Raudiyijam
-
రౌడీయిజం టీడీపీ సంస్కృతే
కడప కార్పొరేషన్: రౌడీయిజం చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతేనని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుధ్వజమెత్తారు.గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉందనే ఏకైక కారణంతో ఎలాంటి పదవులు లేనివారు సైతం కార్పొరేషన్‌కు వచ్చి అధికారులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీకి ఒకట్రెండు స్థానాలు తేడా ఉన్న సమయంలోనే సురేష్‌బాబు ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా పాలన చేశారని గుర్తు చేశారు. పార్టీ మారిన వారికి మాత్రమే పనులు కేటాయించడంపైనే మేయర్, ఎమ్మెల్యేలు కమిషనర్‌ను ప్రశ్నించారే తప్పా అసభ్యంగా మాట్లాడలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు చిల్లర రౌడీల తరహాలో అధికారులపై దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. 44వ డివిజన్ కార్పొరేటర్ భర్త రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక డీఈని బండబూతులు తిట్టి కొట్టడానికి యత్నించారన్నారు. అలాగే ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, మన్మోహన్రెడ్డిలు కమీషనర్ సమక్షంలోనే హార్ట్ పేషంట్ అయిన ఎస్ఈ మల్లికార్జునను తీవ్ర పదజాలంతో దూషిస్తూ కొట్టేందుకు ప్రయత్నించారని ఉదహరించారు. దీనిపై ఎస్ఈ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఏటూరు రామచంద్రారెడ్డి గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి గట్టిగట్టిగా అరుస్తూ కమిషనర్ ఎదుటే ఏఈ, డీఈలను దూషించారన్నారు. పాలకవర్గనేతగా కమీషనర్‌ను ప్రశ్నించే అధికారం మేయర్‌కు ఉందని, మరి టీడీపీ నేతలు ఏ అధికారంలో అధికారులపై చెలరేగారో చెప్పాలని నిలదీశారు. జనరల్ ఫండ్‌ను అత్యధికంగా వాడుకొన్నది టీడీపీ వారేనన్నారు. టీడీపీ కార్పొరేటర్లకు దమ్ముంటే సీఎం ఇంటి దగ్గర కూర్చొని కార్పొరేషన్‌కు నిధులు తేవాలని సవాల్ విసిరారు. కార్పొరేటర్లు ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి, సానపురెడ్డి శివకోటిరెడ్డి, కె. బాబు, సాయిచరణ్, బండిప్రసాద్, చినబాబు, జమ్మిరెడ్డి, అన్సర్ అలీ, లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్. నాగమల్లారెడ్డి, నాయకులు బి. నిత్యానందరెడ్డి, ఎస్ఎండీ షఫీ, బండి బాబు, రాజగోపాల్‌రెడ్డి, షేక్ అల్తాఫ్ పాల్గొన్నారు. -
రౌడీయిజం చేస్తే గ్రామ బహిష్కరణ
ఎస్పీ రవికృష్ణ కోడుమూరు: ‘మద్యం తాగడం మానుకోండి. ఆవేశంలో గొడవలకు దిగి బతుకులను జైలుపాలు చేసుకోవద్దు. భార్యా, బిడ్డలతో సమాజంలో గౌరవంగా బతకడం నేర్చుకోండి. అలా కాదని రౌడీయిజం చేస్తే గ్రామ బహిష్కరణ తప్పదు’ అని జిల్లా ఎస్పీ రవికృష్ణ రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం సర్కిల్ పరిధిలోని కోడుమూరు, గూడూరు, గోనెగండ్ల, సి.బెళగల్ మండలాల్లోని రౌడీషీటర్లను పిలిపించి ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దాదాపు 40 మంది రౌడీషీటర్ల ప్రవర్తన గురించి విచారించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లను అణచివేయాలని ఎస్ఐలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. తప్పుడు మార్గంలో వ్యవహరించే ఎంతటివారినైనా అణచి వేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడిచేవారి పేర్లను రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఎవరో రెచ్చగొడితే ఆవేశాలకు లోనై గొడవలకు దిగొద్దని రౌడీషీటర్లకు హితవు చెప్పారు. రౌడీషీటర్ల జాబితాలో ఉన్న వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు తమకు నివేదిక అందుతుందన్నారు. నేరాలకు పాల్పడే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పోలీసులతో మాక్‌డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌లు వెంకట్రామిరెడ్డి, విజయ్‌కుమార్, సుజనకుమార్ పాల్గొన్నారు. -
టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఆమదాలవలస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్బాబులపై దాడికి పాల్పడిన టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను కోరారు. తమ నియోజకవర్గంలో శాం తిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు స్పందించకపోతే ప్రజలే రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి మం డలాలకు చెందిన పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన కలెక్టర్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఆరాచకాలు, దాడులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారని వివరించారు. పొందూరు, ఆమదాలవలస స్టేషన్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని మరిచిపోయి టీడీపీకి అనుకూలంగా వ్యవహరి స్తున్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పలు చోట్ల ఓటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు. గురువారం కనుగులవలస వెళుతున్న సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్బాబుల కారును పథకం ప్రకారం అడ్డుకొని వారిపై దాడికి పాల్పడ్డారన్నారు. దీనివెనుక కోర్లకోట, తమ్మయ్యపేటలకు చెందిన టీడీపీ నాయకుల ప్రోద్బలం ఉందని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలిద్దరిని దుండగులు హత్య చేసేందుకు ప్రయత్నించారని, అయితే సమీపంలో ఉన్నవారు వచ్చి రక్షించారని చెప్పారు. అప్పటికే ఇద్దరు నేతలను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అనిల్‌బాబు ఇస్తున్న ఫిర్యాదును తీసుకోవడం లేదని తెలిపారు. దాడికి పాల్పడినవారిపైనా, వారి వెనుక ఉన్న టీడీపీ నాయకులపైనా చర్యలు తీసుకొని శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. ఇటీవల పొందూరు మం డలం నందివాడలో రెండుసార్లు టీడీపీ నాయకులు దాడులు చేశారని, అలాగే దల్లిపేటలో తమ కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. కొరపాం ఆటోలో వస్తుండగా దాడి చేశారని, గృహ నిర్బంధం చేసి హింసించారని పేర్కొన్నారు. సరుబుజ్జిలిలో ఎన్నికల ఏజెం ట్‌పై దాడి చేశారన్నారు. కార్యకర్తలు హింసకు పాల్పడేలా టీడీపీ నేతలు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ నవీన్ గులాఠీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడలేకపోయినా.. వైఫల్యం చెందినా.. లేదా టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయినా.. ప్రజలే రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడాల్పిన పరిస్థితి వస్తుందన్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పందిస్తూ దాడికి పాల్పడిన వారిపైన, ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసినవారిలో వైఎస్ఆర్సీపీ నేతలు బి.ఎల్.నాయుడు, బొడ్డేపల్లి నారాయణరావు, ఎస్.గాంధీ, ఎం.గోపాలకృష్ణ, జి.మధుసూదనరావు, కె.రమేష్, సూర్యారావు, రమేష్, కూన గోపి, బి.ప్రసాద్, ఎస్.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకోండి.. శ్రీకాకుళం క్రైం : జిల్లాలో టీడీపీ రౌడీయిజం రోజురోజుకూ పెరిగిపోతోందని, దీనిని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు తమ్మినేని సీతారాం, తదితరులు ఎస్పీ నవీన్ గులాఠీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని భావించిన టీడీపీ వర్గీయులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్బాబులపై దాడి చేశారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీ సులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.