ratna babu
-
కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు.. అవి సహజమే: డైరెక్టర్
‘‘ప్రతి రచయిత, దర్శకుడు వారి బలాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. రచయితగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ (కొన్ని కామెడీ సన్నివేశాలు), ‘సీమశాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’లాంటి నవ్వించిన సినిమాలే నాకు ఇండస్ట్రీలో పేరు తెచ్చాయి. దర్శకుడిగా నేను చేసిన రెండు సినిమాలు (బుర్రకథ, సన్నాఫ్ ఇండియా) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నా బలం కామెడీ అని నమ్మి ‘అన్‌స్టాపబుల్’ మూవీ చేశాను. ఇకపై ప్రతి ఏడాది నా నుంచి ఓ నవ్వించే సినిమా వస్తుంది. ఒకవేళ ప్రయోగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కల్యాణ్ పాత్రలో సన్నీ, జిలానీ రాందాస్‌గా సప్తగిరి నటించారు. చాలామంది హాస్యనటులు నటించారు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సినిమా కాన్సెప్ట్‌ని చెప్పలేను. కానీ ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు ఓ పాయింట్‌కు కలుస్తాయి. ఈ అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో రజిత్‌రావు రాజీ పడకుండా నిర్మించారు. నిజం చెప్పాలంటే.. యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాలను తీయడం కంటే కామెడీ సినిమాలు తీయడం కత్తిమీద సాము వంటిది. కానీ ఈ విషయంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లు సక్సెస్ అయ్యారు. నేను రచయితగా ఎలా అయితే నవ్వించానో దర్శకుడిగానూ నవ్వించే సినిమాలే చేస్తాను. ఏ రచయిత అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్) కావాలనుకుంటాడు. నేను అలానే రచయిత నుంచి దర్శకుడిని అయ్యాను. నేను రచయితగా ఉన్నప్పుడు కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా అలాంటివి సహజమే. అయినా ఇప్పుడు ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉన్నాడు. తమిళ పరిశ్రమలో ఎవరైతే కథ రాస్తారో వాళ్లకే దర్శకత్వం చేసే చాన్స్ కూడా ఉంటుంది. తెలుగులో కూడా అది మొదలైనట్లుంది’’ అని అన్నారు. -
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్‌స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్‌స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్‌స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
విశాఖ.. కళాత్మక కీర్తి పతాక
సాక్షి, విశాఖపట్నం: వైవిధ్యభరితమైన విశాఖ వైభవాన్ని విదేశాలకు ఘనంగా చాటిచెప్పే అవకాశం జీ–20 సదస్సుతో సాక్షాత్కరించింది. దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో జరుగుతున్న సన్నాహక సదస్సుల్లో భాగంగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు అత్యంత కళాత్మకంగా నిలుస్తున్నాయి. జీ–20 దేశాల జెండాల వైభవంతో పాటు వసుదైక కుటుంబమనే థీమ్‌ను విశ్వవ్యాప్తం చేస్తూ.. భారతీయ సంప్రదాయాల డిజైన్లు, మ్యూరల్ ఆర్ట్స్‌ను గుంటూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ జాన్ రత్నబాబు బండికొల్ల ప్రపంచానికి పరిచయం చేశారు. రత్నబాబు కళాప్రతిభని చూసి విదేశీ ప్రతినిధులు అచ్చెరువొందుతున్నారు. విభిన్నంగా విశాఖ సదస్సు ఇప్పటివరకూ 20కి పైగా నగరాల్లో ఈ సన్నాహక సదస్సులు జరిగాయి. వీటన్నింటితో పోలిస్తే విశాఖ సదస్సు విభిన్నమైనదిగా గుర్తింపు పొందింది. సభా ప్రాంగణంతో పాటు నగరమంతా మురిసిపోయేలా రూపొందించిన డిజైన్లు అతిథులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీన్ని కళాత్మక సదస్సుగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన జాన్ రత్నబాబు ఏయూలో బీఎఫ్ఏ చేశారు. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జీ–20 విశాఖ లోగో కూడా అద్భుతః జీ–20 థీమ్ అయిన వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్ (వసుదైక కుటుంబం)ని చాటిచెప్పేలా జాన్ లోగో డిజైన్ చేశారు. ♦ ఒక గ్లోబ్లో అక్షర క్రమంలో జీ–20 దేశాల జాతీయ జెండాలను ఆయా దేశాల ప్రజలు పట్టుకుని ఉన్నట్లుగా చిత్రీకరణ చేశారు. మధ్యలో మన జాతీయ వృక్షం మర్రిచెట్టు, జాతీయ పక్షి పురివిప్పిన నెమలిని కూడా చిత్రీకరించారు. ఈ మర్రి వృక్షానికి జీ–20 దేశాల జాతీయ పక్షులు, పుష్పాలు జోడించారు. ♦ అదేవిధంగా వృక్షం చివర్లో వన్ ఫ్యామిలీకి గుర్తుగా నెమలి పింఛాలు, మర్రి వృక్షం మొదట్లో ఒక తండ్రి, తల్లి మధ్యలో బాలుడు, వారి ఇల్లుని, వన్ ఫ్యూచర్‌కి సింబాలిక్‌గా సీతాకోక చిలుకల పెయింటింగ్ వేశారు. ♦ సదస్సుకు ఆహ్వానం పలుకుతున్న విశాఖనగరానికి చిహ్నంగా సముద్రం, డాల్ఫిన్ నోస్, లైట్‌హౌస్, పక్కనే చర్చి, మధ్యలో గుడి, మసీద్‌ను వేశారు. ♦ మొత్తంగా త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసి.. ప్రతి ఒక్కరూ వహ్వా అనేలా రూపొందించారు. ఈ తరహా డిజైన్లను ఎవరూ రూపొందించలేదని విదేశీ ప్రతినిధులు చెప్పారు. నగర వీధుల్లో వాల్ పెయింటింగ్స్ ఆకట్టుకునేలా చిత్రించారు. ఎప్పుడూ రాని సంతృప్తి ఇప్పుడు వచ్చింది విజువల్ ఆర్టిస్ట్‌గా 150కి పైగా అంతర్జాతీయ అవార్డులు సాధించినా రాని సంతృప్తి.. జీ–20 సదస్సు ప్రధాన లోగో డిజైన్ చేసినప్పుడు వచ్చింది. ప్రముఖుల నుంచి అందుతున్న ప్రశంసలు ఆత్మసంతృప్తినిస్తున్నాయి. విశాఖలో మొత్తం 2000 డిజైన్లతో కాన్సెప్ట్‌లను వాల్‌పెయింటింగ్స్‌గా మలిచాం. 34 రోజుల పాటు శ్రమించి విశాఖను కళాత్మక నగరంగా మలిచాం. – జాన్ రత్నబాబు బండికొల్ల, అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ -
ఆయనకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్
‘‘దర్శకునిగా నా రెండో సినిమా ‘సన్నాఫ్ ఇండియా’. ద్వితీయ చిత్రానికే మోహన్‌బాబు, ఇళయరాజాగార్ల వంటి వారితో పని చేయడం నా అదృష్టం. అలాగే మోహన్‌బాబుగారు అడగ్గానే ఆయన పాత్రకి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. మంచు మోహన్‌బాబు లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. విష్ణు మంచు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ‘డైమండ్’ రత్నబాబు మాట్లాడుతూ.. ‘‘కరోనా టైమ్‌లో మోహన్‌బాబుగారిని కలిసి, చిన్న ప్రయోగం చేద్దాం అని ‘సన్ ఆఫ్ ఇండియా’ కథ చెప్పడంతో ఓకే చెప్పేశారు. చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. విష్ణుగారు కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఒప్పుకున్నారు. ఓటీటీ కోసమని ఈ సినిమా తీశాం. ఫైనల్ ఔట్పుట్ చూశాక థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దామని మోహన్‌బాబుగారు చెప్పడంతో ఇప్పుడు విడుదల చేస్తున్నాం. న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ప్రశ్నించే విధంగా విరూపాక్ష పాత్ర (మోహన్‌బాబు) ఉంటుంది. ఈ మూవీలో హీరో ప్రైవేట్ జైలుని నడుపుతుండటం కొత్త ఆలోచన. సినిమాని కమర్షియల్‌గా కాకుండా ప్రయోగాత్మకంగా తీశాను. ‘పుణ్యభూమి నా దేశం, రాయలసీమ రామన్నచౌదరి’ లాంటి పవర్ఫుల్ డైలాగులు ఈ సినిమా క్లైమాక్స్‌లో చెప్పారు మోహన్‌బాబుగారు. ఈ చిత్రం ప్రారంభం, క్లైమాక్స్ ఎవరూ మిస్ కావొద్దు. చదవండి: ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్ నా ధైర్యం మోహన్‌బాబుగారే.. ఈ చిత్రంలోని డైలాగుల వల్ల ఎలాంటి వివాదాలు వచ్చినా ఆయన చూసుకుంటారు. ఇది మోహన్‌బాబుగారి విలువను తగ్గించే చిత్రమైతే కాదు. మా సినిమా ప్రివ్యూ చూసిన వారు ‘ఇంత సాహసం ఎందుకు చేశారు?’ అంటూనే ‘సినిమా చాలా బాగుంది’ అని అభినందించారు.. ఈ అభినందనలు 18న ప్రేక్షకుల నుంచి వస్తే చాలా హ్యాపీ. ఇండస్ట్రీలో సక్సెస్ అనేదానిపైనే మా తర్వాతి చిత్రాలు ఆధారపడి ఉంటాయి.. ప్రతి దర్శకుడి జీవితం శుక్రవారంతో ముడిపడి ఉంటుంది. ఆ శుక్రవారం తాము హీరో అవుతామా? లేదా? అని ప్రతి డైరెక్టర్ ఎదురు చూస్తుంటాడు. మోహన్‌బాబుగారు, మంచు లక్ష్మీ నటిస్తున్న చిత్రానికి కథ ఇచ్చాను. మోహన్‌బాబుగారి కోసం మరో కమర్షియల్ కథ సిద్ధం చేశాను’’ అన్నారు. -
రాజకీయాలకు గుడ్‌బై, ఈ జన్మకు వద్దనుకుంటున్నాను
‘‘ఎలాంటి తప్పు చేయని ఓ సాధారణ వ్యక్తి ఒక ఎమ్మెల్యే కారణంగా జైలుకి వెళతాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారు? అతను జైలు నుంచి ఎలా బయట పడ్డాడు? తనలాగే ఏ నేరం చేయకుండా జైలులో మగ్గిపోతున్న వారికి ఎలా అండగా నిలిచాడు? అనే కథాంశంతో ‘సన్నాఫ్ ఇండియా’ ఉంటుంది’’ అని హీరో మంచు మోహన్‌బాబు అన్నారు. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో మోహన్‌బాబు లీడ్రోల్లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు విలేకరులతో పంచుకున్న విశేషాలు.... ► ‘సన్నాఫ్ ఇండియా’ మొదలు పెట్టి దాదాపు మూడేళ్లు అయింది. ఈ సినిమా కథని ‘డైమండ్’ రత్నబాబు చెప్పినప్పుడు ఒక విభిన్న కథ, చాలా బాగుందనిపించింది. మా గురువుగారు(దాసరి నారాయణరావు) కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు.. నేను కూడా చూద్దామని ఈ చిత్రం చేశాను. మా మూవీ సూపర్ హిట్ అవుతుందని చెప్పను. కానీ ప్రేక్షకులు చాలా మంచి సినిమా అని అంటారు. మా చిత్రం యువతరంతో పాటు అందరికీ నచ్చుతుంది. ► ‘సన్నాఫ్ ఇండియా’ ని తొలుత ఓటీటీ కోసం తీశాం. కథకు అవసరం మేరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ముద్దు సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. వీటిని విష్ణు ఒప్పుకోలేదు. కానీ, కథకు ఉన్న ప్రాధాన్యత మేరకు పెట్టాల్సి వచ్చింది. ► ‘రాయలసీమ వాళ్లకు భాష తెలియదు’ అనే మాటలు నా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్నాను. నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన తెలుగు భాష పుట్టింది తిరుపతిలోనే. ఆయా ప్రాంతాల్లో యాసలు వేరు ఉండొచ్చు కానీ భాష ఒక్కటే. భారతదేశంలో విలన్‌గా ఎక్కువ మేనరిజమ్స్ చూపించిన వ్యక్తి నేనే. ఈ విషయంలో నటులు అమ్రిష్ పురిగారు నన్ను అభినందించారు. ► ఈ మూవీలో నాది చాలా వైవిధ్యమైన పాత్ర. డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ అందరూ అభినందించేలా ఉంటాయి. నా పాత్రని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ► సమాజంలో హత్యలు, మానభంగాలు చేసేవాళ్లను సమాధి చేయాలి. సొసైటీలో ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్, బస్‌లు, విమానాలు ఉన్నప్పుడు ప్రైవేట్ జైళ్లు కూడా ఉంటే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నాం. ► నేను డైరెక్షన్ చేయడానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.. సినిమా తీసేటప్పుడు షూటింగ్‌కి సమయానికి రానివారిని ఎక్కడ కొట్టాల్సి వస్తుందేమోఅని భయంగా ఉంది. నా జీవితంపై రాస్తున్న పుస్తకం పూర్తి కావొచ్చింది. నా బయోపిక్‌తో సినిమా చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. లక్ష్మి–నేను కలిసి చేస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. విష్ణుతో కూడా ఓ మూవీ చేస్తా. తిరుపతిలో నాలుగున్నర కోట్లతో సాయిబాబా గుడి నిర్మిస్తున్నాం. ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుంది. ► ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రావాలనే ఆసక్తి లేదు. ఈ జన్మకు వద్దనుకుంటున్నాను. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుగార్లు నాకు బంధువులు కాబట్టి వారి తరఫున నా బాధ్యతగా ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నేను సినిమాలు, శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నాను. ► ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు బంధువులు, స్నేహితులున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో పదేళ్లకుపైగా అనుబంధం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణగారి అబ్బాయి పెళ్లిలో నాని, నేను కలిశాం. బ్రేక్‌ఫాస్ట్‌కి తనని ఇంటికి ఆహ్వానించాను.. వచ్చారు. ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామే కానీ మా మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కానీ, సీఎం జగన్‌గారితో జరిగిన భేటీ గురించి కానీ ఎలాంటి చర్చ జరగలేదు. అప్పుడప్పుడూ కలుద్దాం అనుకున్నాం. అంతే.. దానిపై రకరకాలుగా వార్తలు సృష్టించారు. నానీకి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు చేసిన ట్వీట్‌ను కూడా తప్పుబట్టారు. -
మూవీ టైటిల్ విని అల్లు అర్జున్ షాక్ అయ్యాడు: డైరెక్టర్
తన కోసం సిద్దం చేసిన మూవీ టైటిల్ చెప్పగానే బన్ని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు రచయిత డైమండ్ రత్నబాబు గుర్తు చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజా చిత్రం సన్ ఆఫ్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రత్నబాబు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ కోసం ఆయన రాసిన స్క్రిప్ట్ గురించి వివరించారు. ‘ఒక రోజు బన్ని వాసు ద్వారా అల్లు అర్జున్ను కలిశాను. ఆయన కోసం కథ రాశానని చెప్పగానే టైటిల్ ఏంటని అడిగారు. వెంటనే నేను గాలిగాడు అని చెప్పాను. అది విన్న బన్ని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత కథ విని బాగానే చెప్పారు కానీ అది ఆయనను అంతక ఆకట్టుకొలేదు’ అని రత్నాబాబు చెప్పుకొచ్చారు. అంతేగాక ఆ స్క్రిప్ట్ విన్న బన్ని తాను ఇది ఎందుకు చేయాలేనన్నారో కూడా చెప్పాడు. తన కథ విన్న బన్ని ఇది అంత కొత్తగా ఏం లేదని, రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉందన్నారని ఆయన తెలిపారు. ‘నేను రాసిన కథ కొంచెం బోయపాటి శ్రీనివాస్, వీవీ వినాయక్ సినిమా స్టోరీ లైన్లకు దగ్గర ఉందని బన్ని అన్నారు. ఇందులో అంత కొత్తగా ఏం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఈ మూవీ చేయాలని అన్న బన్ని మాటలు నన్ను ఆలోచింప చేశాయి. దీంతో అప్పటి నుంచి నా కథలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నానని’ ఆయన పేర్కొన్నారు. కాగా ఆయన మొదటి సారిగా దర్శకత్వం వహించిన ‘బుర్ర కథ’ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక రెండవ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకంటుందో విడుదలయ్యే వరకు వేచి చూడాలి మరి. -
నేను లూజర్‌ని కాదు.. ఫైటర్ని
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను ఎవ్వరూ ఆపలేరు. మార్నింగ్ షోకే బాగుందని టాక్ వస్తే ఆ సినిమా హిట్టే. ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమానే తీసుకోండి. మార్నింగ్ షో తర్వాత అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా బాగున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆది సాయికుమార్. డైమండ్ రత్నబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశాలు నాయకా, నాయికలుగా శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి నిర్మించిన ‘బుర్రకథ’ నేడు విడుదలదవుతోంది. ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ‘బుర్రకథ’లోది చాలెంజింగ్ రోల్. ఒక మనిషికి రెండు బుర్ర లుంటే ఏ విధంగా నడుచుకుంటాడు? అనేది కథ. ఇలాంటి పట్టున్న క్యారెక్టర్స్ చేస్తేనే మనలో ఉన్న నటుడికి సరైన టెస్ట్. అందుకే చాలెంజ్ అన్నాను. రెండు బుర్రలున్న మనిషి కథ. రెండు క్యారెక్టర్లు చాలా కష్టపడి చేశాడు ఆది అనుకోకూడదు. చాలా ఈజీగా ఈజ్‌గా చేశాడే అనుకోవాలి. ఆ పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది. ► జనరల్‌గా నా సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటే నా పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు నా గత చిత్రాలు ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’లను అబ్జర్వ్ చేస్తే కావాలని నేను కామెడీ చేయను. కథలోనే ఉంటుంది. ఈ సినిమాలో రత్నబాబు ఆ కామెడీ పాళ్లు కొంచెం పెంచారు. కొన్ని కొన్ని సీన్స్ ఎలా పండుతాయో, థియేటర్లో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. ► నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉంటుందని చెప్పగలను. ఉదాహరణకు నా మూడోసినిమా ‘సుకుమారుడు’. అందులో కొంచెం గ్రే షేడ్‌తో ఉండే పాత్ర నాది. అందరూ ఆ సినిమా చేసేటప్పుడు లవర్‌బాయ్ పాత్రలు చేసుకోవచ్చు కదా అన్నారు. ‘ఒకే రకమైన పాత్రలు ఎందుకు?’ అన్నాను. నాలోనూ నటుడున్నాడు, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. సినిమా ఫెయిల్ అయ్యింది. అందరూ నువ్వు బాగానే నటించావు అన్నారు. అదే సినిమా హిట్ అయ్యుంటే అందరూ నా చాయిస్ కరెక్ట్ అనేవారు. కానీ సినిమా ఫెయిల్ అవటంతో మరో ప్రయోగం చేసే అవకాశం లేకుండా పోయింది. అందరూ లవర్‌బాయ్‌గా చేయమంటే ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా చేశాను. అలాగే ‘గాలిపటం’ మంచి సబ్జెక్ట్. మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేశాను. ఆ సినిమాలు కమర్షియల్‌గా బాగానే పే చేశాయి. వాటిలో ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ బాగా వసూలు చేశాయి. ‘శమంతకమణి’ సినిమాతో మళ్లీ ఓ ఎక్స్పెరిమెంట్ చేశాను. అది చాలా మంచి పేరొచ్చింది. ► ‘బుర్రకథ’ సినిమా ద్వారా ఇప్పుడు చాలా పెద్ద పేరొస్తుంది, ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. ప్రతి మనిషిలోనూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి లూసర్, రెండోది ఫైటర్. లూసర్ కిందపడగానే ఓడిపోయాను అని వెళ్లిపోతాడు. కానీ, నేను లూసర్‌ని కాదు ఫైటర్ని. కిందపడ్డా లేచి పరిగెత్తాలి, రేసులో నిలవాలి అనే ఫైటర్‌ను నేను. ► ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా కంప్లీట్ అయ్యింది కానీ, కొంచెం సీజీ బ్యాలెన్స్ ఉంది. మరో రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. ఇవికాక ‘జోడీ’ అనే కంప్లీట్ ఫ్యామిలీ క్యూట్ లవ్‌స్టోరీ చేస్తున్నాను. అందులో ఒక్క ఫైట్ కూడా ఉండదు. తమిళ్, తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇవికాక సాయిరాజ్ అనే నూతన దర్శకునితో చేయబోతున్న చిత్రం షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుంది. లక్ష్యం నెరవేరింది ‘‘హాస్యానందం’ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా. ఆ తర్వాత రచయితగా, ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగా. ఒక సెల్లో రెండు సిమ్‌లు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు మైండ్లు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘బుర్రకథ’’ అని ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో వచ్చాను. ‘బుర్రకథ’ సినిమా ఓపెనింగ్ రోజు నా లక్ష్యం నెరవేరిందని చేతికి ‘డైరెక్టర్’ అని పచ్చబొట్టు వేయించుకున్నా. చిన్న నిర్మాతలను దర్శకుడు కాపాడుకోవాలి. మార్కెట్‌ని బట్టి బడ్జెట్ పెడితేనే నిర్మాతలకు లాభం ఉంటుంది. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తానని నిర్మాతకు మాటిచ్చా.. 46 రోజుల్లోనే పూర్తి చేశా. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నేనే రెండు పాటలు కూడా రాశా. రామాయణం, మహాభారతం, పరిసరాల స్ఫూర్తితో కథలు రాసుకుంటా. హాలీవుడ్లో రచయితకి మంచి పారితోషికం ఉంటుంది. టాలీవుడ్లో డైరెక్టర్‌కి ఉంటుంది. నా రెండో సినిమాగా ‘బుర్రకథ’నే తమిళ్, హిందీలో రీమేక్ చేసే చాన్స్ ఉంది. మూడో సినిమాగా మోహన్‌బాబుగారి ఫ్యామిలీకి సరిపడే కథ రెడీచేశా. ఆయన చాన్స్ ఇస్తే చేస్తా’’ అన్నారు. -
డైలాగ్స్ టు డైరెక్షన్
రచయితల నుంచి దర్శకులుగా మారిన లిస్ట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి.. ఇలా చాలామందే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి రైటర్ డైమండ్ రత్నబాబు కూడా చేరిపోయారు. ‘సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు. ఆది సాయికుమార్ హీరోగా రత్నబాబు ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని సమాచారం. -
బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?
‘‘సిన్మాకి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ దర్శకుడే. మరి, ఆ షిప్కి కథ, కథనం, మాటలు అందిస్తున్న దిక్సూచి లాంటి రైటర్ సంగతేంటి? సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ దర్శకుడికే దక్కుతోంది. రైటర్స్‌కి విలువ తగ్గుతోంది’’ అన్నారు ‘డైమండ్’ రత్నబాబు. ‘భాయ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సీమ శాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలకు మాటలు రాశారీయన. ఈ దసరాకి రిలీజ్ కానున్న ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’కి ఈయనే డైలాగ్ రైటర్. ‘డైమండ్’ రత్నబాబు చెప్పిన సంగతులు... రిజల్ట్ పక్కన పెడితే ‘భాయ్’ మంచి పేరు తీసుకొచ్చింది. భాయ్ బుల్లెట్స్ పేరుతో ఆ సినిమా డైలాగ్స్ రిలీజ్ చేశారు. ‘సీమశాస్త్రి’తో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారితో జర్నీ స్టార్టైంది. ఆ తర్వాత ‘ఈడోరకం ఆడోరకం’, ఇప్పుడీ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’.. హ్యాట్రిక్ కొడతామని ధీమాగా చెప్పగలను. ఇండస్ట్రీలో నేను సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది మంచు ఫ్యామిలీ అభిమానమే. మోహన్‌బాబుగారు నా గాడ్‌ఫాదర్. మంచు విష్ణు ఎంకరేజ్మెంట్ మరువలేనిది. ‘లక్కున్నోడు’కి స్క్రీన్‌ప్లే, మాటలు రాస్తున్నాను. నేడు నా పుట్టినరోజు వేడుకలను ఆ సినిమా షూటింగ్లో జరుపుకోబోతున్నా. ‘బాహుబలి’ దర్శకుడు ఎవరంటే ప్రేక్షకులు ఠక్కున చెబుతారు. ఆ సినిమా డైలాగ్ రైటర్ ఎంతమందికి తెలుసు? రైటర్‌కి రావల్సిన గుర్తింపు, పేరు రావడం లేదు. నేను చెప్పేదొక్కటే ‘సేవ్ రైటర్స్-సేవ్ సినిమా’. త్వరలో దర్శకుడిగా మారుతున్నా. దర్శకుడైన తర్వాత కూడా డైలాగ్ రైటర్‌గా కొనసాగుతా.