మాయా వ్యూహం.. మహా తంత్రం
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి రాజకీయ వర్గాలను సందిగ్ధంలో పడేశారు. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ అధినేత ఎన్నికలకు దూరంగా ఉండటం వ్యూహాత్మకమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన మంత్రి అభ్యర్థి రేసులో ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయరాదని మాయావతి నిర్ణయించుకోవడం వెనక రాష్ట్రంలో పార్టీని పూర్వ వైభవం తేవాలన్న పట్టుదల ఉందని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక మాయావతి పోటీ చేస్తే బీజేపీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఆమెను నియోజకవర్గానికే పరిమితం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉండదని, మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) తరఫున కూడా ప్రచారం చేయడానికి వీలుండదని అది కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
మాయావతి పోటీలో లేకపోవడం అంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడమేనని బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలను చేసినా ఆమె పోటీకి దూరంగా ఉండటం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
కింగ్ మేకర్ కావాలనే..
ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో వీలైనన్ని సీట్లను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని మాయావతి ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలి ఎన్నికల్లో ఆమె పార్టీ దారుణంగా దెబ్బతింది. 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కుపైగా సీట్లలో పోటీ చేస్తే 19 సీట్లు మాత్రమే వచ్చాయి.
తాడోపేడో తేల్చుకోవాల్సిన వేళ..
గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలవాలి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి. అందుకే దృష్టంతా పార్టీ అభ్యర్థుల గెలుపుపై పెట్టాల్సిన పరిస్థితి. 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీజేపీని దెబ్బకొట్టారు మాయావతి. ఆ విజయాన్ని పునరావృతం చేయాలన్న లక్ష్యంతో ఈసారీ ఎస్పీ, ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. సంకీర్ణ ధర్మంలో భాగంగా ఆమె మిత్రపక్షాల తరఫున కూడా ప్రచారం చేయాల్సి ఉంది. ఈ కారణాలన్నీ మాయావతిని ఎన్నికల బరికి దూరం చేశాయి.
అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి
2022లో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయావతి ఇప్పుడు పోరుకు దూరంగా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీఎస్పీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ సహకారంతో బెహన్జీ కచ్చితంగా గెలుస్తారు. దాంతో ఐదేళ్లు ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుంది. ఆమె పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి ఒక సీటు పోవడం తప్ప పెద్దగా నష్టమేమీ ఉండదు. మాయావతి ఇక్కడే ఉండటం వల్ల 2022 అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అఖిలేశ్‌తో బేరాలాడే అవకాశం ఉంటుంది’ అని ఆయన వివరించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేసి మాయావతి లోక్‌సభకు వెళ్లిపోతే, ఇక్కడే ఉన్న అఖిలేశ్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారు. ఆ అవకాశం దక్కించుకోవడానికే మాయావతి పోటీ చేయడం లేదు’ అని ఆయన అన్నారు.
మాకే లాభమంటున్న బీజేపీ
మాయావతి ఎన్నికలకు దూరంగా ఉండటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా తాను ప్రధానమంత్రి రేసులో లేనని మాయావతి చెప్పకనే చెప్పినట్టయింది. దీనివల్ల జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీగా నిలిచేది కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్‌పై మాయావతి గుర్రుగా ఉన్నారు. ప్రధానమంత్రి రేసులో కాంగ్రెస్ నేతలు ఉండటాన్ని మాయావతి సమ్మతించరు. కాబట్టి ఎటు చూసినా ఓటర్లకు ప్రధాని పదవికి మోదీ మినహా మరొకరు కానరారు. అందువల్ల మాయావతి నిర్ణయం తమకే లాభిస్తుందని బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదట ఓటమి.. ఆపై అన్నీ గెలుపే
మాయావతి 1985లో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో మీరా కుమార్ (కాంగ్రెస్)తో పోటీచేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత అదే స్థానంలో కాంగ్రెస్‌ను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆమె ఇంత వరకు లోక్‌సభకు నాలుగు సార్లు (1989, 1998, 1999, 2004) ఎన్నికయ్యారు. రాజ్యసభకు మూడు సార్లు (1994, 2004, 2012) ఎన్నికయ్యారు. అయితే, మూడుసార్లూ రాజ్యసభ సభ్యత్వ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేశారు.