నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పాతబస్తీలో సందడి చేశారు.
చార్మినార్ (హైదరాబాద్) : నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పాతబస్తీలో సందడి చేశారు. రంజాన్ మాసం నేపథ్యంలో పాతబస్తీలో కొనసాగుతున్న మార్కెట్‌ను పరిశీలించారు. రోడ్డుపై కాలినడకన కలియ తిరిగారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులను పలకరించారు. ముస్లిం వ్యాపారులకు రంజాన్ శుభాకాంక్షలు (ముబారక్) తెలిపారు. పుట్‌పాత్ వ్యాపారులను కలిసి మామూళ్ల పేరుతో ఎవరైనా వేధిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
గురువారం రాత్రి 10.30 గంటలకు చార్మినార్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆయన 11 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 12.15 గంటల వరకు ఆయన పర్యటన కొనసాగింది. చార్మినార్ నుంచి కాలినడకన బయలు దేరారు. చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి మసీదు వరకు .. అక్కడి నుంచి తిరిగి గుల్జార్‌హౌజ్, చార్మినార్ ద్వారా శాలిబండ పిస్తాహౌజ్, శాలిబండ చౌరస్తా వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, చార్మినార్, హుస్సేనీఆలం ఇన్స్‌పెక్టర్లు యాదగిరి, బాలాజీ ఆయన వెంట ఉన్నారు.