సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లు, అందులో పేర్కొన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినా అధికారులు పూర్తిగా ఇవ్వట్లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార కమిషనర్, నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. చిన్నపరెడ్డి పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు.
జానారెడ్డి 1973 నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లు, వాటిలో పేర్కొన్న వారి కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను సమర్పించాలంటూ ఈ ఏడాది మే 17న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్లు చిన్నపరెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు కేవలం 2009 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లు, అందుకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇచ్చారని, మిగిలిన వివరాలు అందుబాటులో లేవని సమాధానమిచ్చారని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
జానారెడ్డి ఆస్తుల వివరాలు ఇవ్వట్లేదు: చిన్నపరెడ్డి
Published Fri, Nov 1 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement