపట్టడంలో చాలా ఎక్కువ ఆలస్యం జరుగుతుండవచ్చు. మధ్యమధ్య నిద్రాభంగం కలుగుతుండవచ్చు. ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండవచ్చు లేదా కొన్నిసార్లు రాత్రి నిద్ర తగ్గిపోవడం వల్ల రోజంతా నిద్రమత్తుగా ఉన్నట్లు అనిపిస్తుండవచ్చు) తను సమాజానికి తీవ్రమైన భారమనీ, ఎందుకూ పనికిరానివాడినని భావించే నిర్వేదం మద్యం / డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా యత్నాలు / ఆలోచనలు. ప్రతికూల/డిప్రెషన్ భావనలను గుర్తించడం ఎలా? వృద్ధుల్లో డిప్రెషన్‌ను కనిపెట్టడానికి కొన్ని అంశాలు బాగా ఉపయోగపడతాయి. ఆ క్లూస్ ఇవే... అకస్మాత్తుగా అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెట్టడం తరచూ తమ నిస్పృహనూ, ఏమీ చేయలేకపోతున్న విషయాలను ప్రస్తావిస్తూ ఉండటం. యాంగ్జైటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుండటం అంతకుముందు ఆనందాలిచ్చిన వ్యాపకాలపై ఏమాత్రం శ్రద్ధ కనబరచకపోవడం, వాటిపట్ల ఎంతమాత్రం ఆసక్తి చూపకపోవడం త్వరగా భావోద్వేగాలకు గురికావడం నలుగురితో కలవడానికి ఇష్టపడకపోవడం / హాబీలపై ఆసక్తి కోల్పోవడం వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం (అంటే భోజనం చేయడంలో నిరాసక్తత, మందులు సమయానికి వేసుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటివి). చికిత్స: పై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్‌కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు కౌన్సెలింగ్ కూడా అవసరం. అధిగమించడం ఇలా... వృద్ధాప్యంలో డిప్రెషన్‌ను నివారించే చర్యలవే వ్యాయామం: తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామాల వల్ల డిప్రెషన్ దరిచేరదు. నలుగురినీ కలవడం: వృద్ధాప్యంలో కలిగే తీరికను ఆసరాగా తీసుకుని నలుగురినీ కలుస్తుండటం వల్ల డిప్రెషన్ వృద్ధుల ఛాయలకే రాదు. పైగా డిప్రెషన్ నివారణలో ఈ అంశం చాలా బాగా పనిచేస్తుంది. కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం అన్నది డిప్రెషన్‌కు మంచి మందు. అయితే మితిమీరి మాత్రం నిద్రపోకూడదు. అంటే... నిద్రసమయం 7-9 గంటలు మించనివ్వవద్దు. సమతుల ఆహారం: అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతుల ఆహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్ వద్దు. హాబీలు: మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పని ఒత్తిడి, తీరిక లేని కారణం గా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది. పెంపుడు జంతువులు: పెట్స్ ఆలనా-పాలనా డిప్రెషన్‌ను దరిచేరనివ్వవు. కొత్తవిద్యలు/ నైపుణ్యాలు: వీటిని నేర్చుకోవడం డిప్రెషన్‌ను అధిగమించడానికి మేలు చేస్తుంది. వృద్ధాప్యంలో మెదడు పనితీరు, సామర్థ్యం తగ్గుతాయన్న దురభిప్రాయం మనలో చాలామందికి ఉంది. ఇది వాస్తవం కాదు. మెదడు సామర్థ్యంలో కొద్దిగా మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా ఆ సమయంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి అలా నేర్చుకోవడం సులభం కూడా. హాస్యం: ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం డిప్రెషన్‌కు మంచి మందు. -నిర్వహణ: యాసీన్ -
సాంస్కృతిక మండలి మాజీ అధ్యక్షుడు రమణమూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక మండలి మాజీ అధ్యక్షుడు, సినీ నిర్మాత ఆర్వీ రమణమూర్తి(72) కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజాము రెండున్నర గంటలకు మృతిచెందారు. ఇందిరాపార్క్ సమీపంలోని ఆయన నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. రమణమూర్తికి ఇద్దరు కుమార్తెలు. సాయంత్రం బన్సీలాల్ పేటలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అభిరుచి కలిగిన నిర్మాత..: రమణమూర్తి మంచి అభిరుచి కలిగిన సినీ నిర్మాతగా, సాంస్కృతికరంగ ప్రముఖునిగా పేరుపొందారు. ఆంధ్రప్రదేశ్ కళావేదిక పక్షాన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అభినందన, నీరాజనం, సాయిమహిమ వంటి సంగీత ప్రధాన చిత్రాలను నిర్మించారు. ప్రముఖ హిందీ సినీ సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ఇటీవలే ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య చిత్రాన్ని నిర్మించేందు కు కథ తయారుచేసుకుని కొన్ని పాటలు కూడా రికార్డు చేయించారు. ఎందరో పేద కళాకారులకు ఆర్థికసాయం అందజేశారు. తొలినాళ్లలో దివంగత సీఎం టి.అంజయ్యకు, ఆ తరువాత ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యకు సన్నిహితునిగా పేరుపొందారు. కాగా రమణమూర్తి మృతిపట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. రమణమూర్తి మరణం కళారంగానికి తీరని లోటని రోశయ్య పేర్కొన్నారు.