రౌడీయిజం చేస్తే గ్రామ బహిష్కరణ
ఎస్పీ రవికృష్ణ
కోడుమూరు:
‘మద్యం తాగడం మానుకోండి. ఆవేశంలో గొడవలకు దిగి బతుకులను జైలుపాలు చేసుకోవద్దు. భార్యా, బిడ్డలతో సమాజంలో గౌరవంగా బతకడం నేర్చుకోండి. అలా కాదని రౌడీయిజం చేస్తే గ్రామ బహిష్కరణ తప్పదు’ అని జిల్లా ఎస్పీ రవికృష్ణ రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం సర్కిల్ పరిధిలోని కోడుమూరు, గూడూరు, గోనెగండ్ల, సి.బెళగల్ మండలాల్లోని రౌడీషీటర్లను పిలిపించి ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దాదాపు 40 మంది రౌడీషీటర్ల ప్రవర్తన గురించి విచారించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లను అణచివేయాలని ఎస్‌ఐలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. తప్పుడు మార్గంలో వ్యవహరించే ఎంతటివారినైనా అణచి వేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడిచేవారి పేర్లను రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఎవరో రెచ్చగొడితే ఆవేశాలకు లోనై గొడవలకు దిగొద్దని రౌడీషీటర్లకు హితవు చెప్పారు. రౌడీషీటర్ల జాబితాలో ఉన్న వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు తమకు నివేదిక అందుతుందన్నారు. నేరాలకు పాల్పడే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పోలీసులతో మాక్‌డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌లు వెంకట్రామిరెడ్డి, విజయ్‌కుమార్, సుజనకుమార్ పాల్గొన్నారు.