చంచల్‌గూడ జైలుకు రావెల కొడుకు
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
* న్యాయమూర్తి సమక్షంలో సుశీల్, డ్రైవర్ రమేశ్‌ను గుర్తించిన బాధితురాలు
* సుశీల్ న్యాయవాదుల బెయిల్ పిటిషన్.. విచారణ 8వ తేదీకి వాయిదా
* శనివారం అర్ధరాత్రి హైడ్రామా
* పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సుశీల్, రమేశ్
* చిల్లర కేసు అన్న హోంమంత్రి.. ఎవరి జోక్యం లేదని స్పష్టీకరణ
* సుశీల్ ఆ కారులోనే ఉన్నాడు.. అందుకు ఆధారాలున్నాయి: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళా టీచర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ కుమారుడు సుశీల్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో హైడ్రామా మధ్య సుశీల్, ఆయన డ్రైవర్ మణికొండ రమేశ్ బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి లొంగిపోయారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో తుర్కయంజాల్‌లోని నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరుపతయ్య నివాసంలో పోలీసులు వారిని హాజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితులకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇదే సమయంలో సుశీల్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన మేజిస్ట్రేట్.. కేసు విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు. అనంతరం సుశీల్, రమేశ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు సుశీల్‌కు 7579 నంబర్‌ను కేటాయించారు.
అర్ధరాత్రి హైడ్రామా
శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు న్యాయవాదులతో కలసి ఓ పార్టీ ముఖ్య నేత పోలీసుల వద్దకు వెళ్లి సుశీల్‌కు స్టేషన్ బెయిల్‌పై మంతనాలు జరిపినట్టు సమాచారం. అయితే నిర్భయ చట్టం కింద కేసు నమోదవడంతో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని పోలీసులు తిరస్కరించారు. ఇది జరిగిన గంటన్నర వ్యవధిలో సుశీల్, రమేశ్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. అప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో కానీ, ఫోన్‌లో కానీ అందుబాటులో లేని సుశీల్ అంత తొందరగా వచ్చి లొంగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం ఏడు గంటల వరకు వీరిని పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు.. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
సాయంత్రం 4 గంటల సమయంలో మేజిస్ట్రేట్ తిరుపతయ్య నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ ఐడెంటిఫికేషన్ పరేడ్ ద్వారా సుశీల్, రమేశ్‌ను బాధితురాలు ఫాతిమా బేగం గుర్తించారు. మరోవైపు మేజిస్ట్రేట్ నివాసం వద్ద గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ నాయకులు గంటల తరబడి నిరీక్షించారు. ఉమ్మడి హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న వై.బాబు దగ్గర ఉండి ఆదివారం ఉదయం సుశీల్ బెయిలు పిటిషన్‌పై కసరత్తు చేశారు. ఈ కేసుతో మీకేం సంబంధమని మీడియా ప్రశ్నించగా.. తనకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. మేజిస్ట్రేట్ నివాసం నుంచి బయటకు వస్తూ సుశీల్ కంటతడి పెట్టాడు. కర్చీఫ్‌తో తుడుచుకుంటూ కారులో ఎక్కి కూర్చున్నాడు.
సుశీల్ కారులోనే ఉన్నాడు: డీసీపీ
సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిన దృశ్యాల్లో రావెల సుశీల్ కారులో ఉన్నట్లు స్పష్టంగా కనబడిందని, ఇందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆదివారం ఆయన మీడియాకు తెలిపారు. ఈ నెల 3న సాయంత్రం 4 గంటల ప్రాంతం లో బంజారాహిల్స్ రోడ్ నం.13లో రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నట్లు ఫోన్ రావడంతో కానిస్టేబుల్ హన్మంతరావు సిబ్బం దితో కలసి వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. అక్కడ తీవ్ర గాయాలైన రమేశ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారన్నారు. కొంతసేపటికే ఫాతిమా బేగం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన యువకుడు, డ్రైవర్ అప్పారావు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అయితే తాము జరిపిన విచారణలో అప్పారావు అనే పేరుతో ఎవరూ లేరని, ఆ రోజు ఘటనా స్థలిలో ఉన్నది మంత్రి డ్రైవర్ రమేశ్ అని తేలిందన్నారు. సుశీల్‌పై ఐపీసీ 354 సెక్షన్ కింద అదనపు కేసు నమోదు చేశామన్నారు.
అదో చిల్లర కేసు: నాయిని
‘‘అదో చిల్లర వ్యవహారం.. పొరగాడు అమ్మాయి చెయ్యి పట్టి లాగిండు. మా స్థాయిలో జోక్యం చేసేదేముంది? మా పోలీసులకు అన్ని విషయాలు బాగా తెలుసు. వాళ్లే చూసుకుంటారు. ఎవ్వరి డెరైక్షన్‌లో నడుచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు సొంత డెరైక్షన్ ఉంది..’’ అని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆదివారం రాత్రి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ డెరైక్షన్‌లోనే తన కుమారుడిపై కేసు పెట్టారని మంత్రి రావెల కిశోర్ చేసిన ఆరోపణలను విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. కాగా, టీడీపీలో రేవంత్ రెడ్డి ఒక్కడే మిగులుతాడని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ పాలన పట్ల ఆకర్షితులై విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. తమ ఎమ్మెల్యేల సంఖ్య 63 నుంచి 90కు చేరే అవకాశాలున్నాయన్నారు.