బంద్.. సంపూర్ణం
సాక్షిప్రతినిధి, నల్లగొండ, అధికార పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి పిలుపుతోనే సత్తా చాటింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. పలుచోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బంద్‌లో పాల్గొనడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జాతీయ రహదారిపై చౌటుప్పల్, టేకుమట్ల, నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధించడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి ఒక్క వాహనమూ సరిహద్దు దాటలేదు. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రా రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ ప్రధాని మోడి, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. బంద్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా పాల్గొనడంతో ఒక్క బస్సూ రోడ్డెక్కలేదు.
బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్యలు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌లు తమ తమ నియోజకవర్గాల్లో బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదిర పార్టీలు సైతం బంద్‌కు సహరించి ర్యాలీల్లో పాల్గొన్నాయి.
ఆర్టీసీ నష్టం రూ. 70 లక్షలు
నల్లగొండ రీజియన్‌లో 728 బస్సులు, ఆయా డిపోల్లోనే నిలిచిపోయాయి. దీంతో దాదాపు *70లక్షల రోజువారీ ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. బంద్‌కు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడ మద్దతు తెలపడంతో డిపోల నుంచి బస్సులు బయటికి కదల్లేదు.
నల్లగొండ : నల్లగొండలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట మూడు గంటలకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, ప్రైవేటు సంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు, వర్తక, వాణిజ్య సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంస్థలు మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బస్టాండు ఎదుట ధర్నాలు నిర్వహించారు. తెలంగాణా జాగృతి సంస్థ, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేములపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దామరచర్లలో ఇండియా సిమెంట్ గేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు.
సూర్యాపేట : బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సు డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం బైక్‌లపై పట్టణంలో మధ్యాహ్నం వరకు తిరుగుతూ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. బంద్‌కు జేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించాయి. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు.
భువనగిరి : బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండల్లో బంద్ స్వచ్ఛందంగా జరిగింది. భువనగిరి పట్టణం, వలిగొండలో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాలొన్నారు. పోచంపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు.
ఆలేరు : యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆలేరులో టీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. న్యూడెమొక్రసీ, టీఆర్ఎస్లు ర్యాలీలు చేపట్టాయి. రాజపేటలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బొమ్మలరామారం మండలం రంగాపురం చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తుర్కపల్లిలో రాస్తారోకో చేశారు.
దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. దేవరకొండలో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు బస్టాండు ఎదురుగా రాస్తారోకో చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బంద్‌కు మద్దతుగా సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నకిరేకల్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు నడవలేదు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. టీఆర్ఎస్ మండల కమిటీ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ప్రదర్శన జరిపారు. సీపీఎం ఎంఎల్ నూడెమెక్రసీ, బహుజన కమ్యూనిస్టు పార్టీ (బీసీపీ) ఆధ్వర్యంలో ర్యాలీలు జరిపారు. చిట్యాలలో టీఆర్ఎస్వీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామన్నపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నార్కట్‌పల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలను మూసివేయించారు.
హాలియా : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దుకాణాలు మూసివేయించారు. హాలియా, నిడమనూరు. త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, నాగార్జునసాగర్‌లలో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ, ధర్నా, రాస్తారోకో చేశారు.
కోదాడ : కోదాడ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీతో పాటు టీజేఏసీ, న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐలు వేర్వేరుగా బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. తెలంగాణ-ఆంధ్ర ప్రాంత సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆంధ్ర ప్రాంత వాహనాలను అడ్డుకున్నారు.
తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గంలో వ్యాపార , వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు మూత పడ్డాయి. తిరుమలగిరిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోత్కూర్, శాలిగౌరారం, నూతన్‌కల్, తుంగతుర్తి, అర్వపల్లిలలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు బంద్ పాటించాయి. వివిధ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మఠంపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు, గరిడేపల్లిలో టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, జేఏసీ నాయకులు, నేరేడుచర్లలో టీఆర్ఎస్, సీపీఎం, జేఏసీల ఆధ్వర్యంలో మేళ్లచెరువులో టీఆర్ఎస్, సీపీఎంల ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి.
మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో హైవేపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బంద్ లో పాల్గొన్నారు. చండూరులో ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేశారు. సంస్థాన్‌నారాయణపురంలో వ్యాపారసంస్థలను బంద్ చేయించి, ధర్నా నిర్వహిం చారు. మర్రిగూడలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.