కఠువా హత్యాచార బాధితురాలి సమాధి (హిందూస్తాన్ టైమ్స్ ఫొటో)
జమ్మూ: ‘ఎనిమిదేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఎంత నేల కావాలి? అత్యాచారానికి గురై కిరాతంగా హత్య చేయబడిన పాప మృతదేహం మా చేతుల్లో ఉంది. ఇలాంటి సమయంలో గ్రామస్తులు మా మీద కనికరం చూపాల్సింద’ని కథువా హత్యాచార బాధితురాలి తాత వేడుకున్నారు. జమ్మూకశ్మీర్ కథువా జిల్లా, రసన గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె పెంపుడు తండ్రి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అంత్యక్రియల కోసం ఎంచుకున్న స్థలం గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందనది కాదంటూ అడ్డుపడ్డారు. ‘అప్పటికే సమయం సాయంత్రం 6 గంటలైంది. అంత్యక్రియల కోసం సగం గొయ్యి తీయడం పూర్తైంది. అదే సమయంలో గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఖననం చేయడానికి కుదరదని అడ్డుచెప్పారు. ఆ స్థలం మాది కాదంటూ పత్రాలు చూపించార’ని మృతురాలి తాత ఆరోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ భూమి వాళ్లదే..
‘అంత్యక్రియలు జరిపాలకున్న స్థలం మృతురాలి పెంపుడు తండ్రిదే. దశాబ్దం క్రితమే ఓ హిందూ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో గ్రామస్తులు అవకాశంగా తీసుకుని ఈ భూమి మా దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటున్నార’ని అంత్యక్రియలం కోసం భూమి ఇచ్చిన వ్యక్తి తెలిపారు.
మేము అంగీకరించం
ఈ భూమి మృతురాలి కుటుంబానిది కాదని హిందువులు వాదిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని అక్రమంగా ఇక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘బకర్వాల్ ముస్లింలు ఒక్కొక్కటిగా మా భూములను ఆక్రమించేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము అంగీకరించబోము. బాలిక అంత్యక్రియలకు ప్రత్యామ్నాయం చూపించామ’ని రసన గ్రామస్తుడు రోహిత్ ఖజూరియా తెలిపారు.
వణికించే చలిలో..
గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించారు. చీకటిలో పర్వత ప్రాంతం మీదకు మోసుకెళ్లి ఖననం చేశారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసిఫా పెంపుడు తల్లిదండ్రులు తెల్లవారుజామున 3 గంటలకు వరకు అక్కడే ఉన్నారని వారి బంధువు ఒకరు వెల్లడించారు. రెండుమూడు రోజులకొకసారి సమాధి వద్దకు వెళ్లి గంటల తరబడి మృతురాలి పెంపుడు తల్లి శోకిస్తోందని, ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకురావాల్సి వస్తోందని తెలిపారు.
తల్లికి తీరని శోకం
రసన గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో గోధుమ పంట ఉన్న పొలంలో 5 అడుగుల గొతిలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. సమాధిని ఇంకా సిమెంట్ చేయంచలేదు. సమాధికి రెండు చివరల పెద్ద రాళ్లను ఉంచారు. ‘మా మతాచారం ప్రకారం సమాధిని వెంటనే సిమెంట్ చేయించం. తమ పశువులను తోలుకుని పర్వత ప్రాంతాల్లో సంచారానికి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులు తిరిగొచ్చిన తర్వాత సమాధిని సిమెంట్ చేస్తామ’ని వారి బంధువొకరు వెల్లడించారు. కాగా, కఠువా బాధితురాలికి న్యాయం చేయాలని, నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment