ravela son susheelakumar
-
చంచల్‌గూడ జైలుకు రావెల కొడుకు
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ * న్యాయమూర్తి సమక్షంలో సుశీల్, డ్రైవర్ రమేశ్‌ను గుర్తించిన బాధితురాలు * సుశీల్ న్యాయవాదుల బెయిల్ పిటిషన్.. విచారణ 8వ తేదీకి వాయిదా * శనివారం అర్ధరాత్రి హైడ్రామా * పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన సుశీల్, రమేశ్ * చిల్లర కేసు అన్న హోంమంత్రి.. ఎవరి జోక్యం లేదని స్పష్టీకరణ * సుశీల్ ఆ కారులోనే ఉన్నాడు.. అందుకు ఆధారాలున్నాయి: డీసీపీ సాక్షి, హైదరాబాద్: మహిళా టీచర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ కుమారుడు సుశీల్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో హైడ్రామా మధ్య సుశీల్, ఆయన డ్రైవర్ మణికొండ రమేశ్ బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి లొంగిపోయారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో తుర్కయంజాల్‌లోని నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరుపతయ్య నివాసంలో పోలీసులు వారిని హాజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితులకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇదే సమయంలో సుశీల్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన మేజిస్ట్రేట్.. కేసు విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు. అనంతరం సుశీల్, రమేశ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు సుశీల్‌కు 7579 నంబర్‌ను కేటాయించారు. అర్ధరాత్రి హైడ్రామా శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు న్యాయవాదులతో కలసి ఓ పార్టీ ముఖ్య నేత పోలీసుల వద్దకు వెళ్లి సుశీల్‌కు స్టేషన్ బెయిల్‌పై మంతనాలు జరిపినట్టు సమాచారం. అయితే నిర్భయ చట్టం కింద కేసు నమోదవడంతో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని పోలీసులు తిరస్కరించారు. ఇది జరిగిన గంటన్నర వ్యవధిలో సుశీల్, రమేశ్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. అప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో కానీ, ఫోన్లో కానీ అందుబాటులో లేని సుశీల్ అంత తొందరగా వచ్చి లొంగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం ఏడు గంటల వరకు వీరిని పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు.. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో మేజిస్ట్రేట్ తిరుపతయ్య నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ ఐడెంటిఫికేషన్ పరేడ్ ద్వారా సుశీల్, రమేశ్‌ను బాధితురాలు ఫాతిమా బేగం గుర్తించారు. మరోవైపు మేజిస్ట్రేట్ నివాసం వద్ద గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ నాయకులు గంటల తరబడి నిరీక్షించారు. ఉమ్మడి హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న వై.బాబు దగ్గర ఉండి ఆదివారం ఉదయం సుశీల్ బెయిలు పిటిషన్‌పై కసరత్తు చేశారు. ఈ కేసుతో మీకేం సంబంధమని మీడియా ప్రశ్నించగా.. తనకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. మేజిస్ట్రేట్ నివాసం నుంచి బయటకు వస్తూ సుశీల్ కంటతడి పెట్టాడు. కర్చీఫ్‌తో తుడుచుకుంటూ కారులో ఎక్కి కూర్చున్నాడు. సుశీల్ కారులోనే ఉన్నాడు: డీసీపీ సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిన దృశ్యాల్లో రావెల సుశీల్ కారులో ఉన్నట్లు స్పష్టంగా కనబడిందని, ఇందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆదివారం ఆయన మీడియాకు తెలిపారు. ఈ నెల 3న సాయంత్రం 4 గంటల ప్రాంతం లో బంజారాహిల్స్ రోడ్ నం.13లో రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నట్లు ఫోన్ రావడంతో కానిస్టేబుల్ హన్మంతరావు సిబ్బం దితో కలసి వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. అక్కడ తీవ్ర గాయాలైన రమేశ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారన్నారు. కొంతసేపటికే ఫాతిమా బేగం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన యువకుడు, డ్రైవర్ అప్పారావు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అయితే తాము జరిపిన విచారణలో అప్పారావు అనే పేరుతో ఎవరూ లేరని, ఆ రోజు ఘటనా స్థలిలో ఉన్నది మంత్రి డ్రైవర్ రమేశ్ అని తేలిందన్నారు. సుశీల్‌పై ఐపీసీ 354 సెక్షన్ కింద అదనపు కేసు నమోదు చేశామన్నారు. అదో చిల్లర కేసు: నాయిని ‘‘అదో చిల్లర వ్యవహారం.. పొరగాడు అమ్మాయి చెయ్యి పట్టి లాగిండు. మా స్థాయిలో జోక్యం చేసేదేముంది? మా పోలీసులకు అన్ని విషయాలు బాగా తెలుసు. వాళ్లే చూసుకుంటారు. ఎవ్వరి డెరైక్షన్‌లో నడుచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు సొంత డెరైక్షన్ ఉంది..’’ అని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆదివారం రాత్రి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ డెరైక్షన్లోనే తన కుమారుడిపై కేసు పెట్టారని మంత్రి రావెల కిశోర్ చేసిన ఆరోపణలను విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. కాగా, టీడీపీలో రేవంత్ రెడ్డి ఒక్కడే మిగులుతాడని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ పాలన పట్ల ఆకర్షితులై విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. తమ ఎమ్మెల్యేల సంఖ్య 63 నుంచి 90కు చేరే అవకాశాలున్నాయన్నారు. -
రావెల.. తప్పుకో
* ఎక్కడేం జరిగినా వైఎస్ జగనే బాధ్యుడా? * వైఎస్సార్సీపీ ఎల్పీ ఉపనేత ఉప్పులేటి కల్పన మండిపాటు సాక్షి, హైదరాబాద్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అరెస్టయిన కుమారుడు సుశీల్‌ను వెనకేసుకొస్తున్న ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని, లేదా ఏపీ సీఎం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కుమారుడు తప్పు చేస్తే దాని వెనుక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హస్తం ఉందని మంత్రి ఆరోపించడమేమిటన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక జగన్ హస్తం ఉందనడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కుమారుడు మహిళను వేధించి కేసులో ఇరుక్కున్నా జగన్‌కే ఆపాదిస్తారా? కాపు సభలో గొడవ జరిగితే దాని వెనుక కూడా జగన్ హస్తమే ఉందా? కాకి అరిచినా దానికీ జగనే బాధ్యుడా? ఇదంతా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఉందని ధ్వజమెత్తారు. బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు కారు రేసింగ్ చేస్తూ ఓ విద్యార్థి మరణానికి కారకుడైతే దాని వెనుకా జగనే ఉన్నాడని నిందించారన్నారు. బాబు పాలనలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఆయనతోపాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దం టుందా అని చంద్రబాబు తనకు మహిళలపై ఉన్న చిన్న చూపును చాటుకున్నారని చెప్పారు. మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలి ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే, రిషితేశ్వరి మరణానికి కారకుడైన అగ్రకుల ప్రిన్సిపాల్ బాబూరావును చంద్రబాబు వెనకేసుకొచ్చారని కల్పన మండిపడ్డారు. ఏలూరులో ఇందుమతి అనే యువతిని దహనం చేశారని, ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. మహిళలను వేధించిన వారిపట్ల పోలీసులు మెతకవైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికారపక్షం చెప్పినట్లు వ్యవహరిస్తూ నిందితులను పట్టించుకోవడం లేదన్నారు. మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అమ్మాయిలు వెంటపడితే కడుపు చేయాలంటూ పచ్చిగా మాట్లాడిన సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు గర్హనీయమని ఉప్పులేటి ధ్వజమెత్తారు. మహిళలంతా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. -
మీడియా సమావేశం నుంచి రావెల పలాయనం
హైదరాబాద్: తన కొడుకు రావెల సుశీల్ అమాయకుడని, ఏ తప్పూ చేయలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి జరిగిన ఘటనకు సంబంధించి కాకుండా విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. తెలంగాణ పోలీసులపై పరోక్షంగా విమర్శలు చేశారు. బయటి వ్యక్తుల ఒత్తిడితో కేసు మార్చారని పోలీసులను తప్పుపట్టారు. తన కొడుకు నిర్దోషి అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ప్రెస్‌మీట్ మొత్తం పొంతన లేకుండా మాట్లాడిన రావెల కిశోర్ బాబు మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మంత్రి సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తాగినమైకంలో ఓ మహిళా టీచర్ చేయిపట్టుకుని లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన కేసులో రావెల కిషోర్‌బాబు కొడుకు రావెల సుశీల్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్, అతని కారు డ్రైవర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో శనివారం అర్థరాత్రి లొంగిపోయారు. మీడియా సమావేశంలో మంత్రి కిశోర్ బాబు మాట్లాడుతూ.. 'నా కొడుకు అమాయకుడు, నిర్దోషి. సుశీల్‌పై తప్పుడు కేసులు బనాయించారు. వేరే ఫుటేజి తీసుకువచ్చి నా కొడుకు తప్పుచేసినట్లు చిత్రీకరిస్తున్నారు. నా కొడుకు, డ్రైవర్‌ను స్థానికులు అకారణంగా కొట్టారు. మొదట ఎప్ఐఆర్లో నా కొడుకు పేరు లేదు. తర్వాత పోలీసులపై ఒత్తడి తెచ్చి కేసు పెట్టించారు. చేయిపట్టుకుని లాగడానికి ప్రయత్నించాడని మాత్రమే ఫిర్యాదులో ఉంది. వీడియో ఫుటేజీని మార్ఫింగ్ చేసి నా కొడుకును ఇరికించారు. మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోంది' అని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎక్కువ సేపు ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. -
లొంగిపోయిన రావెల సుశీల్
సాక్షి, హైదరాబాద్: తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు రావెల సుశీల్(24), అతని కారు డ్రైవర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో శనివారం అర్థరాత్రి లొంగిపోయారు. స్టేషన్ బెయిల్ కోసం రావెల సుశీల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. నిందితులిద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం వారిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. మొదట ఐపీసీ సెక్షన్ 509 ఈవ్‌టీజింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిర్భయ చట్టాన్ని అదనంగా చేర్చారు. బాధితురాలు ఫాతిమా బేగం ఫిర్యాదు మేరకు మొదట సుశీల్ కారు డ్రైవర్ అప్పారావుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు నిందితుడిని వదిలేయడంపై ఫాతిమా పోలీసులను ప్రశ్నించడంతో పాటు మీడియాను ఆశ్రయించడంతో సుశీల్‌పై ఈవ్‌టీజింగ్‌తో పాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 3న సాయంత్రం బంజారాహిల్స్‌లోని అంబేడ్కర్‌నగర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా స్కూల్ నుండి ఇంటికి నడిచి వెళుతుండగా సుశీల్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. నిందితులు సుశీల్, అప్పారావులకు సీఆర్పీసీ 41(ఎ) కింద జారీ చేసిన నోటీసులు అందుకోవడానికి మంత్రి కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. దీంతో మంత్రి రావెల వ్యక్తిగత కార్యదర్శికి పోలీసులు నోటీసులు అందించారు. విచారణ నిమిత్తం రెండు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని, గడువులోగా హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని స్పష్టంచేశారు. మరోవైపు మంత్రి కిశోర్‌బాబు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి తన కుమారుడు సుశీల్‌ను సోమవారం అప్పగిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. చివరకు శనివారం రాత్రి సమయంలో బంజారాహిల్స్ పీఎస్‌లో రావెల సుశీల్ లొంగిపోయాడు. రావెల సుశీల్, డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించారు. స్టేషన్ బెయిల్ కోసం రావెల సుశీల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాల్లో వెంటాడిన దృశ్యాలు... కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నం.13లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఇందులో నడుచుకుంటూ వెళుతున్న ఫాతిమాను సుశీల్ వాహనం వెంటాడటం, ఆమె పక్కనే తీసుకువచ్చి నిలపడం, కారు అద్దాన్ని దించి ఏవో మాట్లాడటం కనిపించాయి. సీసీ కెమెరాల్లో రికార్డు కాని వివరాలను బాధితురాలితో పాటు స్థానికుల నుండి పోలీసులు తెలుసుకున్నారు. కుక్కపిల్ల అడ్డొచ్చింది: ఫేస్బుక్లో సుశీల్ గురువారం తాను కారులో ఇంటికి వెళుతుండగా బంజారాహిల్స్ రోడ్ నం.13 వద్ద కుక్కపిల్ల అడ్డురావడంతో కారును ఆపానని, ఆ కుక్కను పక్కకు తీసేంతలో ఓ యువతి అక్కడికి వచ్చిందని, కారణం లేకుండానే తిట్టడం మొదలెట్టిందని సుశీల్ శనివారం ఉదయం ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. తాను స్పందించేలోగానే ఆమె గొడవ విని చుట్టుపక్కల వారు వచ్చారని, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. అయితే కుక్కపిల్ల అడ్డొచ్చిందని సుశీల్ చెప్పిన మాటలకు.. పోలీసులు విడుదల చేసిన సీసీ కెమెరా దృశ్యాలకు పొంతనే లేదు. అసలు ఆ ఫుటేజీల్లో ఎక్కడా కుక్క పిల్ల లేకపోవడం గమనార్హం. అప్పారావు కాదు.. రమేశ్ అప్పారావు అనే డ్రైవర్‌తో పాటు సుశీల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫాతిమా చెప్పిన ప్రకారం పోలీసులు అప్పారావు పేరుతో కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో కారులో ఉన్న డ్రైవర్ అప్పారావు కాదని అతని పేరు రమేష్ అని దర్యాప్తులో తేలింది. శుక్రవారం రాత్రి ఫాతిమా ఫిర్యాదును రికార్డు చేయగా ఆమె చెప్పిన వివరాల ప్రకారం డ్రైవర్ పేరు రమేష్ అని తేలింది. స్థానికుల దాడిలో గాయపడినది కూడా రమేషే. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రమేష్‌కు వైద్యులు చికిత్స చేసి శనివారం డిశ్చార్జ్ చేశారు. ఇంతకూ అప్పారావు ఎవరని పోలీసులు ఆరా తీయగా మంత్రి ఇంట్లో పనిచేసే అటెండర్ పేరు అప్పారావు అని తేలింది. పక్కా ఆధారాలతో ముందుకు: డీసీపీ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఫాతిమా ఫిర్యాదుపై పకడ్బందీ విచారణతో ముందుకు వెళుతున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఫాతి మా ఫిర్యాదును విచారిస్తే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తుల్లో ఏపీ మంత్రి రావెల కిషోర్రాబు కొడుకు సుశీల్ ఉన్నాడని తేలిందన్నా రు. అయితే ఈ విషయంలో పోలీసులు ఎక్కడా ఒత్తిళ్లకు లొంగలేదని, ఓ పద్ధతి ప్రకారం విచారణను పక్కా ఆధారాలతో ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. బాధితురాలి ముందుకు నిందితులు మరోవైపు రావెల సుశీల్‌తో పాటు అతని డ్రైవర్‌ను పోలీసులు బాధితురాలు ఫాతిమా ముందు హాజరుపర్చనున్నారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని బాధితురాలు గుర్తించాల్సి ఉంటుంది. తొలిసారిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఐబీ అనే ఈ తరహా గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్ట నున్నారు.