సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, వారం రోజుల పాటు రేప్ చేసి, చివరకు హత్య చేసిన దారుణ సంఘటనల క్రమంలో ఒళ్లు విరుచుకుంటూ మూడు నెలల తర్వాత జాతీయ మీడియా మేల్కొంది. దాంతో తప్పనిసరై రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. పరస్పరం బురద చల్లుకోవడం మొదలైంది. ఈ దారుణ రేప్ సంఘటనకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద గురువారం రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తన టార్గెట్ అయిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలకే కాకుండా పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
మైనర్ బాలికలను రేప్ చేసిన సంఘటనల్లో నేరస్థులకు ఉరిశిక్షలు విధించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ముఫ్తీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీలో ఇద్దరు మంత్రులు రేప్ నిందితులకు మద్దతుగా నిర్వహించిన పలు ర్యాలీలో పాల్గొన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి ముఫ్తీ ధైర్యం చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దారుణ రేప్ ఘటనపై ఇప్పటి వరకు పెదవి విప్పకుండా మౌనం వహిస్తూ వస్తోంది.
‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కశ్మీర్ రాష్ట్ర పాలకులైన బీజేపీ, ముఫ్తీలతోపాటు కేంద్రంలోని బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణంలో పాపం ఉంది. జనవరి 11వ కథువా జిల్లా, రసన గ్రామంలో గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాల్లో అదృశ్యమైంది. వెంటనే ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. జనవరి 17వ తేదీన సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ పాప మృతదేహం దొరికింది. దాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించగా, ఆ పాపకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేసినట్లు తేలింది. దీనిపై దర్యాప్తు జరిపిన స్థానిక పోలీసులు దీపు భయ్యా అనే 15 ఏళ్ల బాలుడిని ప్రధాన నిందితుడిగా కేసు దాఖలు చేశారు. ఆ బాలుడు అమాయకుడని స్థానికులు చెప్పడం, మొదట పోలీసుల చిత్రహింసలకు నేరాన్ని తనపై వేసుకున్న ఆ బాలుడు ఆ తర్వాత తాను కాదని చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసును క్రైమ్‌బ్రాంచ్‌కి అప్పగించాల్సిందిగా స్థానిక బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు గొడవ చేశారు.
సీఎం ముఫ్తీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కేసును అప్పగించారు. జనవరి 23వ తేదీన ఈ కేసును టేకప్ చేసిన ఆ పోలీసులు మూడు రోజుల్లోనే కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళానికి చెందిన దీపక్ కజారియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేశారు. వారు ఎక్కడి వారో, ఏ బెటాలియన్‌కు చెందిన వారో, వారి హోదా ఏమిటో ఇంతవరకు దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు. వీరిద్దరు కూడా అగ్రవర్ణానికి చెందిన హిందువులవడంతో వీరికి మద్దతుగా ఫిబ్రవరి 14, 17 తేదేల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రదర్శనలు జరిపారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కొత్తగా ‘హిందూ ఏక్తా మార్చ్’ను ఏర్పాటు చేసిన కశ్మీర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది విజయ్ వర్మ ఫిబ్రవరి 17న నిందితులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో కథువా బీజేపీ అధ్యక్షుడు విజయ్ శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు హాజరయ్యారు. నాలుగువేల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం ఆశ్చర్యం. ఇదే ర్యాలీలో ‘భారత మాతాకీ జై, పాకిస్తాన్ మురదాబాద్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జాతీయ జెండాలను ప్రదర్శించడం మరింత ఆశ్చర్యం.
ఫిబ్రవరి 17వ తేదీనే కథువా జిల్లా హీరానగర్‌లో కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన హిందూ పెద్దలు సమావేశమై గుజ్జార్ బకర్వాల్ ముస్లిం కుటుంబాలను వెలివేయాలని తీర్మానించారు. ఆ కుటుంబాల్లో ఎవరిని వ్యవసాయ కూలీలుగా కూడా తీసుకోరాదని కట్టుబాటు విధించారు. ఆ సమావేశానికి రాష్ట్ర బీజేపీ మంత్రి రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ వర్మతోపాటు కథువా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ గుప్తా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా రేప్ కేసును నీరుకార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినా రాహుల్ గాంధీ సదరు నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కథువా రేప్ కేసు తనకు తెలియనట్లుగానే నటిస్తూ వచ్చారు. మీడియా వార్తలతో ఇప్పుడు వీధిలోకి వచ్చారు. జమ్మూలోని హిందూ మెజారిటీ, కశ్మీర్‌లోని ముస్లిం మెజారిటీ నాటకాలకు తెరపడనంత కాలం ఈ రాజకీయ పార్టీల తీరు ఇంతే!
(గమనిక: సాక్షి వెబ్‌సైట్ కథువా రేప్ ఘటనపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూ వస్తోంది. ‘ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరో’ చదవండి)
Comments
Please login to add a commentAdd a comment