
జైల్లో ఉంటూ.. అరుదైన రికార్డు!
జైపూర్: జైలులో తండ్రితోపాటు కలిసి ఓపెన్ కారాగారంలో ఉంటూ ఓ కుర్రాడు ఐఐటీ సీటు సాధించాడు. జేఈఈ పరీక్ష పాసయ్యాడు. పూల్ చంద్ అనే వ్యక్తి ఓ నేరానికి సంబంధించి కోట ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓపెన్ జైలులో కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతి ఉండటంతో తండ్రితోపాటే అక్కడ ఉండేందుకు అతడి కుమారుడు పీయూష్ మీనా సిద్ధమయ్యాడు. పేదరికమే ఈ పరిస్థితికి దారితీసింది. తండ్రి వారించినా వినకుండా జైలులోనే 8 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు ఉండి వెలుతురు సరిగా రాని గదిలో ఉంటూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమై విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీ కింద 453వ ర్యాంక్ సాధించాడు.
ఓపెన్ జైలులో కుటుంబసభ్యులను శిక్షను అనుభవించేవారితోపాటే ఉండనివ్వడంతోపాటు రోజూవారీ అవసరాల కోసం పనికి కూడా బయటకు వెళ్లి రావచ్చు. కాగా, తండ్రి పూల్ చంద్ కు ఇష్టం లేకపోయినా.. హాస్టల్, కోచింగ్ ఫీజులకు డబ్బు సరిపోకపోవడంతో పీయూష్ మీనా 2014 జులైలో జైలుకు వచ్చేశాడు. ఈ విషయంపై మాట్లాడిన మీనా తండ్రి బంధువులు, స్నేహితులు అందరిని సంప్రదించగా లక్ష రూపాయలు ఏర్పాటు అయ్యాయని కోచింగ్, హాస్టల్ ఫీజుకు రెండు లక్షలు అవసరమయ్యాయని తెలిపారు.
ఎలాగైనా బిడ్డను చదివించుకోవాలని గతంలో ప్రభుత్వ టీచర్ అయిన తాను ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ గా ప్రయత్నిస్తే, నేరస్థుడిని కావడం మూలాన అవేమీ దొరకలేదని, దాంతో మెడికల్ స్టోర్ లో హెల్పర్ గా పనిచేసినట్లు వివరించారు. జేఈఈలో ర్యాంక్ సంపాదించడంపై మాట్లాడిన పీయూష్ మీనా.. మొదట్లో జైల్లో చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పాడు. కచ్చితమైన నిబంధనలు ఉండటంతో పాటు రాత్రి 11గంటలకు లైట్లన్నీ ఆర్పివేస్తారని తెలిపాడు. జైలు గది మరీ చిన్నదిగా ఉండటంతో పాటు వెలుతురు కూడా ఎక్కువగా వచ్చేది కాదని చెప్పాడు. తాను రోజూవారీ సిలబస్ ను పూర్తి చేయడానికి చదువుకునే సమయంలో తన తండ్రి బయట ఉండేవారని వివరించాడు. ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేసిన పీయూష్ శిక్షాకాలం ముగిసిన తర్వాత తండ్రి బాగోగులు చూసుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. మొత్తం 12 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్న పూల్ చంద్ ఇప్పటికి 10ఏళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేశాడు.