Rasana Village
-
‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’
కశ్మీర్ : సబీనా, యాకూబ్ దంపతులు ఓ నెల రోజుల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించారు. కార్గిల్ శిఖరాల అంచుల నుంచి సాంబ మైదానాలకు చేరుకున్నారు. చివరకు తమ స్వగ్రామం రసనాకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఆగిపోయారు. తమ స్వగ్రామానికి వెళ్లాలని వారు ఎదురుచూస్తున్నారు. రసన.. ఆ పేరు తలచుకుంటేనే వారికి భయంతోపాటు బాధ కూడా తన్నుకోస్తుంది. అక్కడే తమ ఏనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా ఆడిపాడింది. పశువుల వెంట, గొర్రెపిల్లల వెనక పరుగు తీసింది. కానీ ఆకస్మాత్తుగా ఆ అందమైన దృశ్యాల స్థానే ఓ భయంకరమైన సంఘటన వచ్చి చేరింది. ఆసిఫా ఎనిమిదేళ్ల చిన్నారి.. ప్రపంచం అంటే ఏంటో తెలియని పసిపాప.. లోకమంతా తనలానే ఉంటుందని నమ్మిన అమాయకురాలి మీద కొన్ని మృగాళ్లు దాడి చేశాయి. తనకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ చిట్టితల్లి మూడు రోజుల పాటు దేవాలయంలోనే దయ్యాలకు ఆహారమయ్యింది. జరుగుతున్న ఘోరాన్ని చూడలేక ఆ దేవత నిజంగానే శిలయ్యింది. మూడురోజుల పాటు దైవసాక్షిగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. ఈ సంఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా కావాల్సినంతా టీఆర్పీ సాధించింది. ప్రతిపక్షాలు అధికారి పార్టీ మీద తనివి తీరా దుమ్మెత్తి పోశాయి. మేం సిగ్గుపడుతున్నాం అంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రెండు కన్నీటి బొట్లు రాల్చారు. చిత్రమేంటంటే అన్యాయం జరిగిన కుటుంబాన్నే సమాజం శిక్ష విధించింది. పోయిన ప్రాణం.. పడిన వేదన గ్రామస్తులకు కనిపించలేదు. మా వాళ్లనే జైలుకు పంపిస్తారా మీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపులు. ఆఖరికి తమ స్థలంలోనే బిడ్డను ఖననం చేసేందుకు కూడా వారు ఒప్పుకోలేదు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించి అక్కడ ఖననం చేశారు. చేతుల్లో ఉన్న భారాన్ని భూమాతకు అప్పగించారు. తిరిగి సొంత గ్రామానికి వెళ్లలేక ఎక్కడో సాంబ మైదాన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ దారుణం జరిగి ఇప్పటికి 10నెలలు గడిచాయి. క్రమంగా ఆ సంఘటన ప్రజల మనసుల నుంచి చెరిగిపోయింది. ఆదుకుంటామన్న ప్రభుత్వాలు ఆ మాటే మర్చిపోయాయి. తల్లి ఆ శోకం నుంచి ఇంకా కోలుకోలేదు.. తండ్రి కూతుర్ని కలవరిస్తున్నాడు. సమాజం ఇప్పడు కూడా వారిని వదలడం లేదు. ఇక్కడ నుంచి వెళ్లాలంటూ బెదిరింపులు. ఒంటరిగా సమీప నదికి వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాలన్నా వెళ్లలేని పరిస్థితులు. వీటన్నింటి కంటే ఎక్కువగా ఆ తల్లిదండ్రులను భయపెడుతున్నది తాము చనిపోయేలోపైనా తమ కూతురికి న్యాయం జరుగుతుందా.. చివర వరకూ పోరాడే శక్తి తమకు ఉందా అనే విషయం గురించే. ఎందుకంటే ప్రస్తుతం హాసీన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశం.. ఈ కేసు విచారణ జరుగుతున్న పఠాన్‌కోట్ కోర్టుకు దాదాపు 530 కిలోమీటర్ల దూరాన ఉంది. కోర్టు ట్రయల్స్‌కి హాజరు కావడానికి డబ్బు లేదు. సంపాదించే పరిస్థితులు కూడా లేవు. చేసేదేం లేక ఉన్న గొర్రెలను.. పశువులను అమ్ముకుంటున్నారు. తమ ఆస్తి అంతా అమ్మకున్నా పర్వాలేదు. కానీ తమ కూతురికి న్యాయం జరిగితే చాలు అంటున్నారు. అదేంటి ప్రభుత్వం సాయం అందలేదా అంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంటున్నారు బాధితురాలి తల్లిదండ్రులు. ఎవరి సాయం కోసమో ఎదురు చూస్తూ కూర్చోలేము. నా చిట్టితల్లి కోసం మేమే పోరాడతాం. ఆ మృగాళ్లకు శిక్ష పడితేనే నా కుమార్తె ఆత్మ శాంతిస్తుందంటున్నారు కథువా బాధితురాలి తల్లిదండ్రులు యాకూబ్, సబీనా. కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో ఆసిఫా అనే బాలికను ఆరుగురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా డ్రగ్స్ ఇచ్చి కొన్ని రోజుల పాటు లైగింక దాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు. ఆసిఫా ఒక గిరిజన ముస్లిం తెగకు చెందిన బాలిక. హిందువులు అధికంగా ఉండే కథువా ప్రాంతంలో కొంతమంది దుండగులు బాలికను కిడ్నాప్ చేసి ‘దేవిస్థాన్’ అనే దేవాలయంలో ఉంచి అత్యాచారం చేసి, అంతమొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసిఫా తల్లిదండ్రుల దుర్భర జీవితం గడుపుతూ కూడా కూతురికి న్యాయం జరిగేలా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. -
కథువా కేసు: సందిగ్ధంలో వారి పెళ్లి
జమ్మూ: ‘అతడి కళ్లలోకి సూటిగా చూస్తూ.. నువ్వు నేరం చేశావా అని అడుగుతాను. నాపై అతడికి నమ్మకముందని నాకు తెలుసు. తను నేరం చేయలేదని చెబితే అతడు తిరిగొచ్చే వరకు వేచి చూస్తాను. ఒకవేళ అతడు నేరం చేశాడని చెబితే మరో సంబంధం చూడమని మా అమ్మానాన్నతో చెబుతాన’నని 24 ఏళ్ల రేణు శర్మ అనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థిని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు దీపక్ ఖాజురియాకు కాబోయే భార్య ఆమె. గతేడాది డిసెంబర్ 7న వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈనెల 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. రసన గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపిన కేసులో దీపక్ జైలు పాలవడంతో వీరి పెళ్లి సందిగ్ధంలో పడింది. క్రైం బ్రాంచ్ పోలీసుల చార్జిషీటు ప్రకారం ఈ కేసులో దీపక్ ప్రధాన నిందితుడు. అయితే తనకు కాబోయే భర్త ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోతున్నారని రేణుక పేర్కొన్నారు. బాలికను రేప్ చేసి చంపేంత క్రూరుడు కాదని ఆమె చెబుతున్నారు. అతడితో ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు. ‘ నిశ్చితార్థం రోజున అతడిని ఒకసారి మాత్రమే అతి సమీపం నుంచి చూశాను. తర్వాత మేము ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. పోలీసులు చెబుతున్నట్టుగా అతడికి ప్రవర్తన నాకెపుడూ కనబడలేదు. వీడియో చాట్ చేద్దామని అతడు కోరినప్పుడు నేను తిరస్కరిస్తే మళ్లీ బలవంతం చేయలేద’ని రేణుక వెల్లడించారు. దీపక్‌ను తప్పుబట్టడం కానీ సమర్థించడం కానీ చేయబోనని అన్నారు. ‘వాస్తవమేంటో నాకు తెలియదు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడితేనే నిజాలు వెల్లడవుతాయ’ని ఆమె అభిప్రాయపడ్డారు. దీపక్ నాలుగేళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. తర్వాత అతడికి హీరానగర్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ)గా నియమించారు. రసన గ్రామంలో బాలిక దారుణ హత్యాచారానికి గురైనప్పుడు అతడు పరిసర ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు. మెలితిరిన మీసాలు, కత్తిరించిన గడ్డంతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌పై రసన గ్రామం దాటుతుండగా అతడిని చూసినట్టు సాక్షులు చెబుతున్నారు. ఈ కిరాతక ఘటన జరగడానికి ముందు బకర్వాల్ ముస్లిం మహిళలతో దీపక్ రెండుసార్లు గొడవ పడినట్టు అతడి తల్లి దర్శనాదేవి, సోదరి శివాని వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. హత్యాచారం కేసులో అరెస్టైన నలుగురు పోలీసుల్లో దీపక్ ఒకరు. మిగిలిన ముగ్గురు నిందితులు లంచం కోసం కేసును తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దీపక్ ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో పాసయ్యేందుకు సాయం చేస్తానని నమ్మబలికి 15 ఏళ్ల బాలుడి సహాయంతో బాలికను దీపక్ కిడ్నాప్ చేశాడని క్రైం బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
కథువా కిరాతకం; కఠిన వాస్తవం
జమ్మూ: ‘ఎనిమిదేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఎంత నేల కావాలి? అత్యాచారానికి గురై కిరాతంగా హత్య చేయబడిన పాప మృతదేహం మా చేతుల్లో ఉంది. ఇలాంటి సమయంలో గ్రామస్తులు మా మీద కనికరం చూపాల్సింద’ని కథువా హత్యాచార బాధితురాలి తాత వేడుకున్నారు. జమ్మూకశ్మీర్ కథువా జిల్లా, రసన గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె పెంపుడు తండ్రి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అంత్యక్రియల కోసం ఎంచుకున్న స్థలం గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందనది కాదంటూ అడ్డుపడ్డారు. ‘అప్పటికే సమయం సాయంత్రం 6 గంటలైంది. అంత్యక్రియల కోసం సగం గొయ్యి తీయడం పూర్తైంది. అదే సమయంలో గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఖననం చేయడానికి కుదరదని అడ్డుచెప్పారు. ఆ స్థలం మాది కాదంటూ పత్రాలు చూపించార’ని మృతురాలి తాత ఆరోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ భూమి వాళ్లదే.. ‘అంత్యక్రియలు జరిపాలకున్న స్థలం మృతురాలి పెంపుడు తండ్రిదే. దశాబ్దం క్రితమే ఓ హిందూ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో గ్రామస్తులు అవకాశంగా తీసుకుని ఈ భూమి మా దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటున్నార’ని అంత్యక్రియలం కోసం భూమి ఇచ్చిన వ్యక్తి తెలిపారు. మేము అంగీకరించం ఈ భూమి మృతురాలి కుటుంబానిది కాదని హిందువులు వాదిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని అక్రమంగా ఇక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘బకర్వాల్ ముస్లింలు ఒక్కొక్కటిగా మా భూములను ఆక్రమించేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము అంగీకరించబోము. బాలిక అంత్యక్రియలకు ప్రత్యామ్నాయం చూపించామ’ని రసన గ్రామస్తుడు రోహిత్ ఖజూరియా తెలిపారు. వణికించే చలిలో.. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించారు. చీకటిలో పర్వత ప్రాంతం మీదకు మోసుకెళ్లి ఖననం చేశారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసిఫా పెంపుడు తల్లిదండ్రులు తెల్లవారుజామున 3 గంటలకు వరకు అక్కడే ఉన్నారని వారి బంధువు ఒకరు వెల్లడించారు. రెండుమూడు రోజులకొకసారి సమాధి వద్దకు వెళ్లి గంటల తరబడి మృతురాలి పెంపుడు తల్లి శోకిస్తోందని, ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకురావాల్సి వస్తోందని తెలిపారు. తల్లికి తీరని శోకం రసన గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో గోధుమ పంట ఉన్న పొలంలో 5 అడుగుల గొతిలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. సమాధిని ఇంకా సిమెంట్ చేయంచలేదు. సమాధికి రెండు చివరల పెద్ద రాళ్లను ఉంచారు. ‘మా మతాచారం ప్రకారం సమాధిని వెంటనే సిమెంట్ చేయించం. తమ పశువులను తోలుకుని పర్వత ప్రాంతాల్లో సంచారానికి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులు తిరిగొచ్చిన తర్వాత సమాధిని సిమెంట్ చేస్తామ’ని వారి బంధువొకరు వెల్లడించారు. కాగా, కఠువా బాధితురాలికి న్యాయం చేయాలని, నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. -
కథువా రేప్ కేసు లాయర్‌కు బెదిరింపులు
-
కథువా రేప్ కేసు లాయర్‌కు బెదిరింపులు
జమ్మూ : ‘న్యాయ వ్యవస్థపై, లాయర్లపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఉండాలంటే వారి చేతుల్లో కూడా న్యాయదండాలు ఉండాలేమో!’ అని కశ్మీర్‌లోని కథువా జిల్లాలో దారుణంగా సామూహిక అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక తరఫున కేసును వాదిస్తున్న దీపికా సింగ్ రజావత్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. బాలిక కేసును వాదించకుండా, ఆ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా ఆమెకు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆమె అసహనంతో ఈ వ్యాఖ్య చేశారు. ఆమెకు బెదిరింపులు ఎదురైనవి ఎవరి నుంచో కావు. సాక్షాత్తు జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ సతాథియా నుంచి. ఈ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా మొదటి నుంచి అడ్డుకుంటున్న భూపిందర్ సింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన తనను తీవ్రంగా బెదిరించినట్లు, అవమానకరంగా మాట్లాడినట్లు ఆమె ఆ తర్వాత తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. తాను ఎవరి పక్షం కానని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు... అందరి కేసులను వాదిస్తానని చెప్పారు. పిల్లలకు జరిగే అన్యాయం ఎంత దారుణంగా ఉంటుందో తాను ఊహించగలనని, తనకు ఓ ఐదేళ్ల పాప ఉందని, భూపిందర్ సింగ్‌కు కూడా ఓ పాప ఉండే ఉంటుందని ఆమె అన్నారు. బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బుధవారం నాడు జమ్మూలో బంద్ నిర్వహించిన హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం నాడు కూడా తన ఆందోళనను కొనసాగించింది. బాలిక రేప్ కేసును స్థానిక క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సవ్యంగానే దర్యాప్తు జరుపుతున్నారని, కేసును మసిపూసి మారేడు కాయ చేయడం కోసమే నేడు కేసును సీబీఐకి అప్పగించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నదని రజావత్ ఆరోపించారు. తనను బెదిరించడంపై తాను జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. -
కథువా రేప్ కేసులో ఎవరి పాపం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, వారం రోజుల పాటు రేప్ చేసి, చివరకు హత్య చేసిన దారుణ సంఘటనల క్రమంలో ఒళ్లు విరుచుకుంటూ మూడు నెలల తర్వాత జాతీయ మీడియా మేల్కొంది. దాంతో తప్పనిసరై రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. పరస్పరం బురద చల్లుకోవడం మొదలైంది. ఈ దారుణ రేప్ సంఘటనకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద గురువారం రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తన టార్గెట్ అయిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలకే కాకుండా పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మైనర్ బాలికలను రేప్ చేసిన సంఘటనల్లో నేరస్థులకు ఉరిశిక్షలు విధించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ముఫ్తీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీలో ఇద్దరు మంత్రులు రేప్ నిందితులకు మద్దతుగా నిర్వహించిన పలు ర్యాలీలో పాల్గొన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి ముఫ్తీ ధైర్యం చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దారుణ రేప్ ఘటనపై ఇప్పటి వరకు పెదవి విప్పకుండా మౌనం వహిస్తూ వస్తోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కశ్మీర్ రాష్ట్ర పాలకులైన బీజేపీ, ముఫ్తీలతోపాటు కేంద్రంలోని బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణంలో పాపం ఉంది. జనవరి 11వ కథువా జిల్లా, రసన గ్రామంలో గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాల్లో అదృశ్యమైంది. వెంటనే ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. జనవరి 17వ తేదీన సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ పాప మృతదేహం దొరికింది. దాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించగా, ఆ పాపకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేసినట్లు తేలింది. దీనిపై దర్యాప్తు జరిపిన స్థానిక పోలీసులు దీపు భయ్యా అనే 15 ఏళ్ల బాలుడిని ప్రధాన నిందితుడిగా కేసు దాఖలు చేశారు. ఆ బాలుడు అమాయకుడని స్థానికులు చెప్పడం, మొదట పోలీసుల చిత్రహింసలకు నేరాన్ని తనపై వేసుకున్న ఆ బాలుడు ఆ తర్వాత తాను కాదని చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసును క్రైమ్‌బ్రాంచ్‌కి అప్పగించాల్సిందిగా స్థానిక బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు గొడవ చేశారు. సీఎం ముఫ్తీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కేసును అప్పగించారు. జనవరి 23వ తేదీన ఈ కేసును టేకప్ చేసిన ఆ పోలీసులు మూడు రోజుల్లోనే కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళానికి చెందిన దీపక్ కజారియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేశారు. వారు ఎక్కడి వారో, ఏ బెటాలియన్‌కు చెందిన వారో, వారి హోదా ఏమిటో ఇంతవరకు దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు. వీరిద్దరు కూడా అగ్రవర్ణానికి చెందిన హిందువులవడంతో వీరికి మద్దతుగా ఫిబ్రవరి 14, 17 తేదేల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రదర్శనలు జరిపారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కొత్తగా ‘హిందూ ఏక్తా మార్చ్’ను ఏర్పాటు చేసిన కశ్మీర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది విజయ్ వర్మ ఫిబ్రవరి 17న నిందితులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో కథువా బీజేపీ అధ్యక్షుడు విజయ్ శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు హాజరయ్యారు. నాలుగువేల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం ఆశ్చర్యం. ఇదే ర్యాలీలో ‘భారత మాతాకీ జై, పాకిస్తాన్ మురదాబాద్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జాతీయ జెండాలను ప్రదర్శించడం మరింత ఆశ్చర్యం. ఫిబ్రవరి 17వ తేదీనే కథువా జిల్లా హీరానగర్‌లో కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన హిందూ పెద్దలు సమావేశమై గుజ్జార్ బకర్వాల్ ముస్లిం కుటుంబాలను వెలివేయాలని తీర్మానించారు. ఆ కుటుంబాల్లో ఎవరిని వ్యవసాయ కూలీలుగా కూడా తీసుకోరాదని కట్టుబాటు విధించారు. ఆ సమావేశానికి రాష్ట్ర బీజేపీ మంత్రి రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ వర్మతోపాటు కథువా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ గుప్తా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా రేప్ కేసును నీరుకార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినా రాహుల్ గాంధీ సదరు నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కథువా రేప్ కేసు తనకు తెలియనట్లుగానే నటిస్తూ వచ్చారు. మీడియా వార్తలతో ఇప్పుడు వీధిలోకి వచ్చారు. జమ్మూలోని హిందూ మెజారిటీ, కశ్మీర్‌లోని ముస్లిం మెజారిటీ నాటకాలకు తెరపడనంత కాలం ఈ రాజకీయ పార్టీల తీరు ఇంతే! (గమనిక: సాక్షి వెబ్సైట్ కథువా రేప్ ఘటనపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూ వస్తోంది. ‘ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరో’ చదవండి)