‘ఆసరా’ అందేదెప్పుడు..?
ధర్మపురి : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో పింఛన్ల పంపిణీ రచ్చగా మారింది. కార్యక్రమానికి రాజకీయ రంగు పులుమడంతో అది కాస్తా రాస్తారోకో చేసే వరకు వెళ్లింది. ధర్మపురిలో సోమవారం పింఛన్లు పంపిణీచేశారు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం చేపడతామని ఎంపీడీవో భాస్కరాచారి నిర్ణయించారు.
పంచాయతీ కార్యాలయంలోనే పంపిణీచేయూలని సర్పంచ్ సంగి సత్తెమ్మ కోరారు. అయితే పండుటాకులు, వికలాంగులు గంటల తరబడి నిరీక్షించి ఆకలి, దప్పికకు దూరమయ్యారు. టీఆర్‌ఎస్ నాయకులు జోక్యం చేసుకుని మండల కార్యాలయంలోనే పంపిణీచేయూలని పట్టుబట్టడంతో అధికారులు డైలమాలో పడిపోయూరు.
మండలపరిషత్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని సర్పంచ్‌తోపాటు మరికొందరు అడ్డుకున్నారు. సభావేదికపై ఉన్న కుర్చీలు, టేబుళ్లు తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కార్యదర్శి మేఘమాల తహశీల్దార్ కార్యాలయూనికి వెళ్లింది. బయటకు రావాలంటూ నినాదాలు చేస్తు కార్యాలయాలను ముట్టడించారు. జాతీయ రహదారిపై సర్పంచ్ సంగి సత్తమ్మ, కాంగ్రెస్ నాయకులు, పింఛన్‌దారులు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. చివరకు కార్యదర్శి మేఘమాల గ్రామపంచాయతీలోనే పంపిణీచేసేందుకు ఒప్పుకోగా వివాదం సద్దుమణిగింది.
అర్హులకు పింఛన్లు అందించాలని డిమాండ్‌చేస్తూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడే రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ అక్కడకు చేరుకుని మాట్లాడారు.. అర్హత ఉన్న వారందరికీ త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.
రామగుండం నగరపాలక సంస్థలో పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన సర్వేపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. పింఛన్లు పంపిణీ చేయడానికి డీఆర్డీఏ పీడీ ఎస్.విజయగోపాల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. ఆర్డీవో, తహశీల్దార్‌తో సమీక్ష జరిపారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయనకు వివరించారు. ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన పీడీ వారంలోగా అన్ని డివిజన్లలో రీ సర్వే పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చారు.
కోరుట్ల మండలంలోని జోగిన్‌పల్లికి చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంపీడీ వోకార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.పింఛన్లు అందించాలని మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామస్తులు మండల పరిషత్ ఎదుట ఆందోళ చేశారు.
రామగుండం మండలం జయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్‌కు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 400 మంది ఆందోళన చేపట్టారు. పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ కార్యద ర్శిని అడ్డుకున్నారు. పింఛన్లు అడిగితే ఈవోపీఆర్డీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వితంతులు ఆందోళనకు దిగారు. తమ భర్తలు చనిపోయి ఏళ్లు గడుస్తోందని, రేషన్ కార్డుల్లో పిల్లలు ఉన్నప్పటికీ పెండ్లిళ్లు అయ్యాయా..! అని ప్రశ్నించడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఎంపీడీవో కలుగజేసుకుని శాంతిపజేశారు.
ఆసరా పథకం కింద అర్హులైన వారికి పింఛన్లు అందలేదని బోరుునపల్లి మండలం తడగొండ, బూర్గుపల్లి గ్రామాల్లో ఆందోళన చేశారు. తడగొండలో సర్పంచ్ కట్ట కనుకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కట్ట భాగ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్‌ను గంటసేపు పంచాయితీ కార్యాలయంలో నిర్భందించారు. ఎస్సై రాజేశ్వరరావు, ఏఎస్సై చల్ల వెంకట్రాజం వెళ్లి సముదాయించారు. అర్హులకు పింఛన్లు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.