డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్..
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పదును పెడుతున్నారు. ఓవైపు ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మరోవైపు యథేచ్ఛగా దోపిడీకి తెర తీసిన ప్రభుత్వ పెద్దలు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుతంత్రాలు పన్నుతున్నారు. అందులో తాజా అంకమే ‘కాకినాడ పోర్ట్ వద్ద బియ్యం రాద్ధాంతం’! చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో తన కోవర్టు, మంత్రి నాదెండ్లను ముందుపెట్టి పక్కా పన్నాగంతో సాగించిన డైవర్షన్ రాజకీయ కుట్ర ఇది. మోకాలికి, బోడుగుండుకూ ముడిపెడుతూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం కూటమి పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంతో సాగిన ఈ హైడ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్ట్ నుంచే ఎగుమతి కాకినాడ సీవాటర్ పోర్ట్‌పై నిరాధార ఆరోపణలతో డ్రామా రేషన్‌బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాకినాడ హైడ్రామా ఎపిసోడ్ తేల్చి చెబుతోంది. ఎందుకంటే.. కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్ వేరు... కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ పోర్ట్ నుంచే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఆ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీయాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తమను తాము నిలదీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రం కాకినాడ సీ పోర్ట్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కన్షార్షియాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అదికూడా కేవలం 41 శాతం వాటా మాత్రమే ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ అరబిందో సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం మరో విచిత్రం. సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి లోడింగ్ దేశంలో అన్ని పోర్టుల నుంచి బియ్యం సహా వివిధ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. షిప్పుల్లోకి లోడింగ్ చేసేముందు సమగ్రంగా తనిఖీలు చేసే వ్యవస్థ ఉంది. కేంద్రానికి చెందిన కస్టమ్స్, పోర్ట్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. అందుకోసం నిర్దిష్ట కస్టమ్స్ ప్రోటోకాల్ ఉంది. ఎగుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు ఎగుమతి చేసే సరుకును కూడా పరీక్షిస్తారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించిన తరువాతే ఎగుమతి కోసం షిప్పుల్లోకి లోడ్ చేసేందుకు అనుమతిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసేందుకు యత్నిస్తే వారు ముందుగానే పోర్టుల వద్దే నిలిపివేస్తారు కదా! అటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని వ్యవస్థలు చంద్రబాబు చేతిలోనే..రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్ పోస్టులు... అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోర్టుల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కదా! మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదీ... టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదీ అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పారీ్టకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను... తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును...! ఇంకా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి నేతలే రేషన్ మాఫియా లీడర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీస్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నించారు. పౌరసరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతోందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌నే! ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కుట్రే హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ధాన్యం కొనుగోలులో వైఫల్యంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారానే ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ–క్రాప్ అమలు చేయడం లేదు. మరోవైపు మిల్లర్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీ కమీషన్ల డీల్ కుదుర్చుకుంది. మిల్లర్లకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అనంతరమే మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారని మిల్లర్లే చెబుతున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ‘బియ్యం’ డ్రామను మొదలెట్టారు.మద్యం.. ఇసుకలో దోపిడీ ఇతరులెవరూ మద్యం టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి అడ్డుకుని మరీ టీడీపీ పెద్దలు దోపిడీకి రాచబాట పరిచారు. వేలం పాటలు నిర్వహిస్తూ మరీ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ పెద్దలు ఇసుక రీచ్‌లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెగించారు. ఓ వైపు ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పోతోంది. మరోవైపు ఇసుక రేట్లు భారీగా పెంచేసి సాగిస్తున్న దోపిడీతో టీడీపీ కూటమి పెద్దల సొంత ఖజానా నిండుతోంది. వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అసలు వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించి వారిని రోడ్డున పడేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో నీటినిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలన్న నిర్ణయంతో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహానికి పాల్పడ్డాయి. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడలో సాగించిన రాజకీయ డ్రామా అందులో భాగమేనన్నది తేటతెల్లమవుతోంది. పయ్యావుల కేశవ్ వియ్యంకుడి సంస్థ బియ్యం తరలిస్తున్న షిప్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్ద లంగరు వేసి ఉన్న స్టెల్లా షిప్ వద్ద హైడ్రామా చేసిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్... ఆ సమీపంలోనే లంగరు వేసి ఉన్న ఎంవీ కెన్స్టర్ అనే షిప్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన సంస్థ ఆ షిప్ ద్వారానే బియ్యాన్ని నైజీరియాకు ఎగుమతి చేస్తోంది. ఆయనకు చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఆ షిప్‌ను మాత్రం పవన్ కళ్యాణ్, నాదెండ్ల తనిఖీ చేయలేదు. కేవీ రావు సంస్థ చేతిలోనే కాకినాడ పోర్ట్ యాజమాన్యంఅరబిందో బెదిరించి ఉంటే ఏకంగా 51శాతం వాటా తీసుకునేవారు కదాబెదిరిస్తే ఫ్రీగానే వాటాలు తీసుకునేవారు కదాకాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో వాటాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ప్రైవ్రేటు వ్యవహారం. పోర్ట్ ప్రమోటర్ కేవీ రావు నుంచి 41శాతం వాటాను మాత్రమే అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. మిగిలిన 59 శాతం వాటా కేవీ రావు సంస్థ వద్దే ఉన్నాయి. అంటే కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్‌పై యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలోనే ఉన్నాయి. పోర్ట్ వ్యవహరాల్లో నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉంది. పోర్ట్ ఎండీగా కేవీ రావే ఉండగా... సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. అలాంటిది అరబిందో సంస్థ బెదిరించి పోర్ట్‌లో వాటాలు కొనుగోలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అసత్య ఆరోపణలు చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంతగా బెదిరించి వాటాలు కొనుగోలు చేసి ఉంటే... డబ్బులు ఇచ్చి ఎందుకు వాటాలు కొంటారు..? ఫ్రీగానే తీసేసుకునేవారు కదా. కనీసం మెజార్టీ వాటాలు అంటే 51శాతం వాటాను దక్కించుకునేవారు కూడా. దాంతో పోర్ట్ వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అరబిందో సంస్థకే దక్కేది. అంతేగానీ పోర్టుపై నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకు ఎందుకు విడిచిపెడతారు...! కానీ అరబిందో సంస్థ 41శాతం వాటానే కొనుగోలు చేసి పోర్టులో మైనార్టీ పార్టనర్‌గానే ఉంది. మిగిలిన 59శాతం వాటా కలిగిన కేవీ రావు సంస్థే పోర్ట్‌పై నిర్ణయాధికారాన్ని అట్టిపెట్టుకుంది. వాస్తవాలు ఇవీ...కానీ వాటిని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు లావాదేవీల్లో చంద్రబాబు ప్రభుత్వ జోక్యం ఎందుకో...! కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో నిర్వర్తించాల్సి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి... కానీ వాటిని విస్మరించి రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతుకుముందు ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ? ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి గతంలో తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే అసలు కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసిందే గతంలో చంద్రబాబు ప్రభుత్వమేననే వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీలపరం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ప్రభుత్వ పోర్టులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గతంలో ధారాదత్తం చేసిన... ప్రస్తుతం మరో మూడు పోర్టులను కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు అసలు కుంభకోణానికి పాల్పడినట్టు అవుతుంది కదా..! నిలదీయాల్సింది చంద్రబాబునే కదా...!