సాక్షి, విశాఖపట్నం: వైవిధ్యభరితమైన విశాఖ వైభవాన్ని విదేశాలకు ఘనంగా చాటిచెప్పే అవకాశం జీ–20 సదస్సుతో సాక్షాత్కరించింది. దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో జరుగుతున్న సన్నాహక సదస్సుల్లో భాగంగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు అత్యంత కళాత్మకంగా నిలుస్తున్నాయి.
జీ–20 దేశాల జెండాల వైభవంతో పాటు వసుదైక కుటుంబమనే థీమ్‌ను విశ్వవ్యాప్తం చేస్తూ.. భారతీయ సంప్రదాయాల డిజైన్లు, మ్యూరల్ ఆర్ట్స్‌ను గుంటూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ జాన్ రత్నబాబు బండికొల్ల ప్రపంచానికి పరిచయం చేశారు. రత్నబాబు కళాప్రతిభని చూసి విదేశీ ప్రతినిధులు అచ్చెరువొందుతున్నారు.
విభిన్నంగా విశాఖ సదస్సు
ఇప్పటివరకూ 20కి పైగా నగరాల్లో ఈ సన్నాహక సదస్సులు జరిగాయి. వీటన్నింటితో పోలిస్తే విశాఖ సదస్సు విభిన్నమైనదిగా గుర్తింపు పొందింది. సభా ప్రాంగణంతో పాటు నగరమంతా మురిసిపోయేలా రూపొందించిన డిజైన్లు అతిథులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీన్ని కళాత్మక సదస్సుగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన జాన్ రత్నబాబు ఏయూలో బీఎఫ్‌ఏ చేశారు. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
జీ–20 విశాఖ లోగో కూడా అద్భుతః
జీ–20 థీమ్ అయిన వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్ (వసుదైక కుటుంబం)ని చాటిచెప్పేలా జాన్ లోగో డిజైన్ చేశారు.
♦ ఒక గ్లోబ్‌లో అక్షర క్రమంలో జీ–20 దేశాల జాతీయ జెండాలను ఆయా దేశాల ప్రజలు పట్టుకుని ఉన్నట్లుగా చిత్రీకరణ చేశారు. మధ్యలో మన జాతీయ వృక్షం మర్రిచెట్టు, జాతీయ పక్షి పురివిప్పిన నెమలిని కూడా చిత్రీకరించారు. ఈ మర్రి వృక్షానికి జీ–20 దేశాల జాతీయ పక్షులు, పుష్పాలు జోడించారు.
♦ అదేవిధంగా వృక్షం చివర్లో వన్ ఫ్యామిలీకి గుర్తుగా నెమలి పింఛాలు, మర్రి వృక్షం మొదట్లో ఒక తండ్రి, తల్లి మధ్యలో బాలుడు, వారి ఇల్లుని, వన్ ఫ్యూచర్‌కి సింబాలిక్‌గా సీతాకోక చిలుకల పెయింటింగ్ వేశారు.
♦ సదస్సుకు ఆహ్వానం పలుకుతున్న విశాఖనగరానికి చిహ్నంగా సముద్రం, డాల్ఫిన్ నోస్, లైట్‌హౌస్, పక్కనే చర్చి, మధ్యలో గుడి, మసీద్‌ను వేశారు.
♦ మొత్తంగా త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసి.. ప్రతి ఒక్కరూ వహ్వా అనేలా రూపొందించారు.
ఈ తరహా డిజైన్లను ఎవరూ రూపొందించలేదని విదేశీ ప్రతినిధులు చెప్పారు. నగర వీధుల్లో వాల్ పెయింటింగ్స్ ఆకట్టుకునేలా చిత్రించారు.
ఎప్పుడూ రాని సంతృప్తి ఇప్పుడు వచ్చింది
విజువల్ ఆర్టిస్ట్‌గా 150కి పైగా అంతర్జాతీయ అవార్డులు సాధించినా రాని సంతృప్తి.. జీ–20 సదస్సు ప్రధాన లోగో డిజైన్ చేసినప్పుడు వచ్చింది. ప్రముఖుల నుంచి అందుతున్న ప్రశంసలు ఆత్మసంతృప్తినిస్తున్నాయి. విశాఖలో మొత్తం 2000 డిజైన్లతో కాన్సెప్ట్‌లను వాల్‌పెయింటింగ్స్‌గా మలిచాం. 34 రోజుల పాటు శ్రమించి విశాఖను కళాత్మక నగరంగా మలిచాం. – జాన్ రత్నబాబు బండికొల్ల, అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment