Ramzan Market
-
నైట్ బజార్.. ఫుల్ హుషార్.
చార్మినార్: పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో నిత్యం సందడి కనిపిస్తోంది. వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. రంజాన్ మాసంలోని చివరి ఘట్టమైన జుమ్మత్ ఉల్ విదా పూర్తి కావడంతో ముస్లింలు ఇక ఈద్–ఉల్–ఫితర్ పండగ కోసం సిద్ధమవుతున్నారు. పండగకు ఇంకా ఒకరోజే మిగిలి ఉండటంతో పాతబస్తీలో ఎటుచూసినా రంజాన్ పండగ సంతోషం కనిపిస్తోంది. నైట్ బజార్ అర్ధరాత్రి దాటిన తర్వాత 2–3 గంటల వరకు కూడా కొనసాగుతోంది. (చదవండి: ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే! ) -
గాజుల గలగలలకు నెలవు లాడ్‌బజార్
చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా...5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు...రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి. ఎన్నో రకాలు... లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే. లాడ్‌బజార్ అంటే.... లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. రూ.లక్షల్లో వ్యాపారం.... ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు. (చదవండి: పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం) -
అర్ధరాత్రి పాతబస్తీలో కొత్వాల్ పర్యటన
చార్మినార్ (హైదరాబాద్) : నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పాతబస్తీలో సందడి చేశారు. రంజాన్ మాసం నేపథ్యంలో పాతబస్తీలో కొనసాగుతున్న మార్కెట్‌ను పరిశీలించారు. రోడ్డుపై కాలినడకన కలియ తిరిగారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులను పలకరించారు. ముస్లిం వ్యాపారులకు రంజాన్ శుభాకాంక్షలు (ముబారక్) తెలిపారు. పుట్‌పాత్ వ్యాపారులను కలిసి మామూళ్ల పేరుతో ఎవరైనా వేధిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి 10.30 గంటలకు చార్మినార్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆయన 11 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 12.15 గంటల వరకు ఆయన పర్యటన కొనసాగింది. చార్మినార్ నుంచి కాలినడకన బయలు దేరారు. చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి మసీదు వరకు .. అక్కడి నుంచి తిరిగి గుల్జార్‌హౌజ్, చార్మినార్ ద్వారా శాలిబండ పిస్తాహౌజ్, శాలిబండ చౌరస్తా వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, చార్మినార్, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్లు యాదగిరి, బాలాజీ ఆయన వెంట ఉన్నారు.