Ramesh ranganadhan
-
‘చెన్నంపల్లి’ తవ్వకాలపై హైకోర్టుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను దూపాడుకు చెందిన డాక్టర్ బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాలను అడ్డుకోవాలని కోరు తూ లేఖ రాశారు.ఈ వ్యాజ్యంపై ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం 30న విచారణ జరపనుంది. -
ఏసీజేను కలసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం 3.30 గంటలకు హైదరాబాద్ తార్నాకలోని ఏసీజే నివాసానికి వెళ్లి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటన్నరపాటు ఏసీజేతో సమావేశమైన తర్వాత సీఎం ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. సీఎం రాక గురించి స్థానిక పోలీసులకు తప్ప మరెవరికీ తెలియదు. సీఎం వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకులు ఆయనను కలిసేందుకు అక్కడికి తరలివచ్చారు. అయితే సీఎం అప్పటికే ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. -
నాంపల్లి కోర్టులో మోడల్ చిల్డ్రన్స్ కోర్టు
హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మోడల్ చిల్ట్రన్స్ కోర్టు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం మోడల్ చిల్డ్రన్స్ కోర్టును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రోపాలిటన్ సెషెన్స్ జడ్జి రజిని, ఐజీ సౌమ్యా మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. గోవా, ఢిల్లీ తరువాత ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటైన కోర్టు దేశంలోనే మూడోదని పేర్కొన్నారు. రాబోయో రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా మోడల్ చిల్డ్రన్స్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. కేసుల విచారణలో చిన్నారులు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే మోడల్ చిల్డ్రన్స్ కోర్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్నేహపూరితమైన వాతావరణంలో కేసుల విచారణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిన్నారులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తామని డీజీపీ వెల్లడించారు. -
జానారెడ్డి ఆస్తుల వివరాలు ఇవ్వట్లేదు: చిన్నపరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లు, అందులో పేర్కొన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినా అధికారులు పూర్తిగా ఇవ్వట్లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార కమిషనర్, నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. చిన్నపరెడ్డి పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు. జానారెడ్డి 1973 నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లు, వాటిలో పేర్కొన్న వారి కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను సమర్పించాలంటూ ఈ ఏడాది మే 17న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్లు చిన్నపరెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు కేవలం 2009 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లు, అందుకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇచ్చారని, మిగిలిన వివరాలు అందుబాటులో లేవని సమాధానమిచ్చారని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.