సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్‌ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. డీలర్లను తొలగించి వారి స్థానంలో జూలై 5 నుంచి మహి ళా సంఘాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో పేదలకు సకాలంలో సరుకులు అందించేలా ప్రణాళికలు రూపొందించింది.
సరుకుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు...
గౌరవ వేతనం, కమీషన్ల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించడం తెలిసిందే. సరుకుల కోసం ఈ నెల 28లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు డెడ్‌లైన్ పెట్టగా 17,200 మంది డీలర్లకుగాను గురువారం సాయంత్రానికి కేవలం 609 మందే డీడీలు కట్టారు. దీంతో వారిపై చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులను వెలువరించే అవకాశాలున్నాయి. అయితే డీలర్ల సమ్మె నేపథ్యంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఎంసీహెచ్‌ఆర్‌డీలో గురువారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్‌వోలు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
అర్హులైన ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ నెల 5 నుంచి పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీని చేపట్టాలని, స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైతే గడువు పొడిగించాలని సూచించారు.
మహిళా సంఘాలకు బాధ్యతల అప్పగింత...
పేదలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మహిళా సంఘాలు, అందుబాటులో ఉన్న చోట ఎన్‌ఆర్ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపట్టాలని అధికారులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ రేషన్ షాపులవారీగా మహిళా సంఘాలను గుర్తించడంలో పారదర్శక విధానాన్ని పాటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు వాటిని పర్యవేక్షించాలని సూచించారు.
రికార్డుల నిర్వాహణ కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు డీలర్‌షిప్ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జులై 1న మీ–సేవ కేంద్రాల్లో అధికారులు డీడీలు కట్టించాలన్నారు. సరుకుల పంపిణీ కంటే ముందు ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, పంపిణీ కోసం లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ, ఐకేపీ, కమ్యూనిటీ హాళ్లు, యూత్ బిల్డింగ్‌లను గుర్తించాలని సబర్వాల్ పేర్కొన్నారు.
వేయింగ్ మెషిన్లను సమకూర్చుకునేందుకు తూనికలు, కొలతలశాఖ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి సరుకులను తరలించేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకోవాలని, కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని అకున్ సబర్వాల్ అధికారులకు సూచించారు.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు, ఫిర్యాదులతోపాటు సమన్వయం కోసం 24 గంటలు పనిచేసేలా రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444ను అందు బాటులో ఉంచామని అకున్ సబర్వాల్ తెలిపారు. మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేషన్ పంపిణీలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్వోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని చెప్పారు.
సమ్మె విరమించే ప్రసక్తే లేదు: రేషన్ డీలర్ల సంఘం
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రేషన్ డీలర్ల సమ్మె విరమించే ప్రసక్తే లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. భయపెట్టేందుకు అక్రమంగా 14 వేల మంది డీలర్లను సస్పెండ్ చేయడం విచారకరమని వాపోయారు. డీలర్లకు నోటీసులు మాత్రం అందలేదని పేర్కొన్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలర్లకు రావాల్సిన సుమారు రూ.600 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా డీలర్లకు వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, భయపెట్టడం తగదని హితవు పలికారు. బంగారు తెలంగాణలో రేషన్ డీలర్ల బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment