స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు @ 100 కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ అమ్మకాలు గతేడాదిలో వంద కోట్లకు పైగా చేరాయి. భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరల్లో లభించే స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఐడీసీ వెల్లడించింది. ఐడీసీ తెలిపిన వివరాల ప్రకారం...,
ఒక ఏడాది కాలంలో వంద కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడవడం ఇదే మొదటిసారి.
గతేడాది మొత్తం 100.42 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 2012 అమ్మకాల(72.53 కోట్ల)తో పోల్చితే 38 శాతం వృద్ధి నమోదైంది. కాగా 2011లో 49.44 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. కేవలం రెండేళ్లలో ఈ విక్రయాలు రెట్టింపయ్యాయి.
గతేడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 28.44 కోట్లు స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 2012 ఇదే క్వార్టర్‌కు అమ్ముడైన స్మార్ట్ఫోన్లు(22.9 కోట్లు)తో పోల్చితే 24 శాతం వృద్ధి నమోదైంది.
2012లో 42 శాతంగా ఉన్న మొత్తం ఫోన్ల విక్రయాల్లో స్మార్ట్ఫోన్ల వాటా 2013లో 55 శాతానికి పెరిగింది.
పెద్ద స్క్రీన్ ఉండడం, తక్కువ ధరల్లో లభ్యం కావడం... ఈ రెండు అంశాలు స్మార్ట్ఫోన్ల విక్రయాల జోరుకు ప్రధాన కారణాలు.
భారత్, చైనా దేశాల్లో 150 డాలర్లు(రూ.9,000)లోపు స్మార్ట్ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్, హువాయ్, లెనొవొ, ఎల్జీ కంపెనీలున్నాయి.
మొత్తం 31.39 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించి 31 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్(15.34 కోట్ల ఫోన్లు, 15 శాతం మార్కెట్ వాటా), హువాయ్(4.88 కోట్లు-5 శాతం మార్కెట్ వాటా)లు నిలిచాయి.