ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
ఓట్ల కోసమే టీడీపీ, బీజేపీ నేతల చెట్టాపట్టాల్
అభివృద్ధి కోసం మాత్రం కలిసి తిరగరు
మోసకారి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందే
‘సాక్షి’తో స్వతంత్ర అభ్యర్థి లీడర్ రమణమూర్తి
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని స్వతంత్ర అభ్యర్థి వి.వి.రమణమూర్తి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టుభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, సీపీఎంలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏనాడూ కలిసి పని చేయని టీడీపీ, బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారని రమణమూర్తి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలసి ఉత్తరాంధ్ర ప్రజలను ఘోరంగా మోసం చేశాయని మండిపడ్డారు.
‘హోదా’పై యూటర్న్
ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి పెడతామని హామీ ఇచ్చి, ఆ తరువాత మాట మార్చేశారని రమణమూర్తి గుర్తు చేశారు. హోదా కోసం ప్రజలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తే హోదా కుదరదు, ప్రత్యేక çప్యాకేజీ ఇస్తామంటూ మాటమార్చి ప్రజలను మోసం చేసిన తీరు చరిత్రలోనే ఎన్నడూ లేదని ఆయన ధ్వజమెత్తారు.
రైల్వే జోన్ సాధనలో విఫలం
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇస్తామని చెప్పిన టీడీపీ, బీజేపీలు.. దాని సాధనలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. రైల్వేజోన్ కోసం నిలదీస్తున్న ప్రజలకు ఇదిగో.. అదిగో అంటూ మోసం చేసే పద్ధతిలోనే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్ర కోసం అధికార పార్టీలు చేసినది శూన్యమని ఆరోపించారు. విభజన చట్టంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ మోక్షం లేదన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్సీ మకాం మార్చేశారు..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండుసార్లు పనిచేసిన సీపీఎం బలపరిచిన అభ్యర్థి ఎం.వి.ఎస్.శర్మ ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మకాం మార్చేశారని రమణమూర్తి ఆరోపించారు. అదే పార్టీ బలపరిచిన అజశర్మ ఇప్పుడు పోటీకి దిగినా.. ప్రచారం చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవ చేశారు. పట్టభద్రుల తరఫున ఎన్నికైన శర్మ ఏనాడూ వారి సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవన్నారు.
ఓటర్లు వివేకంతో ఆలోచించాలి
ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వివేకంతో ఆలోచించాలని రమణమూర్తి పిలుపునిచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ–బీజేపీలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలన్న ఆత్రుతతో అర డజను మంది మంత్రులు, ఆరుగురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలను మోహరించి మరోసారి పట్టభద్రులను మోసగించే పనికి పూనుకున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై జర్నలిస్టుగా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉత్తరాంధ్ర గళం వినిపిస్తానని రమణమూర్తి స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు ‘బాబు’ టోకరా
టీడీపీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలనెలా నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని రమణమూర్తి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ దానిపై నోరు కూడా మెదపడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంపై ప్రభుత్వంలో ఇటీవల చలనం వచ్చిందన్నారు. ఏటా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను ఐటీ రాజధాని చేస్తామని, మరో సిలికాన్ వ్యాలీగా మారుస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో విశాఖలో ఒక్క ఐటీ కంపెనీనైనా స్థాపించారా? అని ఆయన ప్రశ్నించారు. ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తోందన్నారు.