రౌడీయిజం టీడీపీ సంస్కృతే
కడప కార్పొరేషన్:
రౌడీయిజం చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతేనని వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లుధ్వజమెత్తారు.గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉందనే ఏకైక కారణంతో ఎలాంటి పదవులు లేనివారు సైతం
కార్పొరేషన్‌కు వచ్చి అధికారులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీకి ఒకట్రెండు స్థానాలు తేడా ఉన్న సమయంలోనే సురేష్‌బాబు ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా పాలన చేశారని గుర్తు చేశారు. పార్టీ మారిన వారికి మాత్రమే పనులు కేటాయించడంపైనే మేయర్, ఎమ్మెల్యేలు కమిషనర్‌ను ప్రశ్నించారే తప్పా అసభ్యంగా మాట్లాడలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు చిల్లర రౌడీల తరహాలో అధికారులపై దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు.
44వ డివిజన్ కార్పొరేటర్ భర్త రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక డీఈని బండబూతులు తిట్టి కొట్టడానికి యత్నించారన్నారు. అలాగే
ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, మన్‌మోహన్‌రెడ్డిలు కమీషనర్ సమక్షంలోనే హార్ట్ పేషంట్ అయిన ఎస్‌ఈ మల్లికార్జునను తీవ్ర పదజాలంతో దూషిస్తూ కొట్టేందుకు ప్రయత్నించారని ఉదహరించారు. దీనిపై ఎస్‌ఈ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఏటూరు రామచంద్రారెడ్డి గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి గట్టిగట్టిగా అరుస్తూ కమిషనర్ ఎదుటే ఏఈ, డీఈలను దూషించారన్నారు. పాలకవర్గనేతగా కమీషనర్‌ను ప్రశ్నించే అధికారం మేయర్‌కు ఉందని, మరి టీడీపీ నేతలు ఏ అధికారంలో అధికారులపై చెలరేగారో చెప్పాలని నిలదీశారు. జనరల్ ఫండ్‌ను అత్యధికంగా వాడుకొన్నది టీడీపీ వారేనన్నారు. టీడీపీ కార్పొరేటర్లకు దమ్ముంటే సీఎం ఇంటి దగ్గర కూర్చొని కార్పొరేషన్‌కు నిధులు తేవాలని సవాల్ విసిరారు. కార్పొరేటర్లు ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి, సానపురెడ్డి శివకోటిరెడ్డి, కె. బాబు, సాయిచరణ్, బండిప్రసాద్, చినబాబు, జమ్మిరెడ్డి, అన్సర్ అలీ, లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్. నాగమల్లారెడ్డి, నాయకులు బి. నిత్యానందరెడ్డి, ఎస్‌ఎండీ షఫీ, బండి బాబు, రాజగోపాల్‌రెడ్డి, షేక్ అల్తాఫ్ పాల్గొన్నారు.