rank holder
-
ఏఐటీటీ టాపర్స్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ఏఐటీటీ)–2020లో క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్) జాతీయ స్థాయి పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం, వారి చదువుకు అనుగుణంగా ఏపీఐఐసీలో ఉద్యోగాన్ని ప్రకటించారు. వారికి మెమెంటోలతో పాటు సర్టిఫికెట్లు, ట్యాబ్‌లను అందజేశారు. ఇదిలా ఉండగా కౌశలాచార్య అవార్డు–2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ వై.రజిత ప్రియను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందిస్తూ రూ.5 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు. వీరందరికీ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి, రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏఐటీటీ–2020 టాపర్స్ వీరే.. ► డి.మణికంఠ, మెకానిక్ డీజిల్ ట్రేడ్ – ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ►మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్ ఇండియా ఐదో ర్యాంక్ ►ఎన్.కుమారి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆల్ ఇండియా ఆరో ర్యాంక్ ► ఎం.బాల పవన్ రాజు, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంక్ ►ఎం.రోషణ్, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ ట్రేడ్, ఆల్ ఇండియా తొమ్మిదో ర్యాంక్. -
జైల్లో ఉంటూ.. అరుదైన రికార్డు!
జైపూర్: జైలులో తండ్రితోపాటు కలిసి ఓపెన్ కారాగారంలో ఉంటూ ఓ కుర్రాడు ఐఐటీ సీటు సాధించాడు. జేఈఈ పరీక్ష పాసయ్యాడు. పూల్ చంద్ అనే వ్యక్తి ఓ నేరానికి సంబంధించి కోట ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓపెన్ జైలులో కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతి ఉండటంతో తండ్రితోపాటే అక్కడ ఉండేందుకు అతడి కుమారుడు పీయూష్ మీనా సిద్ధమయ్యాడు. పేదరికమే ఈ పరిస్థితికి దారితీసింది. తండ్రి వారించినా వినకుండా జైలులోనే 8 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు ఉండి వెలుతురు సరిగా రాని గదిలో ఉంటూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమై విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీ కింద 453వ ర్యాంక్ సాధించాడు. ఓపెన్ జైలులో కుటుంబసభ్యులను శిక్షను అనుభవించేవారితోపాటే ఉండనివ్వడంతోపాటు రోజూవారీ అవసరాల కోసం పనికి కూడా బయటకు వెళ్లి రావచ్చు. కాగా, తండ్రి పూల్ చంద్ కు ఇష్టం లేకపోయినా.. హాస్టల్, కోచింగ్ ఫీజులకు డబ్బు సరిపోకపోవడంతో పీయూష్ మీనా 2014 జులైలో జైలుకు వచ్చేశాడు. ఈ విషయంపై మాట్లాడిన మీనా తండ్రి బంధువులు, స్నేహితులు అందరిని సంప్రదించగా లక్ష రూపాయలు ఏర్పాటు అయ్యాయని కోచింగ్, హాస్టల్ ఫీజుకు రెండు లక్షలు అవసరమయ్యాయని తెలిపారు. ఎలాగైనా బిడ్డను చదివించుకోవాలని గతంలో ప్రభుత్వ టీచర్ అయిన తాను ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ గా ప్రయత్నిస్తే, నేరస్థుడిని కావడం మూలాన అవేమీ దొరకలేదని, దాంతో మెడికల్ స్టోర్ లో హెల్పర్ గా పనిచేసినట్లు వివరించారు. జేఈఈలో ర్యాంక్ సంపాదించడంపై మాట్లాడిన పీయూష్ మీనా.. మొదట్లో జైల్లో చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పాడు. కచ్చితమైన నిబంధనలు ఉండటంతో పాటు రాత్రి 11గంటలకు లైట్లన్నీ ఆర్పివేస్తారని తెలిపాడు. జైలు గది మరీ చిన్నదిగా ఉండటంతో పాటు వెలుతురు కూడా ఎక్కువగా వచ్చేది కాదని చెప్పాడు. తాను రోజూవారీ సిలబస్ ను పూర్తి చేయడానికి చదువుకునే సమయంలో తన తండ్రి బయట ఉండేవారని వివరించాడు. ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేసిన పీయూష్ శిక్షాకాలం ముగిసిన తర్వాత తండ్రి బాగోగులు చూసుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. మొత్తం 12 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్న పూల్ చంద్ ఇప్పటికి 10ఏళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేశాడు.