మీడియా సమావేశం నుంచి రావెల పలాయనం
హైదరాబాద్: తన కొడుకు రావెల సుశీల్ అమాయకుడని, ఏ తప్పూ చేయలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి జరిగిన ఘటనకు సంబంధించి కాకుండా విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. తెలంగాణ పోలీసులపై పరోక్షంగా విమర్శలు చేశారు. బయటి వ్యక్తుల ఒత్తిడితో కేసు మార్చారని పోలీసులను తప్పుపట్టారు. తన కొడుకు నిర్దోషి అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ప్రెస్మీట్ మొత్తం పొంతన లేకుండా మాట్లాడిన రావెల కిశోర్ బాబు మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మంత్రి సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తాగినమైకంలో ఓ మహిళా టీచర్ చేయిపట్టుకుని లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన కేసులో రావెల కిషోర్‌బాబు కొడుకు రావెల సుశీల్పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్, అతని కారు డ్రైవర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి లొంగిపోయారు.
మీడియా సమావేశంలో మంత్రి కిశోర్ బాబు మాట్లాడుతూ.. 'నా కొడుకు అమాయకుడు, నిర్దోషి. సుశీల్పై తప్పుడు కేసులు బనాయించారు. వేరే ఫుటేజి తీసుకువచ్చి నా కొడుకు తప్పుచేసినట్లు చిత్రీకరిస్తున్నారు. నా కొడుకు, డ్రైవర్ను స్థానికులు అకారణంగా కొట్టారు. మొదట ఎప్ఐఆర్లో నా కొడుకు పేరు లేదు. తర్వాత పోలీసులపై ఒత్తడి తెచ్చి కేసు పెట్టించారు. చేయిపట్టుకుని లాగడానికి ప్రయత్నించాడని మాత్రమే ఫిర్యాదులో ఉంది. వీడియో ఫుటేజీని మార్ఫింగ్ చేసి నా కొడుకును ఇరికించారు. మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోంది' అని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎక్కువ సేపు ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు.