Ration dealer strike
-
ఎవరి పట్టు వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, రేషన్ డీలర్లకు మధ్య వేడి రాజుకుంటోంది. ఓ వైపు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు డీడీలు కట్టని డీలర్లపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా డీల ర్లు రోడెక్కగా... డీలర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. జూలై 5లోగా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని డీలర్లు హెచ్చరిస్తుంటే.. సరుకుల పంపిణీకి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వేలమంది డీలర్లకు నోటీసులు రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల మంది లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యం, కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం మీ సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోవాలి. అయితే ఇంతవరకూ 17 వేల మంది డీలర్లలో 700 మంది వరకు మాత్రమే డీడీలు చెల్లించారు. దీంతో డీడీలు కట్టని డీలర్లపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్–2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ఉందని చెబుతూ డీలర్లకు నోటీసులు అందిస్తోంది. శుక్రవారం వేల సంఖ్యలో డీలర్లకు అధికారులు నోటీసులు అందించారు. సస్పెన్షన్‌పై ఆచితూచి.. నోటీసులు అందుకున్న డీలర్లను సస్పెండ్ చేసే ఉత్తర్వులపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సస్పెన్షన్‌పై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఢిల్లీ పర్యటన లో ఉండటంతో శనివారం న్యాయ సలహా తీసుకొని, అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులపై ముం దుకెళ్లే అవకాశాలున్నాయి. డీలర్లు వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో సరుకుల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గుర్తించిన మహిళా సంఘాలకు సరుకులను చేరవేసేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకునే పనుల్లో వేగం పెంచింది. కాంగ్రెస్ మద్దతు డీలర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించింది. ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డీలర్లకు మద్దతు ప్రకటించారు. వారి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. రేషన్ డీలర్ల పట్ల కేసీఆర్ క్రూరంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. డీలర్లపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ నిర్వాకం వల్లే డీలర్ వాజిర్ ఖాన్ ఆత్మహత్యయత్నం చేశారని అన్నారు. -
రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం
గజ్వేల్ రూరల్: ఓ రేషన్ డీలర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్ రేషన్ డీలర్ల ఐక్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపేందుకు డీలర్లు వచ్చారు. ఈ క్రమంలో గజ్వేల్‌కు చెందిన వజీర్‌ఖాన్ అనే డీలర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన మిగతా డీలర్లు వజీర్‌ఖాన్ ఒంటిపై మంటలనుఆర్పి సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వజీర్‌ఖాన్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనతో గజ్వేల్ పట్టణంలో రేషన్ డీలర్లు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేశారు. రేషన్ డీలర్లకు కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. 5 లోగా పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటి రాజు హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమస్యలపై సమ్మెకు వెనక్కి తగ్గేది లేదని, 5 లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటి రాజు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సమ్మె విరమించేది లేదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వాని కి సమ్మె నోటీసులిచ్చినా ప్రభుత్వం తమతో చర్చలు జరపలేదన్నారు. నోటీసులిచ్చిన తరువాత ఏడు రోజులు సమయం ఉంటుందని, కానీ ప్రభుత్వం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింది రావాల్సిన బకాయిల కోసం సమ్మె చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆ అధికారంలేదు.. రాష్ట్ర ప్రభుత్వానికి డీలర్లను సస్పెండ్ చేసే అధికారం లేదని, అణచివేత చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల డీలర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వేలిముద్రలు, బ్లాక్ మార్కెట్లతో ఎలాంటి సంబంధం లేదని, అలాంటిదేదైనా ఉంటే తాను గుండు కొట్టించుకునేందుకు కూడా సిద్ధమన్నారు. 35 ఏళ్ల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామని, డీలర్ల కడుపుకాలినా ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి పెట్టడం లేదని దుయ్యబట్టారు. డీలర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చగలరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పౌర సరఫరాలలో అవార్డు రావడానికి డీలర్లు కారణం కాదా..? అని ప్రశ్నించారు. 4వ తేదీన ఆమరణ నిరాహారదీక్ష ఎక్కడ చేస్తామనేది ప్రకటిస్తామన్నారు. డీలర్ల సంఘ గౌరవ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి తమకు సహకరించి మంత్రితో చర్చలు జరిపారని, ఆమె ఏం చెప్పినా తాము శిరసావహిస్తామన్నారు. డీలర్స్కు ఉద్యోగ భద్రత కల్పిస్తే కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తామన్నారు. డీలర్ల సమ్మె వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. తమకు ఆలిండియా రేషన్ డీలర్ల అసోషియేషన్ మద్దతు ఉందని, అవసరమైతే దేశవ్యాప్తంగా గల ఐదు లక్షల డీలర్లు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం గా ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో దాసరి మల్లేశం, కృష్ణమూర్తి, గడ్డం మల్లికార్జున్ గౌడ్, ప్రసాద్‌గౌడ్, ఆనంద్ పాల్గొన్నారు. -
నోటీసులు.. ఆపై సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. డీలర్లను తొలగించి వారి స్థానంలో జూలై 5 నుంచి మహి ళా సంఘాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో పేదలకు సకాలంలో సరుకులు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. సరుకుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు... గౌరవ వేతనం, కమీషన్ల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించడం తెలిసిందే. సరుకుల కోసం ఈ నెల 28లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు డెడ్‌లైన్ పెట్టగా 17,200 మంది డీలర్లకుగాను గురువారం సాయంత్రానికి కేవలం 609 మందే డీడీలు కట్టారు. దీంతో వారిపై చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులను వెలువరించే అవకాశాలున్నాయి. అయితే డీలర్ల సమ్మె నేపథ్యంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఎంసీహెచ్ఆర్డీలో గురువారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ నెల 5 నుంచి పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీని చేపట్టాలని, స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైతే గడువు పొడిగించాలని సూచించారు. మహిళా సంఘాలకు బాధ్యతల అప్పగింత... పేదలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మహిళా సంఘాలు, అందుబాటులో ఉన్న చోట ఎన్ఆర్ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపట్టాలని అధికారులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ రేషన్ షాపులవారీగా మహిళా సంఘాలను గుర్తించడంలో పారదర్శక విధానాన్ని పాటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు వాటిని పర్యవేక్షించాలని సూచించారు. రికార్డుల నిర్వాహణ కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు డీలర్షిప్ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జులై 1న మీ–సేవ కేంద్రాల్లో అధికారులు డీడీలు కట్టించాలన్నారు. సరుకుల పంపిణీ కంటే ముందు ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, పంపిణీ కోసం లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ, ఐకేపీ, కమ్యూనిటీ హాళ్లు, యూత్ బిల్డింగ్‌లను గుర్తించాలని సబర్వాల్ పేర్కొన్నారు. వేయింగ్ మెషిన్లను సమకూర్చుకునేందుకు తూనికలు, కొలతలశాఖ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి సరుకులను తరలించేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకోవాలని, కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని అకున్ సబర్వాల్ అధికారులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు, ఫిర్యాదులతోపాటు సమన్వయం కోసం 24 గంటలు పనిచేసేలా రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444ను అందు బాటులో ఉంచామని అకున్ సబర్వాల్ తెలిపారు. మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేషన్ పంపిణీలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్వోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని చెప్పారు. సమ్మె విరమించే ప్రసక్తే లేదు: రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రేషన్ డీలర్ల సమ్మె విరమించే ప్రసక్తే లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. భయపెట్టేందుకు అక్రమంగా 14 వేల మంది డీలర్లను సస్పెండ్ చేయడం విచారకరమని వాపోయారు. డీలర్లకు నోటీసులు మాత్రం అందలేదని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలర్లకు రావాల్సిన సుమారు రూ.600 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా డీలర్లకు వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, భయపెట్టడం తగదని హితవు పలికారు. బంగారు తెలంగాణలో రేషన్ డీలర్ల బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘రేషన్ డీలర్లు చేసేది సామజిక సేవే’
సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ డీలర్లు సామజిక సేవ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. వారు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చల ద్వారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామ’ని తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. తూనికలు, కొలతల్లో జరిగే మోసాలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని ఒక స్కానింగ్ సెంటర్ తప్పుడు పరీక్షల వల్ల ఒక శిశువు, ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురయిందని ఆయన తెలిపారు. పాప తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిచడంతో.. సదరు స్కానింగ్ సెంటర్‌ను దోషిగా తేలుస్తూ ఫోరం 2 లక్షల జరిమానా విధించిందని అన్నారు. ఆ మొత్తాన్ని బాధిత కుంటుంబానికి చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఇటీవల నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 12 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. వస్తు, సేవల్లో మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగదారుల సేవా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యాపారీ అతను అందించే వస్తు, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై వినియోగదారులు 180042500333 టోల్ ఫ్రీ నెంబర్, ఫేస్బుక్, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దోషిగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఉద్ఘాటించారు. -
రేషన్ డీలర్ల సమ్మె తాత్కాలికంగా విరమణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్‌తో డీలర్ల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు రేషన్‌డీలర్ల సంఘం ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా రేషన్ దుకాణాలు మూసివేసి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీలర్ల ప్రతినిధి బృందాన్ని మంత్రి చర్చలకు పిలిచారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్‌కు నగదు బదిలీ యోచన విరమించాలని, డీలర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని, గౌరవ వేతనం గ్రేటర్లో రూ.60 వేలు, కార్పొరేషన్లో రూ.50 వేలు, మున్సిపాలిటీలో రూ.30 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరుకులపై కమీషన్ పెంచాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, బకాయిలు విడుదల చేయాలని మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ డీలర్ల సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని, బకాయిలు వెంటనే విడుదల చేస్తామని హామీనిచ్చారు. దీనిపై ఈ నెల 10న సీఎం కేసీఆర్‌తో స్పష్టమైన ప్రకటన చేయిస్తానని చెప్పారు. లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తా మని డీలర్లు పట్టుబట్టగా, డీలర్ల సమస్యలను పరిష్కరిస్తానని అసెంబ్లీలోనే ప్రకటించానని, లిఖితపూర్వకంగా అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. దీంతో సమ్మె విరమణకు డీలర్లు అంగీకరించారు. ప్రతినిధుల బృందంలో తెలంగాణ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌రెడ్డి, కార్యదర్శి ఆనంద్, పలు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. సీఎం ప్రకటన లేకుంటే మళ్లీ ఆందోళన తమ సమస్యలపై ఈ నెల 10న సీఏం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయకపోతే తిరిగి 15వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని రేషన్ డీలర్ల అసోసి యేషన్ అధ్యక్షుడు నాయి కోటి రాజు స్పష్టం చేశారు. మూడున్నరేళ్ల నుండి రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తా మని హామీ ఇస్తూ నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వానికి ఇది చివరి అవకాశమని అన్నారు. గోవాలో క్వింటాల్æ బియ్యా నికి రూ. 200, మహారాష్ట్ర రూ.150, గుజరాత్ రూ.102, జార్ఖండ్ రూ.100 చెల్లిస్తుండగా తెలంగాణలో రూ.20 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏం చేద్దాం!
► ఆగస్టు కోటా పంపిణీకి ప్రత్యామ్నాయాలపై దృష్టి ► డ్వాక్రా సంఘాలు లేదా పీఏసీఎస్ సొసైటీలకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ► అన్ని జిల్లాల డీఎస్‌ఓలతో సమావేశమైన సివిల్ సప్లయి శాఖ కమిషనర్ ► రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ► ఇప్పటికే డీడీలు కట్టేందుకు ముగిసిన గడువు ► డీలర్లకు మద్దతుగా 25 నుంచి హమాలీల సమ్మె రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో ప్రజా పంపిణీపై ఎలాంటి ప్రభావం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. డీలర్లు ఆగస్టు నుంచి సమ్మెకు దిగితే ఏం చేయాలనే దానిపై బుధవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల డీఎస్‌ఓలతో సివిల్ సప్లయి శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్వాక్రా సంఘాలు లేదా పీఏసీఎస్ సొసైటీల ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయాన్ని అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : డ్వాక్రా సంఘాలు, పీఏసీఎస్ సొసైటీల ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలనే నిర్ణయం కనుక అమల్లోకి వస్తే డీడీలు ఎలా కట్టించాలి.. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే ముందుగా చెల్లించి తరువాత తిరిగి వసూలు చేయిద్దామా.. లేదా వారే డబ్బులు కట్టుకోవాలని చెబుదామా.. తదితర అంశాల సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు. వీరికి బియ్యం, కిరోసిన్ ఇతర సరుకులను సరఫరా చేయడానికి 1,336 మంది డీలర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 751 రేషన్ షాపులు ఉండగా, ఆహార భద్రతా, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు కలిపి 3,76,000 వరకు ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెలా 7,900 మెట్రిక్ టన్నుల బియ్యం ఖర్చు చేస్తున్నారు. అయితే ఇలా ప్రతి నెలా లబ్ధిదారులకు బియ్యం అందించాలంటే రేషన్ డీలర్లు మీ సేవా కేంద్రాల్లో డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా 20 వరకు అలాట్మెంట్ కాపీ రాగానే 25వ తేదీలోగా డీడీలను కట్టాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు 1వ తేదీ నుంచి సరుకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం రేషన్ డీలర్లు తమ 18 రకాల కోరికలు తీర్చాలని, లేకపోతే ఆగస్టు నెల నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు డీలర్లు ఆగస్టు నెల కోటాకు సంబంధించిన డీడీలు ఇంత వరకు కట్టలేదు. డీడీలు కట్టేందుకు కూడా గడువు ముగిసి రెండ్రోజులు అవుతోంది. రేషన్ డీలర్ల సమ్మెకు మద్దతుగా ఎంఎల్ఎస్ పాయింట్లలో పని చేసే దాదాపు 160 మంది సివిల్ సప్లయి హమాలీలు కూడా ఈ నెల 25 నుంచే సమ్మెలోకి దిగారు. దీంతో ప్రభుత్వానికి పీడీఎస్ బియ్యం బస్తాలను లారీల్లో ఎక్కించడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం తప్పనిసరి కావడంతో జిల్లా సివిల్ సప్లయి శాఖ అధికారులు హమాలీలతో చర్చలు జరిపారు. అంగన్వాడీలు, పాఠశాలలకు సంబంధించిన బియ్యం బస్తాలను లారీల్లో ఎక్కిస్తామని, రేషన్ షాపులకు సంబంధించినవి ఎక్కించబోమని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గని రేషన్ డీలర్లు... గత కొన్ని సంవత్సరాలుగా వస్తూ పోతున్న ప్రభుత్వాలు రేçషన్ డీలర్ల సమస్యలను పట్టించుకోకపోవడం, గతంలో పదికి పైగా ఉన్న సరుకులు నేడు బియ్యం, కిరోసిన్‌తో రెండుకు చేరాయి. దీంతో డీలర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం క్వింటాలు బియ్యంకు కేంద్రం వాటా రూ.55, రాష్ట్ర వాటాగా రూ.15 కలిపి మొత్తంగా రూ.70 చొప్పున రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.70లకు గాను రూ.20 మాత్రమే కమీషన్‌ను చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో తమను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.30వేల వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్లుగా ప్రభుత్వం ముందుంచారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు నెల నుంచి సమ్మెకు దిగుతామని రేషన్ డీలర్లు నెల రోజుల ముందుగానే వినతుల ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం దిగి రాకుంటే సమ్మె చేయడం అనివార్యమని స్పష్టం చేస్తున్నారు. రేపు తుది నిర్ణయం..? కోరికలు తీర్చాలన్న రేషన్ డీలర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కమిషనర్ సమావేశంలో ఈ నెల 28న మళ్లీ ఒక సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్ డీలర్లు, హమాలీలు, సివిల్ సప్లయి శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. చర్చల్లో ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.