ఏం చేద్దాం! | Ration dealer strike | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం!

Published Thu, Jul 27 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

ఏం చేద్దాం!

ఏం చేద్దాం!

► ఆగస్టు కోటా పంపిణీకి ప్రత్యామ్నాయాలపై దృష్టి
► డ్వాక్రా సంఘాలు లేదా పీఏసీఎస్‌  సొసైటీలకు బాధ్యతలు ఇచ్చే అవకాశం
► అన్ని జిల్లాల డీఎస్‌ఓలతో సమావేశమైన సివిల్‌ సప్లయి శాఖ కమిషనర్‌
►  రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం
► ఇప్పటికే డీడీలు కట్టేందుకు ముగిసిన గడువు
► డీలర్లకు మద్దతుగా 25 నుంచి హమాలీల సమ్మె


రేషన్‌ డీలర్ల సమ్మె నేపథ్యంలో ప్రజా పంపిణీపై ఎలాంటి ప్రభావం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. డీలర్లు ఆగస్టు నుంచి సమ్మెకు దిగితే ఏం చేయాలనే దానిపై బుధవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల డీఎస్‌ఓలతో సివిల్‌ సప్లయి శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్వాక్రా సంఘాలు లేదా పీఏసీఎస్‌ సొసైటీల ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయాన్ని అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది.

ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌) : డ్వాక్రా సంఘాలు, పీఏసీఎస్‌ సొసైటీల ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలనే నిర్ణయం కనుక అమల్లోకి వస్తే డీడీలు ఎలా కట్టించాలి.. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే ముందుగా చెల్లించి తరువాత తిరిగి వసూలు చేయిద్దామా.. లేదా వారే డబ్బులు కట్టుకోవాలని చెబుదామా.. తదితర అంశాల సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు. వీరికి బియ్యం, కిరోసిన్‌ ఇతర సరుకులను సరఫరా చేయడానికి 1,336 మంది డీలర్లు ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 751 రేషన్‌ షాపులు ఉండగా, ఆహార భద్రతా, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు కలిపి 3,76,000 వరకు ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెలా 7,900 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఖర్చు చేస్తున్నారు. అయితే ఇలా ప్రతి నెలా లబ్ధిదారులకు బియ్యం అందించాలంటే రేషన్‌ డీలర్లు మీ సేవా కేంద్రాల్లో డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా 20 వరకు అలాట్‌మెంట్‌ కాపీ రాగానే 25వ తేదీలోగా డీడీలను కట్టాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు 1వ తేదీ నుంచి సరుకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం రేషన్‌ డీలర్లు తమ 18 రకాల కోరికలు తీర్చాలని, లేకపోతే ఆగస్టు నెల నుంచి రేషన్‌ దుకాణాలు మూసివేసి ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు డీలర్లు ఆగస్టు నెల కోటాకు సంబంధించిన డీడీలు ఇంత వరకు కట్టలేదు. డీడీలు కట్టేందుకు కూడా గడువు ముగిసి రెండ్రోజులు అవుతోంది. రేషన్‌ డీలర్ల సమ్మెకు మద్దతుగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లలో పని చేసే దాదాపు 160 మంది సివిల్‌ సప్లయి హమాలీలు కూడా ఈ నెల 25 నుంచే సమ్మెలోకి దిగారు. దీంతో ప్రభుత్వానికి పీడీఎస్‌ బియ్యం బస్తాలను లారీల్లో ఎక్కించడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం తప్పనిసరి కావడంతో జిల్లా సివిల్‌ సప్లయి శాఖ అధికారులు హమాలీలతో చర్చలు జరిపారు. అంగన్‌వాడీలు, పాఠశాలలకు సంబంధించిన బియ్యం బస్తాలను లారీల్లో ఎక్కిస్తామని, రేషన్‌ షాపులకు సంబంధించినవి ఎక్కించబోమని స్పష్టం చేశారు.

వెనక్కి తగ్గని రేషన్‌ డీలర్లు...
గత కొన్ని సంవత్సరాలుగా వస్తూ పోతున్న ప్రభుత్వాలు రేçషన్‌ డీలర్ల సమస్యలను పట్టించుకోకపోవడం, గతంలో పదికి పైగా ఉన్న సరుకులు నేడు బియ్యం, కిరోసిన్‌తో రెండుకు చేరాయి. దీంతో డీలర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం క్వింటాలు బియ్యంకు కేంద్రం వాటా రూ.55, రాష్ట్ర వాటాగా రూ.15 కలిపి మొత్తంగా రూ.70 చొప్పున రేషన్‌ డీలర్లకు కమీషన్‌ చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.70లకు గాను రూ.20 మాత్రమే కమీషన్‌ను చెల్లిస్తోంది.

ఈ నేపథ్యంలో  తమను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రేషన్‌ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.30వేల వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్లుగా ప్రభుత్వం ముందుంచారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు నెల నుంచి సమ్మెకు దిగుతామని రేషన్‌ డీలర్లు నెల రోజుల ముందుగానే వినతుల ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం దిగి రాకుంటే సమ్మె చేయడం అనివార్యమని స్పష్టం చేస్తున్నారు.

రేపు తుది నిర్ణయం..?
కోరికలు తీర్చాలన్న రేషన్‌ డీలర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కమిషనర్‌ సమావేశంలో ఈ నెల 28న మళ్లీ ఒక సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్‌ డీలర్లు, హమాలీలు, సివిల్‌ సప్లయి శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. చర్చల్లో ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement