ransom
-
రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్.. కోవిడ్ శవంగా అంత్యక్రియలు
లక్నో: మిత్రుని కోసం ప్రాణాలిచ్చే స్నేహితుల గురించి చదివాం. కానీ ప్రస్తుతం డబ్బుల కోసం మిత్రుడి ప్రాణాలు తీసే ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆగ్రాలో చోటు చేసుకుంది. డబ్బు కోసం స్నేహితుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడిని చంపి.. కోవిడ్ వల్ల చనిపోయాడని చెప్పి.. అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోల్డ్ స్టోరేజ్ ఓనర్ సురేష్ చౌహాన్ ఒక్కగానొక్క కుమారుడు సచిన్ చౌహాన్(23) జూన్ 21న కిడ్నాప్ అయ్యాడు. 2 కోట్ల రూపాయల కోసం స్నేహితులే ఈ నేరానికి పాల్పడ్డారు. సచిన్ స్నేహితులు నలుగురు, మరో వ్యక్తితో కలిసి అతడి కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచిన్ స్నేహితుడు ఒకరు అతడికి కాల్ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. తర్వాత అందరూ ఓ పాడుబడిని ట్యాంక్ మీద కూర్చుని మందు తాగారు. అనంతరం లామినేషన్ పేపర్‌తో సచిన్‌కు ఊపిరాడకుండ చేసి హత్య చేశారు నిందితులు. సచిన్ కిడ్నాప్ అయిన నాటి నుంచి అతడి తల్లి.. కుమారుడి నంబర్‌కు కాల్ చేస్తూనే ఉంది. వేరే వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేసి.. సచిన్ ఇక్కడ లేడని తెలిపేవారు. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు సచిన్ స్నేహితులు.. తమ మిత్రుడు కోవిడ్ వల్ల చనిపోయాడని నమ్మించడం కోసం.. పీపీఈ కిట్లు ధరించి.. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి.. అస్థికలను సమీపంలోని నదిలో నిమజ్జనం చేశారు. ఇక వీరి కదలికపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి వీరి గురించి పోలీసలుకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2 కోట్ల రూపాయల కోసం తామే సచిన్‌ను కిడ్నాప్ చేశామని.. కానీ అతడు బతికుంటే తమకు ప్రమాదం అని భావించి.. హత్య చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘నిందితులు 25 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. సచిన్‌ను చంపిన తర్వాత అతడి తల్లిదండ్రులకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని భావించారు’’ అని తెలిపాడు. చదవండి: పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు -
ఫేక్ ఈమెయిల్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: భారత్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు తమకు వచ్చే ఫేక్ ఈ–మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. ఇంటర్నెట్లో అశ్లీల వెబ్సైట్ల వంటి వాటిని చూసినపుడు అందులోని సాఫ్ట్వేర్ ద్వారా వెబ్‌కామ్ వాడి దాన్ని వీక్షిస్తున్న వ్యక్తి వీడియోను రికార్డు చేస్తారు. అనంతరం దాన్ని ఆ వ్యక్తికి పంపి, ఫేస్బుక్ మిత్రులు, బంధువులకు షేర్ చేస్తామంటూ ఆ వ్యక్తిని బెదిరిస్తారు. షేర్ చేయకుండా ఉండాలంటే డబ్బును 24 గంటల్లోగా ఇవ్వాలని, అదికూడా క్రిప్టో కరెన్సీలోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ తతంగమంతా ఈ–మెయిల్లో నడిపిస్తారు. ఇలాంటి ఈ–మెయిల్స్ వస్తే భయపడవద్దని సీఈఆర్టీ–ఇన్ సూచించింది. తమకు పాస్‌వర్ట్‌లు తెలుసని బెదిరిస్తే వెంటనే పాస్‌వర్ట్‌లు మార్చుకోవాలని ఇంటర్నెట్ యూజర్లకు సీఈఆర్టీ–ఇన్ సూచించింది. -
డబ్బు కోసం అడ్డదారి తొక్కిన లవర్స్
జోధ్ పూర్: టీవీ క్రైమ్ సీరియల్ ప్రేరణగా తీసుకుని కిడ్నాప్ కు పాల్పడిన ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు. ఓ యువతి తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి వరసకు సోదరుడయ్యే నాలుగేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి చివరకు ఊచలు లెక్కిస్తోంది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో పూర్ణిషా(22) అనే యువతి తన ప్రియుడు మయాంక్ మెహతా, అతడి స్నేహితుడు మయాంక్ సింధాల్ సహాయంతో యుగ్ భండారి(4)ని కిడ్నాప్ చేసింది. మోటార్ సైకిల్ పై తిప్పుతానని మానసరోవర్ కాలనీలోని ఇంటి నుంచి భండారిని పూర్ణిషా బయటకు తీసుకెళ్లింది. తర్వాత బాలుడిని తన ప్రియుడికి అప్పగించింది. రూ. 50 లక్షలు ఇస్తేనే భండారిని వదులుతామని అతడి తండ్రి రితేశ్ కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు. ఫోన్ కాల్ రికార్డ్స్, రితేశ్ కుటుంబ సభ్యులను పశ్నించి కేసును ఛేదించినట్టు జోధ్ పూర్ డీసీసీ(వెస్ట్) సమీర్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ సీరియల్ ప్రేరణతో కిడ్నాప్ చేశామని నిందితులు చెప్పినట్టు వెల్లడించారు. వీరికి సహకరించిన భరత్ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.